Aamir Khan About Dream Project Mahabharatam: మహాభారతం (Maha Bharatam).. ఈ ప్రాజెక్ట్ అటు బాలీవుడ్‌తో పాటు ఇటు టాలీవుడ్ స్టార్లు చాలా మందికి డ్రీమ్ ప్రాజెక్ట్. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ (Aamir Khan) ఈ ప్రాజెక్టులపై పలు సందర్భాల్లో మాట్లాడారు. తాజాగా.. మరోసారి 'మహాభారతం' తనకు నచ్చిన క్యారెక్టర్ గురించి మాట్లాడారు. దీంతో మరోసారి 'మహాభారతం' ట్రెండింగ్‌లో నిలిచింది.
అదే నాకు ఇష్టమైన క్యారెక్టర్
'మహాభారతం' తెరకెక్కించడం తన కల అని.. ఇలాంటి సినిమాలు ఎప్పటికీ నిరాశపరచవని ఆమిర్ ఖాన్ తాజాగా అన్నారు. దీని కోసం ఎంతో కష్టపడాలని తెలిపారు. 'మహాభారతం'లో కృష్ణుడి పాత్ర నన్ను ఎంతో ప్రభావితం చేసింది. అది నాకు చాలా ఇష్టమైన రోల్. అవకాశం వస్తే ఆ క్యారెక్టర్‌లో కనిపించాలనుకుంటున్నా. ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్. ఇప్పుడే దీని గురించి ఎలాంటి వివరాలు నేను చెప్పలేను.' అని ఆమిర్ అన్నారు.
అయితే, గతంలోనూ పలు సందర్భాల్లో ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. ఈ ఏడాదే దీని పనులు ప్రారంభించాలని అనుకుంటున్నట్లు తెలిపారు. స్క్రిప్ట్ రైటింగ్‌కు కొన్నేళ్లు పడుతుందని.. ఒకే సినిమాలో దీన్ని చూపించలేమని.. అందుకే సిరీస్‌లుగా దీన్ని అందించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ మూవీ కోసం ఓ టీంను సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి తాము ఎన్నో విషయాల గురించి అన్వేషిస్తున్నామని.. ఏం జరుగుతుందో చూడాలి అంటూ కామెంట్ చేశారు. 'మహా భారతం' చేయడం ఓ యజ్ఞంతో సమానమని.. దాని విశిష్టతు భంగం కలగకుండా సినిమా రూపొందించేలా శ్రమిస్తున్నామని.. ఈ సినిమా విషయంలో తాను ఎంతో భయంతో ఉన్నట్లు చెప్పారు.
Also Read: నిర్మాతగా 'సమంత' హిట్ కొట్టారా? - 'శుభం' మూవీ మెప్పించిందా?.. నెటిజన్లు ఏమంటున్నారంటే?
సినిమా హిట్ అయితేనే పేమెంట్
ఇదే ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమిర్ ఖాన్ తన రెమ్యునరేషన్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను ఎన్నో సినిమాలకు రెమ్యునరేషన్ తీసుకోలేదని.. 'లాల్ సింగ్ చడ్డా'కు కూడా తీసుకోలేదని అన్నారు. 'నా సినిమాలకు వచ్చే లాభాల్లో షేర్ తీసుకుంటాను. సినిమా హిట్ అయితేనే నాకు పేమెంట్ వస్తుంది. లేకుంటే ఏమీ ఉండదు. 'లాల్ సింగ్ చడ్డా'కు నాకు రూపాయి అందలేదు. అయినా ఆ విషయంలో నేను ఎప్పుడూ బాధ పడలేదు.
ఎందుకంటే ఇలా చేయడం సరైనదని నా అభిప్రాయం. సినిమా ఫ్లాప్ అయినా ఆ విషయంలో కూడా నేను బాధ్యత వహించాలి కదా అనేది నా ఆలోచన. 'షూటింగ్‌లో ఇన్ని రోజులు పాల్గొన్నాను కాబట్టి.. సినిమా ఫలితంతో నాకు సంబంధం లేదు. నా రెమ్యునరేషన్ నాకు ఇవ్వండి.' అని నిర్మాతలను అడగలేను. నేను అలాంటి యాక్టర్‌ను కాదు.' అని ఆమిర్ అన్నారు.
అటు.. దర్శక ధీరుడు రాజమౌళి సైతం 'మహా భారతం' నిర్మించడ తన డ్రీమ్ అని చాలా సందర్భాల్లో చెప్పారు. ఇటీవల 'హిట్ 3' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో దీని గురించి ఆయన మాట్లాడారు. ఈ సినిమా ఎప్పుడు తీసినా 'నాని' మాత్రం కచ్చితంగా ఉంటాడని చెప్పారు. ప్రస్తుతం 'SSMB29' ప్రాజెక్టులో రాజమౌళి బిజీగా ఉండగా.. 'మహా భారతం' సెట్స్‌పైకి వెళ్లేందుకు చాలా టైం పట్టే అవకాశం ఉంది.