Ari Remake:


బాలీవుడ్‌లో అరి రీమేక్..? 


సౌత్ లో ఓ సినిమా హిట్టయితే చాలు, ఆ మూవీ రీమేక్ రైట్స్ కొండెక్కి కూర్చుంటాయి. ఎంత రేటు పెట్టయినా వాటిని దక్కించుకోవడానికి బాలీవుడ్ మేకర్స్ ఎగబడతారు. కానీ ఇక్కడ అంతకుమించి అన్నట్టుంది వ్యవహారం. టాలీవుడ్ లో ఓ సినిమా రెడీ అవుతోంది. ఇంకా విడుదల కాలేదు. అంతలోనే ఆ సినిమా రీమేక్ లో నటిస్తానంటూ బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ఆసక్తి చూపిస్తున్నాడు. బిగ్ బి తనయుడు అభిషేక్ కు అంతలా నచ్చిన ఆ సినిమా పేరు 'అరి'. జయశంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది అరి. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఓ సందర్భంలో దర్శకుడు, అభిషేక్ కలిశారు. అప్పుడు అభిషేక్ బచ్చన్ కు అరి సినిమాకు సంబంధించి ప్రజెంటేషన్ ఇచ్చాడు. రీ-రికార్డింగ్ కూడా లేకుండా ప్రజెంటేషన్ చూసిన అభిషేక్ కు, కాన్సెప్ట్ విపరీతంగా నచ్చేసింది.  అరి సినిమాను హిందీలో రీమేక్ చేస్తే తను కచ్చితంగా నటిస్తానంటూ వెంటనే మేకర్స్ కు మాటిచ్చాడు ఈ హీరో. దీంతో ఈ సినిమా రీమేక్ రైట్స్ కు ఇప్పుడు గిరాకీ పెరిగింది. అన్నీ సెట్ అయితే జయశంకరే, హిందీ రీమేక్ ను కూడా డైరక్ట్ చేయాలనుకుంటున్నాడు. సాయికుమార్, అనసూయ, శ్రీకాంత్ అయ్యంగార్, వైవా హర్ష ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతోంది అరి సినిమా. సినిమా ట్రయిలర్ ఇప్పటికే పెద్ద హిట్టయింది. మంగ్లీ పాడిన ఓ పాట కూడా బాగా క్లిక్ అయింది. కృష్ణ తత్వంతో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్ట్ లో ప్రేక్షకులముందుకు రానుంది.


ఇంట్రెస్టింగ్ ట్రైలర్...


‘పేపర్ బాయ్’ సినిమాతో దర్శకుడిగా సక్సెస్ అందుకున్న జయ శంకర్, ప్రస్తుతం ‘అరి’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించబోతున్నారు. సినిమా టైటిల్ తోనే ప్రేక్షకులలో ఆసక్తి కలిగించిన దర్శకుడు, ఫస్ట్ లుక్, ప్రచార వీడియోలతో మరింత ఇంట్రెస్ట్ కలిగించారు. ఈ మూవీలో మంగ్లీ పాడిన ‘‘చిన్నారి కిట్టయ్య’’ పాట ప్రేక్షకాదరణ దక్కించుకుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా ట్రైలర్ విడుదల అయ్యింది. ఈ ట్రైలర్ అరిష‌డ్వ‌ర్గాలు అంటే ఏంటి అనే వాయిస్ తో మొదలవుతుంది. కామ‌, క్రోధ‌, లోభ‌, మొహ‌, మ‌ద‌, మాత్స‌ర్యాల చుటూ తిరుగుతూ ఆసక్తి కలిగిస్తోంది. మనిషి ఎలా బతకకూడదో ఈ ట్రైలర్ లో చూపించారు. అరిషడ్వర్గాలుగా ఉన్న ఆరుగురికి ఉన్న కామన్ శత్రువు ఎవరు? అనే ఆసక్తికర కథతో దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.  ప్రతి మనిషిలో ఉండే ఆరు అవ లక్షణాల కారణంగా ఎంతగా దిగజారుతారు అనే విషయాన్ని ఇందులో చూపించారు. మనిషి ఈ ఆరు చెడు లక్షణాలతో ఎలా పతనం అవుతాడో  ఆవిష్కరించనున్నారు. ఓవైపు శ్రీకృష్ణ తత్వాన్ని చూపిస్తూనే మరోవైపు, ఆరుగురు తమ శత్రువులను ఎలా ఎదుర్కొంటారో ఇందులో చూపించనున్నారు.  



Also Read: Jabardasth Punch Prasad: పంచ్ ప్రసాద్‌కు ‘జబర్దస్త్’ అభిమానులు చేయూత, మంత్రి రోజా చాలా సాయం చేశారంటూ భావోద్వేగం