Hrithik Roshan Turns Director For Krrish 4 Movie: పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటింగ్ మూవీ సూపర్ హీరో మూవీ 'క్రిష్ 4'. క్రిష్ ఫ్రాంచైజ్‌లో నాలుగో భాగంగా రూపొందబోతున్న ఈ మూవీ అప్డేట్ గురించి చాలాకాలంగా మూవీ లవర్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ మూవీ గురించి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. బాలీవుడ్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం 'క్రిష్ 4'కు హృతిక్ రోషన్ దర్శకత్వం వహించబోతున్నారు. అలాగే మూవీ షూటింగ్‌కు కూడా ముహూర్తం ఫిక్స్ చేసినట్టు సమాచారం.
క్రిష్ డైరెక్టర్ అని కన్ఫామ్ చేసిన రాకేష్ రోషన్
ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఆదిత్య చోప్రా, రాకేష్ రోషన్‌తో కలిసి 'క్రిష్ 4' మూవీని నిర్మించనున్నారు. 2026 ప్రారంభంలోనే ఈ మూవీ సెట్స్‌పైకి వెళ్లనుంది. అంతేకాదు ఈ చిత్రంతో ఇండియాలోని సూపర్ స్టార్లలో ఒకరైన హృతిక్ రోషన్ దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. 2003లో 'కోయి మిల్ గయా'తో ప్రారంభమైన బిగ్గెస్ట్ సూపర్ హీరో ఫ్రాంచైజ్ అయిన 'క్రిష్ 4'లో హృతిక్ హీరోగా నటిస్తూనే, మెగా ఫోన్ పట్టబోతున్నారు అన్న వార్త ఆయన అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ లాక్ చేయగా, ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
తాజాగా ప్రముఖ మీడియాతో హృతిక్ తండ్రి, 'క్రిష్' సృష్టికర్త రాకేష్ రోషన్ మాట్లాడుతూ.. "క్రిష్ 4 దర్శకుడి బాధ్యతను నా కొడుకు హృతిక్ రోషన్‌కు అప్పగిస్తున్నాను. ఆయన ఈ ఫ్రాంచైజీలో మొదటి నుంచి ఉన్నాడు. ప్రారంభం నుంచే సూపర్ హీరో పాత్రలో జీవించాడు, కలలు కన్నాడు. కాబట్టి భవిష్యత్తులో ప్రేక్షకులతో కలిసి క్రిష్ ప్రయాణాన్ని ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లాలనే స్పష్టమైన విజన్ హృతిక్‌కు ఉంది. హృతిక్ ఈ మూవీ కోసం దర్శకుడి టోపీని ధరిస్తే చూడటం నాకు గర్వంగా ఉంటుంది. చాలా సంవత్సరాల క్రితం నేను సృష్టించిన 'క్రిష్' సూపర్ హీరో సాగాను హృతిక్ నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్తాడు" అంటూ స్పష్టం చేశారు. అలాగే నిర్మాతగా ఆదిత్య చోప్రా 'క్రిష్ 4' బాధ్యతలు చేపడుతుండటం పట్ల రాకేష్ రోషన్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. "హృతిక్, ఆది అంతర్జాతీయ నిర్మాణ విలువలతో 'క్రిష్ 4'ను తెరకెక్కించి, ఇండియా గర్వపడేలా చేస్తారనే నమ్మకం ఉంది" అంటూ ఈ మూవీపై అంచనాలను పెంచేశారు.
'క్రిష్' ఫ్రాంచైజీలో వచ్చిన సినిమాలు
ఇప్పటిదాకా 'క్రిష్' ఫ్రాంచైజీలో మొత్తం 3 పార్ట్స్ తెరపైకి వచ్చాయి. 2003లో రిలీజ్ అయిన 'కోయి... మిల్ గయా' మూవీతో 'క్రిష్' యూనివర్స్ ను దర్శకుడిగా, నిర్మాతగా క్రియేట్ చేశారు రాకేష్ రోషన్. ఇందులో రేఖ, ప్రీతి జింటా, రాకేష్ రోషన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ ప్రేక్షకులకు మరో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. ఈ బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్‌గా 2006లో 'క్రిష్' మూవీ తెరపైకి వచ్చింది. ప్రియాంక చోప్రా, హృతిక్ రోషన్ నటించారు. ఇందులో సూపర్ హీరో క్రిష్ చేసే సాహసాలు ఆడియన్స్‌ను అబ్బురపరిచాయి. నెక్స్ట్ పార్ట్‌గా 2013లో 'క్రిష్ 3' వచ్చింది. కానీ ఇది పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు 'క్రిష్ 4' ముస్తాబవుతోంది.