సాధారణ నటుడి నుంచి మెగాస్టార్‌ స్థాయికి ఎదగడమంటే సాధ్యం కాదు. నటనపై ఆసక్తితో ఎన్నో కష్టాలను ఎదుర్కొని.. ఒక్కో మెట్టు ఎక్కుతూ.. నేడు ఎంతోమంది అభిమానులను సంపాదించిన చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్నా కష్టమే. ఆయన సినీ జీవితమే కాదు.. వ్యక్తిత్వం కూడా ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతుంది. అయితే, చిరుకు ‘22’ నెంబరుతో విడదీయలేని అనుభూతి ఉంది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. 


మెగస్టార్ చిరంజీవి ఆగస్టు 22న పుట్టిన సంగతి తెలిసిందే. అయితే.. నటుడిగా రంగ ప్రవేశం చేసిన రోజు సెప్టెంబరు 22. ఈ సందర్భంగా చిరంజీవి ట్విట్టర్ వేదికగా.. తన సంతోషాన్ని పంచుకున్నారు. ‘‘22 ఆగస్టు నేను పుట్టిన రోజైతే.. 22 సెప్టెంబరు నటుడిగా నేను పుట్టిన రోజు. కళామతల్లి నన్ను అక్కున చేర్చుకున్న రోజు. మీ అందరికి నన్ను నటుడిగా పరిచయం చేసిన  మీ ఆశీస్సులు పొందిన రోజు. నేను మరిచిపోలేని రోజు’’ అని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసి అభిమానులు సైతం చిరంజీవి ఈ స్థాయికి చేరుకోడానికి పడిన కష్టాన్ని గుర్తుతెచ్చుకుంటున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి తన ట్విట్టర్ డీపీ కూడా మార్చారు. తన తొలి చిత్రంలోని పాత ఫొటోను ఆయన పోస్ట్ చేశారు.


చిరంజీవి చేసిన ట్వీట్ ఇదే:

 


Also Read: కొణిదెల శివశంకర వర ప్రసాద్.. చిరంజీవిగా ఎలా మారారు? అరుదైన ఫొటోలతో ‘చిరు’ చిత్రమాలిక


చిరును తొలి అవకాశం అలా వరించింది: చెన్నైలోని విజయరాఘవ రోడ్‌లో.. 11వ నెంబర్ ఇంట్లో చిరంజీవి, సుధాకర్, హరిప్రసాద్‌లు అద్దెకు ఉండి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించేవారు. ఓ రోజు సుధాకర్‌కు ‘పునాదిరాళ్లు’ సినిమాలో నటించేందుకు అవకాశం వచ్చింది. అదే సమయంలో తమిళంలో ప్రముఖ తమిళ దర్శకుడు భారతీ రాజా నుంచి సుధాకర్‌కు పిలుపు వచ్చింది. దీంతో ‘పునాదిరాళ్లు’ సినిమా వదిలేయాలని సుధాకర్ నిర్ణయించుకున్నారు. తనకు వచ్చిన తమిళ సినిమా అవకాశం గురించి చెప్పేందుకు సుధాకర్.. చిరంజీవితో కలిసి ‘పునాది రాళ్లు’ దర్శకుడు గూడపాటి రాజ్‌కుమార్‌ను కలిశారు. సుధాకర్ చెప్పింది విని రాజ్‌కుమార్ నిరుత్సాహానికి గురయ్యారు. పక్కనే ఉన్న చిరంజీవిని చూసి మీరు కూడా ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థే కదా అని అడిగారు. ఆ పాత్రలో మీరు చేస్తారా? అని అడిగారు. దీంతో చిరంజీవి.. సుధాకర్ వైపు ప్రశ్నార్థకంగా చూశారు. సుధాకర్ ఒప్పుకోమని సైగ చేయడంతో చిరంజీవి అంగీకరించారు. అలా చిరంజీవికి తొలి సినిమా అవకాశం దక్కింది. అయితే, ‘పునాది రాళ్లు’ కంటే ముందే ఆయన నటించిన రెండో చిత్రం ‘ప్రాణం ఖరీదు’ ముందుగా రిలీజ్ అయ్యింది. ఈ విషయాలను చెన్నైలోని ‘విజయచిత్ర’ సినిమా పత్రికలో పనిచేసిన సీనియర్ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. 


Also Read: టాలీవుడ్‌లో ‘మెగా’ సందడి.. వరుస చిత్రాలతో చిరు ప్రభంజనం.. ఫ్యాన్స్‌కు పూనకాలే!


‘ఖైదీ నెం.150’లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన చిరంజీవి.. 2021-2022లో వరుస చిత్రాలతో సందడి చేయనున్నారు.  చిరంజీవి నటిస్తున్న 152వ చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది.  ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న సందడి చేయనుంది. 153వ చిత్రం ‘గాడ్‌ఫాదర్’, ‘భోళాశంకర్’‌తోపాటు మరో రెండు చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి.  


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి