Bhagyashree Sustained A Deep Wound: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ (Bhagyashree) తలకు గాయంతో ఆస్పత్రి పాలయ్యారు. ఈ మధ్యే ట్రెండింగ్‌లోకి వచ్చిన పికెల్ బాల్ ఆడుతుండగా ఈ ప్రమాదం జరిగింది. దీంతో తలకు గాయంతో ఆస్పత్రిలో చేరగా.. డాక్టర్స్ ఆమె నుదుటిపై 13 కుట్లు వేశారు. తలకు కట్టుతో ఉన్న ఆమె ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కాగా.. త్వరగా కోలుకోవాలని అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఒకప్పటి టాప్ హీరోయిన్..

భాగ్యశ్రీ ఒకప్పుడు బాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1989లో 'మైనే ప్యార్ కియా' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టగా.. సల్మాన్‌ఖాన్‌తో జత కట్టి ఫస్ట్ మూవీతోనే మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ మూవీకి ఆమె 'బెస్ట్ ఫీమేల్ డెబ్యూ'గా ఫిల్మ్ పేర్ అవార్డు అందుకున్నారు.  ఆ తర్వాత ప్రముఖ వ్యాపారవేత్త హిమాలయ్ దస్సానిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కూడా పలు సినిమాల్లో నటించారు. త్యాగి, పాయల్, అమ్మవ్రా గంద, మా సంతోషి మా, రెడ్ అలర్ట్: ద వార్ వి, ఛత్రపతి, ససాజిని షిండేకా వైరల్ వంటి హిందీ సినిమాల్లో నటించి మెప్పించారు.

Also Read: 'నాన్నోయ్.. ఎక్స్ పీరియన్సే కాదు ఎక్స్‌పైరీ డేట్ కూడా దగ్గర పడింది' - నవ్వులు పూయిస్తోన్న సప్తగిరి 'పెళ్లి కాని ప్రసాద్' ట్రైలర్

ప్రభాస్ రాధేశ్యామ్‌లో..

1997లో వచ్చిన 'ఓంకారం' సినిమాతో భాగ్యశ్రీ టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఈ మూవీకి ఉపేంద్ర డైరెక్టర్ కాగా.. ఆయనకు దర్శకునిగా ఇది ఫస్ట్ మూవీ. ఈ సినిమాలో రాజశేఖర్, ప్రేమ, భాగ్యశ్రీ ప్రధాన పాత్రలు పోషించారు. ఆ తర్వాత కొన్ని సెలెక్టెడ్ మూవీస్‌లో మాత్రమే చేశారు. 2021 నుంచి ఆమె సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. 2021లో 'తలైవి'లో నటించగా.. 2022లో వచ్చిన ప్రభాస్ 'రాధేశ్యామ్' (Radhe Shyam) మూవీలో ఆయన తల్లిగా నటించారు. ఈమె చివరగా 'లైఫ్ హిల్ గయూ' అనే వెబ్ సిరీస్‌లో నటించారు.