Rashmika Mandanna On Animal Character Geetanjali: ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ‘యానిమల్’ దూకుడు కొనసాగుతోంది. సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ సినిమా గురించి మిశ్రమ స్పందన లభిస్తున్నప్పటికీ వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. ఈ సినిమాలో పరిధికి మించి బోల్డ్ సీన్లతో పాటు పెద్ద మొత్తంలో హింస ఉందనే విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు, ఈ మూవీ గురించి ఏకంగా పార్లమెంట్ లోనూ చర్చ జరిగింది. ఇలాంటి సినిమాల వల్ల సమాజం మీద చెడు ప్రభావం పడే అవకాశం ఉందిని ఓ మహిళా ఎంపీ వెల్లడించారు. సినిమాలు మంచిని చూపించాలే తప్ప, తప్పుడు విధానాలను రైట్ అనేలా చూపించకూడదన్నారు.

  


గీతాంజలి ఓ శక్తి, ఓ శిల- రష్మిక


ఇక తాజాగా ‘యానిమల్‌’ సినిమా గురించి హీరోయిన్ రష్మిక మందన్న తన ఇన్ స్టాలో కీలక విషయాలను వెల్లడించింది. ఈ సినిమా విడుదలై వారం గడిచిన నేపథ్యంలో, తమ సినిమాను అద్భుతంగా ఆదరిస్తున్న సినీ అభిమానులకు ధన్యవాదాలు చెప్పింది. ఈ చిత్రంలో తను పోషించిన ‘గీతాంజలి’ క్యారెక్టర్ గురించి చాలా విషయాలను వెల్లడించింది. ఈ మేరకు ఓ సుదీర్ఘ పోస్టు షేర్ చేసింది. కుటుంబాన్ని కలిసి ఉండేలా చేసిన శక్తి గీతాంజలి అని వెల్లడించింది.


“గీతాంజలి, ఈ పాత్ర గురించి నేను ఒక్క మాటలో చెప్పాలి అనుకుంటే, కుటుంబం మొత్తాన్ని కలిసి ఉండేలా చేసిన శక్తి. ఆమె మనసు స్వచ్ఛమైనది. చాలా ధైర్యవంతురాలు. గీతాంజలి ఎందుకు అలా చేస్తుందని ఓ నటిగా చాలాసార్లు దర్శకుడిని అడిగాను. ప్రశ్నించాను. నా ప్రశ్నలకు దర్శకుడు చెప్పిన సమాధానం ఇప్పటికీ గుర్తుంది. ఇది రణ్-గీతాంజలి కథ. వాళ ప్రేమ, కుటుంబ, జీవితం మాదిరిగానే వాళ్ల స్వభావం కూడా ఇలాగే ఉంటుంది అన్నారు. హింస, బాధతో కూడిన ప్రపంచంలోకి శాంతి, నమ్మకం, ప్రశాంతతను గీతాంజలి తీసుకువచ్చింది. భర్త, పిల్లలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంది. కుటుంబ కోసం తన శక్తివంచన లేకుండా ప్రయత్నించిన శిల తను. నా కళ్ల ద్వారా చూస్తే గీతాంజలి చాలా అందమైన అమ్మాయి. తన కుటుంబాన్ని కాపాడుకునేందుకు ధైర్యంగా నిలబడే ఎంతోమంది మహిళల మాదిరిగానే ఆమె కూడా ఒకరు” అని రష్మిక వెల్లడించింది.   






‘యానిమల్’ గురించి..


సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ సినిమాలో రణబీర్ కపూర్, రష్మిక మందన్న హీరో, హీరోయిన్లుగా నటించారు. సీనియర్ నటుడు అనిల్ కపూర్ ఇందులో రణబీర్ తండ్రి పాత్రలో కనిపించారు. బాబి డియోల్ విలన్ పాత్ర పోషించారు. తృప్తి దిమ్రి కీలక పాత్రలో కనిపించింది. జోయా అనే క్యారెక్టర్ చేసిన ఆమె, బోల్డ్ సీన్లతో అందరినీ షాక్ కి గురి చేసింది. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే రూ.500 కోట్లు వసూళు చేసిన ‘యానిమల్’ చిత్రం, త్వరలో రూ. 1000 కోట్ల మార్క్ ను దాటే అవకాశం ఉంది.    


Read Also: మహేష్ బాబుతో నెట్ ఫ్లిక్స్ సీఈవో సెల్ఫీ, మూడు రోజుల పర్యటనపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్