మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో పాటు మాస్ మహరాజ్ రవితేజ చిరంజీవి తమ్ముడిగా ఓ పోలీస్ అధికారి పాత్రలో నటించారు. మూవీలో చిరంజీవి వింటేజ్ లుక్, యాక్షన్ సన్నివేశాలు, కామెడీ, పాటలు అన్నీ బాగుండటంతో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టారు. మూవీ విడుదలైన నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకొని లాభాల పంట పండించింది. దీంతో సినిమా సక్సెస్ ను విజయోత్సవ సభతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేయాలని నిర్ణయించింది మూవీ టీమ్. సినిమా సక్సెస్ సందర్బంగా విజయోత్సవ సభను ఏర్పాటు చేయడం పట్ల మెగా అభిమానులు హర్షం వక్తం చేస్తున్నారు. 


ఈ విజయోత్సవ సభను ఈ నెల 28న హనుమకొండలోని యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజి ప్రాంగణంలో సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్నట్టు ప్రకటించింది చిత్ర నిర్మాణ సంస్థ. అంతే కాదు ఈ ఈవెంట్ లో మరో సర్పైజ్ ను కూడా ప్లాన్ చేసింది మూవీ టీమ్. ఈ విజయోత్సవ సభకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా హాజరు కానున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ కార్యక్రమంపై మెగా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అంతేకాదు ఈ కార్యక్రమానికి ‘వీరయ్య విజయ విహారం’ అనే టైటిల్ ను కూడా పెట్టారు. ప్రస్తుతం ఈ ఈవెంట్ నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. 


దాదాపు నాలుగు దశాబ్దాలుగా మెగాప్టార్ చిరంజీవి నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు. మధ్యలో రాజకీయాల వల్ల గ్యాప్ వచ్చినా తర్వాత మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుసగా సినిమాల్లో నటిస్తున్నారు. అయితే మెగాస్టార్ రీ ఎంట్రీ తర్వాత ఆయన నటించిన సినిమాలు పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం దక్కలేదు. అయితే ‘వాల్తేరు వీరయ్య’ సినిమా ఆ గ్యాప్ ను పూర్తి చేసింది. వింటేజ్ చిరంజీవిని గుర్తు చేసేలా సంక్రాంతి బరిలో ‘వీరయ్య’ మాస్ జాతర చూపించారు. సినిమాకు మొదట్లో మిక్సిడ్ టాక్ వచ్చినా తర్వాత హిట్ టాక్ ను అందుకుంది. దీంతో ఈ మూవీ సంక్రాంతి హిట్ గా నిలవడమే కాదు.. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది.  


ఇక ఈ సినిమా వసూళ్ల విషయానికొస్తే.. సినిమా విడుదలైన నాలుగు రోజులకే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను రీచ్ అయ్యింది. అలాగే ఆంధ్రా, తెలంగాణలో రికార్డు స్థాయి వసూళ్లు సాధించింది. ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి రూ.103.89 కోట్లు కొల్లగొట్టింది. ఇంకా మిగిలిన చోట్ల అలాగే ఓవర్సీస్ తో కలపి రెండు వారాల్లో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.124.27 కోట్లు షేర్‌, రూ.212.40 కోట్లు గ్రాస్ వచ్చింది. ఈ చిత్రానికి బాబీ దర్వకత్వం వహించారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది.



Read Also: ‘సైంధవ్‘ నుంచి అదిరిపోయే అప్డేట్, వెంకీ మూవీలో బాలీవుడ్ యాక్టర్ కీరోల్