Water Tree in Alluri District: వాటర్‌ ట్రీ- చెట్టు నుంచి 20 లీటర్లు వరకు నీళ్లు, గిరిజనులకు మంచి ఔషధం

భూగర్భ జలాలు ఎక్కువ ఉంటే బోర్ల నుంచి నీరు ఉబికి రావడం చూస్తుంటాం. కానీ అల్లూరి సీతారామరాజు జిల్లాలో చెట్ల నుంచి నీళ్లు రావడంతో వీడియో వైరల్ అవుతోంది.

Continues below advertisement

Water Coming From Tree in Alluri District: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం కింటుకూరు ఫారెస్ట్‌లో చెట్టు నుంచి నీరు వస్తున్న వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఈ చెట్టు నుంచి నీరు బయటకు వస్తున్న వీడియో నిజమేనా.. లేక ఎడిటింగ్ వీడియోనా అని చర్చ జరుగుతోంది. ఈ విషయంపై జిల్లా అటవీశాఖ అధికారి జి.జి.నరేంద్రయాన్‌తో ఏబీపీ దేశం (ABP Desam) మాట్లాడినప్పుడు చాలా ఆసక్తికరమైన అంశాలను తెలిపారు.

Continues below advertisement

ఇంతకీ ఎలా బయటపడింది...
అల్లూరి జిల్లా రంపచోడవరం మండల పరిధిలో పర్యటిస్తున్న క్రమంలో కింటుకూరు ఫారెస్ట్‌లోకి ఎఫ్‌డీవో నరేంద్రయాన్‌, రేంజ్‌ అధికారి దుర్గాకుమార్‌, సిబ్బందితో కలిసి వెళ్లారు. వెంట తెచ్చుకున్న నీళ్లు నిండుకోవడంతో అక్కడ జరిగిన చర్చలో ఈ విషయం బయటకు వచ్చింది. అధికారులతో పాటు వెళ్లిన స్థానిక గిరిజనలు చెట్టులో కావాలిసినంత నీళ్లు దొరుకుతాయని చెప్పడంతో అక్కడకు వెళ్లినట్లు డీఎఫ్ఓ జి.జి.నరేంద్రయాన్‌ తెలిపారు.

ఈ చెట్లు గురించి గత సుమారు ఎనిమిదేళ్ల కిందట తెలిసింది. అయితే ఇప్పటివరకూ వెళ్లి అలాంటి చెట్లు చూడలేదు. అక్కడకు వెళ్లి చెట్టు మొదలు భాగంలో కత్తితో రంధ్రంచేయగా దాన్నుంచి నీళ్లు వచ్చాయి. ఆ సమయంలో చెట్టు నుంచి సుమారు 6 లీటర్లు వరకు  నీళ్లు బయటకు వచ్చాయి - డీఎఫ్ఓ నరేంద్రయాన్‌

చెట్టు నుంచి నీళ్లు రావడం అరుదైన విషయం కాదని, పైగా సాధారణ నల్లమద్దె చెట్టు అని అధికారులు తెలిపారు. దాని సాంకేతిక నామం(సైంటిఫిక్‌ నేమ్‌)  టెర్మినాలియా టుమంటోసా (Terminalia Tomentosa) అని పలుకుతారని డీఎఫ్ఓ తెలిపారు. అయితే ప్రతీ చెట్టులోనుంచి ఇలా నీళ్లు వచ్చే అవకాశం లేదని, నీళ్లు ఉన్న చెట్లు మొదలు భాగం ఉబ్బినట్లు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. కొన్నిచెట్లులో ఇది రెండు మూడు అడుగుల ఎత్తులో బాగా ఉబ్బినట్లు కనిపిస్తుందన్నారు. అయితే ఇలా నీరు వచ్చే చెట్లు చాలా అరుదుగా ఉంటాయని తెలిపారు. ఇవి వాటికి కావాల్సిన నీటిని భూమి నుంచి తీసుకుని కాండంలో(చెట్టు మొదలు భాగంలో) నిల్వ ఉంచుకుంటాయని వెల్లడించారు. నల్లమద్దెచెట్లు పాపికొండల నేషనల్‌ పార్కు పరిధిలో వేల సంఖ్యలో ఉన్నాయని వెల్లడించారు. 

గిరిజనులకు ఔషధంగా ఈ నీళ్లు..
నల్లమద్దె చెట్టు మొదలు భాగంలో లభించే ఈ నీళ్లు ఔషధంగా వినియోగిస్తున్నారు. ఉదర సంబంధిత ఇబ్బందులకు, వ్యాధులకు కొండారెడ్డి తెగకు చెందిన గిరిజనులు ఈ నీళ్లు ఔషదంగా వినియోగిస్తున్నట్లు తెలిపారని డీఎఫ్‌వో తెలిపారు. ఈ అటవీప్రాంతంలో దాహంగా ఉన్నప్పుడు ఈ చెట్టు నుంచి వచ్చే నీళ్లనే సేవిస్తుంటామని వారు చెప్పారని పేర్కొన్నారు. ఈనీళ్లు పులుపు, వగరు రుచితో ఉన్నాయని, ఆరోజు అటవీ ప్రాంతంలో నీళ్లు లేనప్పుడు ఈ నీటినే సేవించామని చెప్పారు. ఒక్కో చెట్టునుంచి 5 నుంచి 20 లీటర్లు వరకు ఈనీళ్లు లభిస్తాయని, ఈ నీటిని గిరిజనలు లోకల్‌ మెడిసిన్‌గా కూడా భావిస్తారని చెప్పారు. ఈ నీటిలో పోషక విలువలు కనుగొనేందుకు నీటిని ల్యాబ్‌కు పంపించారా అన్న ప్రశ్నకు అటువంటి ప్రయత్నం చేయలేదని క్లారిటీ ఇచ్చారు. ఈ తరహా చెట్లు మహారాష్ట్ర, తెలంగాణ అడవుల్లోనూ ఎక్కువగా ఉన్నాయని డీఎఫ్ఓ నరేంద్రయాన్‌ తెలిపారు.
Also Read: చెట్టు నుంచి ఉబికి వచ్చిన నీళ్లు - ఆశ్చర్యపోయిన అటవీ అధికారులు, ఎక్కడంటే?

Continues below advertisement
Sponsored Links by Taboola