నేపాలీ బ్యూటీ మనీషా కోయిరాలా భారతీయ సినిమా పరిశ్రమలో ఎన్నో సినిమాల్లో నటించింది. అందం అభినయంతో అద్భుతంగా రాణించింది. తన చక్కటి నటనకుగాను  నాలుగు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలతో అనేక ఇతర అవార్డులను అందుకుంది. 2001 నేపాల్ ప్రభుత్వం ఇచ్చే రెండవ అత్యున్నత పురస్కారాన్ని దక్కించుకుంది.


స్కూల్ డేస్ లోనే సినిమాలో నటించే అవకాశం


స్కూల్ టైమ్ నుంచే మనీషాకు సినిమాలంటే ఎంతో ఇష్టం. పాఠశాలలో ఉన్న రోజుల్లోనే నేపాలీ సినిమాలో నటించే అవకాశం పొందింది. 1991లో వచ్చిన ‘సౌదాగర్’ మూవీతో బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ‘1942 - ఎ లవ్ స్టోరీ’,  తమిళ చిత్రం ‘బాంబే’తో నటిగా ఫ్రూవ్ చేసుకుంది. ‘అగ్నిసాక్షి’, ‘ఇండియన్’, ‘గుప్త్ - ది హిడెన్ ట్రూత్’, ‘కచ్చే ధాగే’, ‘ కంపెనీ’, ‘ఏక్ చోటీసి లవ్ స్టోరీ’లు కూడా ఆమెకు మంచి పేరు తెచ్చాయి. 2002లో రజనీకాంత్ తో కలిసి చేసిన ‘బాబా’ సినిమా ఆమె సౌత్ కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టింది అని చెప్పుకోవచ్చు.  సూపర్‌ నేచురల్ యాక్షన్ థ్రిల్లర్‌ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేక డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత మనీషాకు అవకాశాలు రావడం మానేశాయి.


‘బాబా’ డిజాస్టర్ తో నా సౌత్ కెరీర్ క్లోజ్- మనీషా కోయిరాలా


తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె ‘బాబా’ సినిమా గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. “బాబా.. బహుశా నా చివరి పెద్ద తమిళ చిత్రం. ఆ రోజుల్లో చాలా ఘోరంగా ఫ్లాప్ అయింది. ఇంకా చెప్పాలంటే భారీ డిజాస్టర్. సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. అది ఫ్లాప్ అయినప్పుడు,  నాకు సౌత్ కెరీర్ క్లోజ్ అయ్యింది అనుకున్నాను. నేను అనుకున్నట్లుగానే జరిగింది. ‘బాబా’లో నటించడానికి ముందు చాలా సౌత్ ప్రాజెక్టులు చేతిలో ఉన్నాయి. కానీ, ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ కావడంతో అవకాశాలు ఆగిపోయాయి’’ అని చెప్పుకొచ్చింది.


‘బాబా’ రీ రిలీజ్ తో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల మోత


నేరుగా విడుదలైనప్పుడు ఘోరంగా విఫలమైన ఈ సినిమా, గత ఏడాది  రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా రీ రిలీజ్ చేశారు. అప్పుడు మాత్రం ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించింది. కలెక్షన్ల మోత మోగించింది. సూపర్ స్టార్ రజనీకాంత్ ‘బాబా’ చిత్రంలో నటించడంతో పాటు ఆయనే నిర్మించారు. సినిమా కథ, స్ర్కీన్ ప్లే కూడా తనే రాశారు. ఈ చిత్ర  కథాంశం నాస్తికుడైన ఒక యువకుడి చుట్టూ తిరుగుతుంది. వాస్తవానికి హిమాలయ సాధువు అయిన ఆయన పునర్జన్మలో నాస్తికుడైన యువకుడిగా జన్మిస్తాడు. ఆ తర్వాత తను పునర్జన్మ పొందినట్లుగా తెలుసుకుంటాడు. చక్కటి కథ అయినప్పటికీ అప్పట్లో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఈ సినిమా విఫలమైంది. ఇక మనీషా కొయిరాలా చివరిసారిగా కార్తిక్ ఆర్యన్ చిత్రం ‘షెహజాదా’లో కనిపించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా రాణించలేకపోయింది. ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘హీరామండి’ సినిమాలో నటిస్తోంది.


Read Also: నా దేశంలో వయసు అనేది అవమానం - ‘ఆంటీ’ ట్రోలర్స్‌కు అనసూయ చురకలు