మెగాస్టార్ చిరంజీవి గత నెల 26న కరోనా బారిన పడినట్లు వెల్లడించారు. ఆ వెంటనే ఐసోలేషన్ లోకి వెళ్లారు. ఆ సమయంలో తన తల్లి పుట్టినరోజు రావడంతో చిరు బాగా ఎమోషనల్ అయ్యారు. తన తల్లికి నేరుగా విషెస్ చెప్పలేకపోతున్నానని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. అయితే ఇప్పుడు ఆయన పూర్తిగా కోలుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. తను పూర్తిగా కోలుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా చెప్పారాయన. 


''పరీక్షల్లో నెగెటివ్ వచ్చింది. మళ్లీ పనిలో పడ్డాను.. యాక్షన్ మొదలైంది. నేను కోలుకోవాలని ప్రార్ధించిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు'' అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు.. 'గాడ్ ఫాదర్' షూటింగ్ లో పాల్గొన్నట్లు ఆన్ లొకేషన్ స్టిల్స్ ను షేర్ చేశారు. ఈ ఫొటోల్లో దర్శకనిర్మాతలతో పాటు సునీల్, సత్యదేవ్, బ్రహ్మాజీ లాంటి నటులు కూడా కనిపిస్తున్నారు. 


ఇక 'గాడ్ ఫాదర్' సినిమా విషయానికొస్తే.. మలయాళ సినిమా 'లూసిఫర్'కి రీమేక్ గా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్రలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ నటించబోతున్నాడు. మెగాస్టార్-సల్మాన్ ఖాన్ కాంబినేషన్ లో ఓ సాంగ్ కూడా ఉంటుందట. తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.