హైదరాబాద్ లో గత కొద్ది కాలంగా వీధికుక్కల స్వైర విహారం హాట్ టాపిక్ గా మారుతోంది. అంబర్ పేటలో కుక్కల దాడిలో చిన్న బాబు ప్రాణాలు కోల్పోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ తర్వాత పలువురు వీధి కుక్కల విషయంలో జీహెచ్ఎంసీ అధికారులు తీసుకుంటున్న చర్యలపై తీవ్ర విమర్శలు చేశారు. వాటిని కట్టడి చేయడంలో విఫలం అయ్యారని మండిపడ్డారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కొద్ది రోజుల పాటు వీధి కుక్కల వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మీ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆమె ఇంట్లో పెద్ద సంఖ్యలో కుక్కలను విడిచిపెట్టాలని, ఎంత ప్రేమగా వాటిని చూసుకుంటుందో చూడాలన్నారు. చిన్నారి ప్రాణం పోవడానికి కారణం జీహెచ్ఎంసీ చేతగానితనం అంటూ నిప్పులు చెరిగారు.

  


ఇప్పటికీ నేను వీధి కుక్కలకు ఫుడ్ పెడతా


తాజాగా వీధి కుక్కల వ్యవహారంపై నటుడు బ్రహ్మాజీ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు కుక్కలంటే చాలా ఇష్టం అని చెప్పిన ఆయన, వీధి కుక్కల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. “నా దగ్గర రెండు కుక్కలు ఉన్నాయి. అవి నాకు ఎంతో ఇష్టం. నేను ప్రతి రోజు 10 వీధి కుక్కలకు ఫుడ్ పెడతాను. చాలా కాలంగా వాటికి భోజనం అందిస్తున్నాను. మీ అపార్ట్ మెంట్ లోని ఓ అబ్బాయితో రోజు వాటికి ఫుడ్ తెప్పించి పెడతాను. అయితే, మా అపార్ట్ మెంట్ కు కొంచెం దూరంలో ఉన్న ఖాళీ స్థలంలో వాటికి భోజనం పెట్టిస్తాను. అవి అక్కడే తిని అక్కడే ఉంటాయి. ఎదుటి వారికి ఎలాంటి ఇబ్బంది కలిగించవు” అని చెప్పారు.


కరిచే కుక్కల విషయంలో ఏం చేయాలంటే?


ఇక కరిచే వీధి కుక్కల గురించి కూడా బ్రహ్మాజీ స్పందించారు. “వీధి కుక్కలు చాలా వరకు ప్రేమగా, విశ్వాసంగానే ఉంటాయి. వాటికి భోజనం పెడితే చాలా ప్రేమగా దగ్గరకు వస్తాయి. తమ ఇంటి దగ్గర కాకుండా కొంచెం దూరంలో ఉన్న ఖాళీ ప్రదేశంలో వాటికి ఫుడ్ పెట్టడం మంచిది. మన ఇంటి సమీపంలో కాకుండా అక్కడే ఉంటాయి. రోడ్డు మీద వెళ్లే వారికి కూడా ఇబ్బంది కలిగించవు. ఒకవేళ, ఏవో ఒకటి, రెండు కుక్కలు ప్రజలను ఇబ్బంది పెడితే, లేదంటే కరిస్తే వాటిని జీహెచ్ఎంసీ వాళ్లు తీసుకెళ్లి వాళ్ల ఆధీనంలో ఉంచుకోవడం మంచిది” అన్నారు.


కుక్కతో పెళ్లి అనే కాన్సెప్ట్ తో బ్రహ్మాజీ కొడుకు సినిమా


నటుడు బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రావు హీరోగా తెరకెక్కిన మూవీ ‘స్లమ్ డామ్ హస్బెండ్’. కుక్కతో పెళ్లి అనే కాన్సెప్ట్ తో ఈ మూవీ తీశారు. ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ మూవీలో ప్రణవి మానుకొండ హీరోయిన్ గా చేసింది.  ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించారు. జాతక దోషం పోవాలి అంటే ముందు అబ్బాయికి తూతూ మంత్రం పెళ్లి చేయాలని పంతులు మెలికపెట్టడంతో ఓ కుక్కకిచ్చి పెళ్లి చేస్తారు. తర్వాత హీరో హీరోయిన్ పెళ్లికి జరుగుతుంది. కరెక్ట్ గా తాళి కట్టే సమయానికి కొంతమంది వచ్చి పెళ్లి జరగడానికి వీల్లేదని అంటారు. మొదటి భార్య కుక్క ఉండగా రెండో పెళ్లేంటని నిలదీస్తారు. దీనిపై కోర్ట్ కు కూడా వెళతారు. అయితే తర్వాత ఏమైంది? వారి పెళ్లికి ఎలాంటి సమస్యలు వచ్చాయి? కోర్ట్ ఏం చెప్పింది? చివరికి వాళ్లు పెళ్లి చేసుకున్నారా లేదా అనేదే సినిమా. చిత్రీకరణ పూర్తిచేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది.


Read Also: ఆంధ్రోడా, అంటూ చిల్లర కామెంట్స్ చేశారు - ఆ వివాదంపై స్పందించిన నటుడు బ్రహ్మాజీ


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial