Aarti Ravi Reaction On Jayam Ravi Singer Keneeshaa Tirupati Trip: కోలీవుడ్ హీరో జయం రవి, సింగర్ కెనీషా వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. సింగర్ కెనీషాతో కలిసి సోమవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన భార్య ఆర్తి రవితో విడాకుల వ్యవహారం తర్వాత వీరిద్దరూ పలుమార్లు జంటగా కలిసి కనిపించారు. ఇటీవల పలు ఈవెంట్లు, వివాహాలకు కలిసే వెళ్లారు. దీంతో ఇద్దరూ రిలేషన్ షిప్‌లో ఉన్నారనే వార్తలు హల్చల్ చేశాయి.
తాజాగా... మరోసారి ఇద్దరూ కలిసి కనిపించడంపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. తన సొంత నిర్మాణ సంస్థ ప్రారంభోత్సవానికి ముందు రవి కెనీషాతో కలిసి సంప్రదాయ దుస్తుల్లో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరి ఫోటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. ఆయన తన ఫస్ట్ నిర్మాణ సంస్థ రవి మోహన్ స్టూడియోస్‌ను చెన్నైలో స్టార్ట్ చేయనుండగా... ప్రస్తుతం ఆ పనులు శరవేగంగా సాగుతున్నాయి.
ఆర్తి రవి రియాక్షన్
అయితే, తాజాగా రవి మోహన్ భార్య ఆర్తి రవి పెట్టిన ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. 'నువ్వు దేవున్ని మోసం చేయలేవు. నువ్వు ఇతరులను మోసం చెయ్యొచ్చు. నిన్ను నువ్వు కూడా మోసం చేసుకోవచ్చు. కానీ నువ్వు దేవుడిని మోసం చేయలేవు.' అంటూ ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చారు. జయం రవి, కెనీషా తిరుమల ఫోటోలు వైరల్ అయిన కొద్ది గంటల తర్వాతే ఆర్తి రవి తన ఇన్ స్టా స్టోరీలో ఇలా రాయడంతో... వారిని ఉద్దేశించే ఆమె ఈ పోస్ట్ పెట్టారంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
మీ టైంకు వారు అర్హులు
ఆర్తి రవి మరో ఇన్ స్టాగ్రాం స్టోరీని షేర్ చేస్తూ... 'నాకు లభించిన అత్యుత్తమ తల్లిదండ్రుల సలహా. ఎల్లప్పుడూ మీ పిల్లలను ఎన్నుకోండి. ఆ అమాయక హృదయాలు మీ టైం, సమయానికి అర్హులు. మీ పిల్లల శాంతిని అన్ని విధాలుగా కాపాడుకోండి' అంటూ రాసుకొచ్చారు. వీటిపై నెట్టింట చర్చ సాగుతోంది.
అసలేం జరిగిందంటే?
తన భార్య ఆర్తి రవితో డివోర్స్ తీసుకున్నానంటూ గతేడాది జయం రవి ప్రకటించారు. అయితే, తనను సంప్రదించకుండానే ఈ ప్రకటన చేశారంటూ ఆర్తి రవి దీనిపై అభ్యంతరం తెలిపారు. డివోర్స్ వ్యవహారం ఇంకా కోర్టులోనే ఉందంటూ తమకు ఇంకా విడాకులు మంజురూ కాలేదంటూ చెప్పారు. తాము విడిపోవడానికి పవర్, మనీ రీజన్ కాదని... మూడో వ్యక్తే కారణం అంటూ ఆరోపించారు. మరోవైపు, ఇద్దరికీ కోర్టులో కౌన్సిలింగ్ ఇవ్వగా... ఆర్తితో వివాహ బంధాన్ని కొనసాగించలేనని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో తనకు జయం రవి నుంచి భరణం ఇప్పించాలని ఆర్తి రవి కోరినట్లు సమాచారం. పలు సందర్భాల్లో వీరి వ్యవహారంపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే సాగింది. ప్రస్తుతం విడాకుల వ్యవహారం ఇంకా కోర్టులోనే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో జయం రవి, కెనీషా కలిసి కనిపించడం మరోసారి చర్చనీయాంశమైంది.