Avantika Vandanapu About Her Cine Career: టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్టుగా రాణించిన అవంతిక వందనపు హాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తోంది. వెబ్ సిరీస్ లలోనూ నటిస్తోంది. ఇప్పటికే ఆమె నటించిన ‘స్పిన్‘, 'డైరీ ఆఫ్ ఎ ఫ్యూచర్ ప్రెసిడెంట్', 'కమలా', 'రాయల్ డిటెక్టివ్', 'మోక్సీ','మీన్ గర్ల్స్- ది మ్యూజికల్' సినిమాల్లో నటించింది. చక్కటి నటనతో ప్రశంసలు దక్కించుకుంటోంది. తాజాగా అవంతిక నటించిన ‘బిగ్ గర్ల్స్ డోంట్ క్రై‘ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్ కోసం ఇండియాలో అడుగు పెట్టింది. ముంబైలో జరిగిన ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొన్నది.
మళ్లీ తెలుగు సినిమాలు చేయాలనుంది- అవంతిక
ఈ సందర్భంగా అవంతిక ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నది. తన సినీ ప్రయాణంతో పాటు కుటుంబం గురించి కీలక విషయాలు వెల్లడించింది. “తెలుగులో చైల్డ్ ఆర్టిస్టుగా రాణిస్తున్న సమయంలోనే అమెరికాకు వెళ్లాను. అక్కడ సినిమాల్లో ట్రై చేశాను. ఐదేళ్లలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాను. ఇప్పుడు నాకు 20 ఏళ్లు వస్తున్నాయి. నాకు మళ్లీ తెలుగు సినిమాల్లోకి రావాలనే కోరిక ఉంది. టాలీవుడ్, బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లోనూ సినిమాలు చేయాలనేది నా గోల్. అన్ని సినిమా పరిశ్రమలలో నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలి అనుకుంటున్నాను” అని చెప్పుకొచ్చింది.
నా కోసం అమ్మ ఉద్యోగాన్ని వదులుకుంది - అవంతిక
ఇక తన కెరీర్ కోసం పేరెంట్స్ ఎంతో కష్టపడ్డారని చెప్పింది అవంతిక. తన తల్లి ఉద్యోగం కూడా వదులుకున్నట్లు చెప్పింది. “నేను ఇప్పుడు న్యూయార్క్ లో ఉంటున్నాను. నేను పుట్టింది అమెరికాలోని కాలిఫోర్నియా. 10 ఏళ్ల వయసులో హైదరాబాద్ కు వచ్చాను. మాది పూర్తిగా తెలుగు ఫ్యామిలీ. అమ్మ(అనుపమ) సొంతూరు హైదరాబాద్. నాన్న(శ్రీకాంత్) స్వగ్రామం నిజామాబాద్ లోని పిట్లం. హైదరాబాద్ లో సుమారు 6 ఏళ్ల పాటు ఉన్నాను. యాక్టింగ్ 10 ఏళ్లు ఉన్నప్పుడు మొదలు పెట్టాను. యాక్టింగ్ కోసమే నేను ఇండియాకు వచ్చాను. ఆ సమయంలో హాలీవుడ్ లో ఆసియా వాళ్లకు మంచి గుర్తింపు వస్తున్నా, దక్షిణాసియా వాళ్లకు మాత్రం పెద్దగా అవకాశాలు లేవు. అలాంటి సమయంలో అమెరికాలో ట్రై చేసి, రిజెక్ట్ కావడం కంటే తెలుగులో ట్రై చేయడం మంచిదని మా అమ్మ అనుకుంది. ఓ ఆడిషన్ కు అమెరికా నుంచే టేప్ పంపించాం. వాళ్లు ఛాన్స్ ఇచ్చారు. మూడు నెలల పాటు హైదరాబాద్ లో ఉండి, సినిమాల్లో నేను ఎలా సెట్ అవుతాను అని తెలుసుకుని మళ్లీ అమెరికాకు తిరిగి వెళ్లాలి అనుకున్నాం. కానీ, ఇక్కడికి వచ్చాక సినిమా అవకాశాలు రావడంతో ఇక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. 5 సంవత్సరాల పాటు హైదరాబాద్, చెన్నై, ఊటీ, బాంబేలో ఉన్నాను. ‘బ్రహ్మోత్సవం‘ సినిమాలో నాకు తొలిసారి అవకాశం వచ్చింది. 5 ఏళ్లలో 9 సినిమాలు చేశాను. కొన్ని యాడ్స్ లోనూ నటించాను. నా కోసం అమ్మానాన్నలు చాలా సమయం కేటాయించారు. నా కోసం అమ్మ ఉద్యోగాన్ని వదిలేసింది. చాలా మంది ఎన్నారైలు తమ పిల్లలను లాయర్లు, డాక్టర్లు, ఇంజినీర్లు చేయాలని భావిస్తారు. కానీ, మా పేరెంట్స్ మాత్రం నాకున్న ఇంట్రెస్ట్ ను గ్రహించి సినిమాల్లోకి తీసుకొచ్చారు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అవంతిక హాలీవుడ్ లో పలు సినిమాలు చేస్తోంది.
Read Also: నేను పాత వార్త అయిపోకూడదు, ఆ భయాన్ని అధిగమించాలి - సమంత