Mega Star Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. కోట్లామందికి ఆయ‌న ఇ‌న్‌స్పిరేష‌న్. వంద‌లాది సినిమాలు చేసి, త‌న స్టైల్, త‌న డ్యాన్స్, న‌ట‌నతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. కోట్లలో ఆస్తులు కూడా సంపాదించారు. అయితే, తాను ఏ స్థాయికి ఎదిగినా.. ఇప్ప‌టికీ మిడిల్ క్లాస్ మ్యాన్‌నే అని, తన మెంటాలిటీ అలానే ఉంటుంద‌ని అన్నారు చిరంజీవి. డిజిటిల్ మీడియా ఫెడ‌రేష‌న్ ఆరిజిన్ డే ఈవెంట్‌లో ఆయ‌న త‌న మిడిల్ క్లాస్ ముచ్చ‌ట్ల‌ను పంచుకున్నాడు. రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న స‌మాధానాలు చెప్తూ.. ఇంకా త‌న‌లో మిడిల్ క్లాస్ మ‌న‌స్త‌త్వం పోలేద‌ని చెప్పుకొచ్చారు. 


మిడిల్ క్లాస్ మెంటాలిటీస్.. 


డిజిటిల్ మీడియా ఫెడ‌రేష‌న్ ఈవెంట్ డేలో హీరో విజ‌య దేవ‌ర‌కొండ‌, చిరంజీవి ఇద్ద‌రు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా విజ‌య దేవ‌ర‌కొండ చిరంజీవిని ఇంట‌ర్వ్యూ చేశారు. ఆయ‌న కెరీర్, సక్సెస్, ఛాన్సులు, ఫ్యామిలీ గురించి చాలా విష‌యాలు అడిగాడు విజ‌య దేవ‌ర‌కొండ‌. దాంట్లో భాగంగానే "నేను ఇప్పుడు ఒక హీరోని, కానీ, నా మైండ్ కొన్ని విష‌యాల్లో అక్క‌డే ఆగిపోయింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎన్నో ఇబ్బందులు ప‌డిన‌వి ఉండిపోతాయి. ఎంత డ‌బ్బు చూసిన కొన్ని అల‌వాట్లు ఉండిపోతాయి. నేను ఇప్ప‌టికీ షాంపూ బాటిల్ అయిపోతే.. దాంట్లోనీళ్లు పోసి షేక్ చేసి పోసుకుని ప‌డేస్తా.. అలాంటి అల‌వాట్లు మీకు కూడా ఉన్నాయా?" అలాంటి అల‌వాట్లు ఒక ఐదు చెప్పండి అని విజ‌య దేవ‌ర‌కొండ అడిగిన ప్ర‌శ్న‌కి చిరంజీవి చాలా ఇంట్రెస్టింగ్ ఆన్స‌ర్స్ ఇచ్చారు. 


అరిగిపోయిన స‌బ్బుల‌ను అతికించి మ‌ళ్లీ వారం వాడ‌తాను.. 


"నా మ‌న‌సును ట‌చ్ చేశావు.. నేను నా గోడు చెప్పుకుంటాను. లైట్లు అన్నీ వేసి, అలా వ‌దిలేసి వెళ్లిపోతారండి. నేను వెళ్లి చూసి ఒకొక్క‌టి ఆపేసి వ‌స్తాను. గీజ‌ర్ వేసి స్నానం అవ్వ‌గానే వదిలేసి వెళ్లిపోతారు. నేను వెళ్లి వెతికి స్విచ్ ఆఫ్ చేస్తాను. ఈ మ‌ధ్య టెన్ష‌న్ ఎక్కువైపోయి ఇంట్లోని ఫ్యాన్లు, లైట్లు అన్ని మొబైల్ ఫోన్ లో యాక్సిస్ చేసుకున్నాను. మీరు న‌మ్మ‌రు ఇవాళ చ‌ర‌ణ్ బ్యాంకాక్ వెళ్లాడు. వాళ్ల ఫ్లోర్ క్లోజ్ చేశారు. ఎవైనా లైట్లు ఆన్ చేశారేమో అని మొబైల్ నుంచి.. ఆన్ చేసి ఉన్న లైట్ల‌ను అన్నీ ఆపేశాను. దీన్నే మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటారు అండి. ఈ రోజుల్లో ఇది అవ‌స‌రం. నువ్వు షాంపు అన్నావు.. నేనేం చేస్తానో చెప్ప‌నా.. అయిపోయిన సోపుల‌న్నీ గ‌ట్టిగా కంప్ర‌స్ చేసి వాడ‌తాను. ఇది నిజం అండి.. ఎవ్వ‌రూ న‌మ్మ‌రు. ఇలా నీళ్లు పోసుకుని కుదించి షాంపు నేను వాడ‌తాను. అందుకే, ఆయ‌న చెప్ప‌గానే రిలేట్ అయ్యాను నేను. మ‌న మెంటాలిటీ అలానే ఉండాలి కూడా" అని అన్నారు.


వాట‌ర్‌ను సేవ్ చేయాలి.. 


"ఈ రోజున అందుకే వాట‌ర్‌‌ను కూడా సేవ్ చేయాల‌ని చెప్తున్నాను. ప్ర‌స్తుతం బెంగ‌ళూరులో నీటి ఎద్ద‌డి ఉంది. అందుకే, నేను ఏడాది కిందే ఇంట్లో ఇంకుడు గుంత‌ను ఏర్పాటు చేశాను. అదే ట్వీట్ చేశాను. ఇది ప్ర‌తి ఒక్క‌రు చేస్తే వాట‌ర్ ని ప్రొటెక్ట్ చేసుకోవ‌చ్చు. రేపు పొద్దున మీమ‌ర్స్ అంద‌రూ క‌లిసి సోపు ముక్క‌ల్ని క‌లిపి వాడ‌తారు అని రాస్తారు.. దాన్ని ఎగ‌తాళిగా రాయొద్దు.. దాని నుంచి నీతి నేర్చుకునేలా రాయండి. విజ‌య దేవ‌ర‌కొండ లాంటి వాళ్లు, చిరంజీవి లాంటి వాళ్లు.. సూప‌ర్ స్టార్స్ అయినా కూడా షాంపును వేస్ట్ చేయ‌డం లేదు, సోపుల‌ను వేస్ట్ చేయ‌డం లేదు, షేవింగ్ చేసుకుని వాట‌ర్ ను సేవ్ చేస్తున్నారు. లైట్స్ ఆఫ్ చేశారా?  లేదా? అని చూసుకుంటున్నారు. సామాన్యుల‌కు ఇంకెంత బాధ్య‌త ఉంటుంది. అందుకే, ఎంత జోక్ గా రాసినా దాంట్లో ఆంత‌ర్యం తెలుసుకోండి. ప్ర‌తి ఒక్క‌రు ఎడ్యుకేట్ చేయండి. నీటి ఎద్ద‌డి లేకుండా మీ ద్వారా ప్ర‌చారం చేయండి. చాలా మంది ప్ర‌శ్న‌న అడిగి ట‌చ్ చేశావు విజ‌య్" అంటూ ముగించారు చిరంజీవి.


Also Read: ‘నా కోట్ సుమ ఎత్తుకొచ్చేసింది’.. భార్య సురేఖాకు చిరంజీవి ఫోన్, మెగాస్టార్ ఫన్‌కు ఫ్యాన్స్ ఫిదా