Actor Raja Ravindra About Bengaluru Rave Party: సినీ సెలబ్రిటీలపై రూమర్స్ క్రియేట్ అవ్వడానికి పెద్దగా సందర్భం అవసరం ఉండదు. ఎప్పటికప్పుడు వారిపై అనేక రూమర్స్ క్రియేట్ అవుతూనే ఉంటాయి, వైరల్ అవుతూనే ఉంటాయి. కొందరు వాటిపై స్పందిస్తూ.. కొందరు మాత్రం ఎన్నిసార్లు స్పందించాలి అన్నట్టుగా సైలెంట్‌గా ఉండిపోతారు. తాజాగా అలాంటి రూమర్స్‌పై తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు టాలీవుడ్ సీనియర్ ఆర్టిస్ట్ రాజా రవింద్ర. తనను బాగా షాక్‌కు గురిచేసిన రూమర్స్ గురించి చెప్పుకొచ్చారు. బెంగుళూరు రేవ్ పార్టీలో శ్రీకాంత్ పాల్గొన్నాడు అంటూ వచ్చిన వార్తలపై కూడా ఆయన స్పందించారు.


సునీల్ చనిపోయాడని రాశారు..


‘‘అలాంటి షాకింగ్ రూమర్స్ రోజూ వస్తూనే ఉంటాయి. వాళ్లది వీళ్లది కాదు కానీ శ్రీకాంత్‌కు సంబంధించిన రూమరే ఉంది. ఊహా, శ్రీకాంత్.. ఇద్దరూ నాకు బాగా క్లోజ్. వీళ్లిద్దరూ విడాకులు తీసుకుంటున్నారు అని వార్త రాస్తే వాళ్లే ఆశ్చర్యపోయారు. అలాంటివి చాలా ఉన్నాయి. సునీల్ చనిపోయాడని కూడా ఒకసారి రూమర్ వచ్చింది. తీవ్ర వ్యాధితో ఆసుపత్రిలో మరణించిన సునీల్ అని రాశారు. ఏంట్రా ఇది అని సునీల్ గోల చేశాడు. అలా కొన్ని శృతిమించిపోయి ఉంటాయి. మనిషి పర్సనల్ లైఫ్‌లోకి వెళ్లిపోయి చనిపోయాడని రాయాల్సిన అవసరం ఏముంది? థంబ్‌నెయిల్ వేరే ఉంటుంది, మ్యాటర్ వేరే ఉంటుంది’’ అంటూ రూమర్స్‌పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు రాజా రవీంద్ర.


అప్పుడప్పుడు జాలేస్తుంది..


‘‘థంబ్‌నెయిల్‌ను చూసి వెంటనే ఓపెన్ చేస్తే అసలు థంబ్‌నెయిల్‌‌కు సంబంధించిన వార్తే ఉండదు అందులో. అంత ఫేక్‌గా చేయాల్సిన అవసరం ఏంటి? ఒక్కొక్కసారి జాలేస్తుంది. అలాంటివి చదివి, వాటి గురించే ఆలోచిస్తే ఇండస్ట్రీలో ఉండడం కష్టం. ఇమేజ్ ఉన్నవాళ్ల గురించే రాస్తారు. ఇమేజ్ లేనివాడి గురించి రాస్తే ఎవరూ చదవరు కదా. ప్రతీ ఒక్కరికి ఇమేజ్‌తో పాటు ఇది బోనస్‌లాగా వస్తుంది. ఎంత ఇమేజ్ ఉంటే అన్ని రకాల రూమర్స్ వస్తాయి. రాజకీయాల్లో కూడా ఇంతే. సెలబ్రిటీ అంటేనే నెగిటివిటీ ఎక్స్‌ట్రాగా వస్తుంది. ఒక్కొక్కసారి టీవీల్లో వచ్చేవాటిని ఖండించకపోతే నిజం అనుకునే ప్రమాదం ఉంది’’ అని చెప్పుకొచ్చారు రాజా రవీంద్ర.


అస్సలు చేయడు..


బెంగుళూరు రేవ్ పార్టీ విషయం ఇండస్ట్రీలో సెన్సేషన్‌గా మారింది. ఆ పార్టీకి శ్రీకాంత్ కూడా వెళ్లాడు అని వార్తలు రాగా దానిపై క్లారిటీ ఇవ్వడానికి ఈ హీరో ఒక వీడియో విడుదల చేశాడు. ఇక శ్రీకాంత్ గురించి తనకు బాగా తెలుసంటూ రాజా రవీంద్ర కూడా ఈ విషయంపై స్పందించారు. ‘‘శ్రీకాంత్ గురించి నాకు బాగా తెలుసు. పార్టీలకు అసలు వెళ్లడు. ఎప్పుడూ ఇంట్లోనే ఉంటాడు. ఏంట్రా ఇది అని నన్ను అడిగితే.. పోనీలే ఏదో ఒకరకంగా మన పేరు జనాల మధ్యలో ఉంటుంది అని చెప్పాను. మన గురించి నెగిటివ్‌గా రాస్తే మనం యాక్టివ్‌గా ఉన్నట్టే లెక్క’’ అంటూ నెగిటివ్ రూమర్స్‌లో కూడా పాజిటివిటీ చూస్తానని తెలిపారు రాజా రవీంద్ర.


Also Read: పెళ్లికి ముందే ఒకే రూమ్ లో ఉండేవాళ్లం, నాకు ఆ భయం అస్సలు ఉండేది కాదు: జీవిత