సెప్టెంబర్ 28... కథానాయకుడిగా రామ్ చరణ్ వెండితెరపై అడుగుపెట్టిన రోజు. ఈ రోజు హీరోగా ఆయన పుట్టినరోజు. చరణ్ తొలి సినిమా 'చిరుత' సరిగ్గా పదిహేను సంవత్సరాల క్రితం... 2007లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నేటితో హీరోగా రామ్ చరణ్ ప్రయాణం ప్రారంభమై 15 ఏళ్ళు. ఈ సందర్భంగా చిరంజీవి ట్వీట్ చేశారు. అందులో ఆయన పుత్రోత్సాహం కనిపించింది.
''సినిమాల్లో రామ్ చరణ్ పదిహేను ఏళ్ళ మైలు రాయి చేరుకోవడం చాలా సంతోషంగా ఉంది. 'చిరుత' నుంచి 'మగధీర'కు... అక్కడి నుంచి 'రంగస్థలం' వరకు... అక్కడ నుంచి 'ఆర్ఆర్ఆర్', ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న RC15 వరకు... నటుడిగా చరణ్ ఎదిగిన తీరు మనసుకు ఆనందాన్ని కలిగించింది'' అని చిరంజీవి పేర్కొన్నారు. తనయుడితో దిగిన ఫోటోను ఆయన ట్వీట్ చేశారు.
'చిరుత' విడుదలై 15 సంతవ్సరాలు పూర్తి అయిన సందర్భంగా సోషల్ మీడియాలో మెగా అభిమానులు, ప్రేక్షకులు రామ్ చరణ్ ఘనతలు ట్వీట్ చేస్తున్నారు. చరణ్ ట్రెండింగ్‌లో ఉండేలా చూస్తున్నారు. #15YearsOfRamCharan, #15YrsOfRAMCHARANsRule, #15YearsForChirutha, #15YearsOfRamCharan హ్యాష్ ట్యాగ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
పదిహేనేళ్ల రామ్ చరణ్ కెరీర్‌లో 'మగధీర', 'ధ్రువ', 'రంగస్థలం', 'ఆర్ఆర్ఆర్' వంటి విజయాలు ఉన్నాయి. ఆయా సినిమాల్లో నటుడిగా ఆయన చూపించిన ప్రతిభ అభిమానులను మాత్రమే కాకుండా... అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. 'రచ్చ', 'నాయక్', 'ఎవడు' సినిమాలు కమర్షియల్ పరంగా విజయాలు సాధించాయి. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తున్న చరణ్, ఆ తర్వాత కూడా వరుసగా పాన్ ఇండియా సినిమాలు చేసే ఆలోచనలో ఉన్నారట.
మెగాభిమానులకు డబుల్ సెలబ్రేషన్స్!
చిరంజీవి, రామ్ చరణ్, మెగా అభిమానులకు ఈ రోజు డబుల్ సెలబ్రేషన్స్ అని చెప్పాలి. ఎందుకంటే... 'చిరుత' విడుదల తేదీ ఒకటి అయితే, 'గాడ్ ఫాదర్' ప్రీ రిలీజ్ (Godfather Pre Release Event) ఈవెంట్ కూడా ఈ రోజే కావడం మరో సెలబ్రేషన్. ఈ రోజు అనంతపురంలో మెగా ఫంక్షన్ జరగనున్న సంగతి తెలిసిందే. 'గాడ్ ఫాదర్' ట్రైలర్ ఈ రోజు సాయంత్రం ఎనిమిది గంటలకు విడుదల కానుంది. దాని కోసం మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.
Also Read : నాతో పెట్టుకుంటే ఊరుకోను, నాకు ఎవరు సాటి లేరు - వచ్చిండు చూడు మన 'జిన్నా' భాయ్
'గాడ్ ఫాదర్' సినిమా విషయానికి వస్తే... మోహన్ రాజా దర్శకత్వం వహించారు. కొణిదెల సురేఖ సమర్పణలో సూపర్ గుడ్ ఫిలిమ్స్ పతాకంపై ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో చిరు సోదరిగా నయనతార (Nayanthara) కనిపించనున్నారు. ఆమెకు భర్తగా ప్రతినాయకుడి పాత్రలో సత్యదేవ్ (Satyadev Kancharana), ఇతర కీలక పాత్రల్లో సునీల్, సముద్రఖని నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రత్యేక పాత్రలో నటించారు. ఈ చిత్రానికి నీరవ్ షా ఛాయాగ్రాహకుడు, సురేష్ సెల్వరాజన్ కళా దర్శకుడు. తమన్ సంగీతం అందించారు.
Also Read : గ్యాప్ తర్వాత మెగాఫోన్ పట్టిన ఆర్పీ పట్నాయక్ - కిల్లర్ కథతో ఎంటర్‌టైనింగ్ థ్రిల్లర్