Keerthy Suresh: అందాల నటి కీర్తి సురేష్ ఈ ఏడాది బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించింది. తను చేసిన ప్రతి ప్రాజెక్టుకు జనాల నుంచి అపూర్వ స్పందన లభించింది. ‘దసరా’, ‘మామన్నన్‌’ సినిమాలతో  బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంది. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తోంది. వరుస హిట్ల నేపథ్యంలో కథల ఎంపికలో ఆలోచనలు మారుతుంటాయా? అనే ప్రశ్నకు కీర్తి సురేష్ ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.


ఎప్పటికప్పుడు ఆలోచనలు మార్చుకోను- కీర్తి సురేష్


సినిమా సక్సెస్, ఫెయిల్యూర్స్‌ను బట్టి కథల ఎంపికలో తరుచుగా ఆలోచనలు మారవని వెల్లడించింది కీర్తి సురేష్. “ఒక హిట్టు దక్కితేనో, ఫ్లాప్‌ వచ్చిందనో అప్పటికప్పుడు కథల ఎంపికలో నా ఆలోచనా విధానం మారదు. నేను ఎప్పుడైనా విభిన్న కథాంశాలతో కూడిన భిన్నమైన ప్రయోగాత్మక సినిమాలు చేయాలని భావిస్తాను. ఎప్పటికప్పుడు సరికొత్త పాత్రలు పోషించాలి అనుకుంటాను. నాకు ఇది ప్రయోగాలు చేసే సమయం. గత కొంత కాలంగా నా దగ్గరికి వస్తున్న కథలు, పాత్రలు అన్నీ నా ఊహలకు మించి ఉంటున్నాయి. నేను కలలో కూడా అనుకోని క్యారెక్టర్స్ వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆలోచించాల్సిన అవసరం లేదు. సక్సెస్ ను ఎంజాయ్ చేయాలనే ఆలోచన తప్ప” అని కీర్తి సురేష్ అభిప్రాయపడింది.


‘దసరా’తో బ్లాక్ బస్టర్ హిట్


ఈ ఏడాది ‘దసరా’ చిత్రంతో కీర్తి అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రశంసలు వెల్లువెత్తాయి. నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియన్ మూవీ అన్నిచోట్లా అద్భుత విజయాన్ని అందుకుంది. మార్చి 30న పలు భాషల్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. సంక్రాంతికి విడుదలైన చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాలకు మించి తొలి రోజు కలెక్షన్లు సాధించింది. ఈ మాస్ యాక్షన్ డ్రామాలో ధీక్షిత్ శెట్టి, సాయి కుమార్, సముద్రఖని, షైన్ టామ్ చాకో, పూర్ణ కీలక పాత్రలు పోషించారు.   


వరుస సినిమాలతో ఫుల్ బిజీ


కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ‘సైరెన్’, ‘రఘు తాత’, ‘రివాల్వర్‌ రీటా’, ‘కన్నివేడి’ సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్స్ లో పాల్గొంటున్నది. ఇక కీర్తి సురేష్ తొలిసారి ఓ వెబ్‌సిరీస్‌ లో నటించబోతోంది. నటి రాధికా ఆప్టేతో కలిసి ఈ వెబ్ సిరీస్ లో కనిపించనుంది. ఈ సిరీస్ కు మేకర్స్ ‘అక్క’ అనే పేరును ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ ఈ  కొత్త వెబ్ సిరీస్ నిర్మిస్తోంది. ధర్మరాజ్ శెట్టి దర్శకత్వంలో ఈ సిరీస్ తెరకెక్కబోతోంది. ప్రముఖ దర్శకుడు ఆదిత్య చోప్రా యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్ లో సిరీస్‌ను నిర్మిస్తున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. పీరియడ్ థ్రిల్లర్ గా ఈ సిరీస్ రూపొందనున్నట్లు టాక్ నడుస్తోంది.


Read Also: అప్పుడు విమర్శలు, ఇప్పుడు ప్రశంసలు - రష్మిక నటనకు నెటిజన్లు ఫిదా


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆*T&C Apply