‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో రామ్ చరణ్ క్రేజ్ మరింత పెరిగిపోయింది. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు ఆస్కార్ రావడంతో ఈ మూవీ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగింది మార్చి 13 న అమెరికా లాస్ ఏంజెలెస్ లో జరిగిన 95 వ ఆస్కార్ అవార్డుల వేడుకలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ దక్కింది. ఇండియన్ సినిమాకు ఆస్కార్ రావడం పట్ల యావత్ భారత దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఆస్కార్ వేడుకల తర్వాత మూవీ టీమ్ హైదరాబాద్ కు చేరుకుంది. అయితే రామ్ చరణ్ మాత్రం సతీమణి ఉపాసనతో కలసి ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. అదే రోజు సాయంత్రం ప్రధాని మోఢీతో కలసి ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో చత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ సలహాదారు గౌరవ్ ద్వివేదీని అక్కడ కలిశారు. 


రామ్ చరణ్ తో భేటి అయిన ద్వివేది.. ఆస్కార్ అవార్డులలో భారతదేశం కూడా ఉన్నందుకు ఎంతో గర్వంగా ఉందని అన్నారు. ముఖ్యమంత్రి తరఫున రామ్ చరణ్ కు ద్వివేది శుభాకాంక్షలు తెలిపారు. తమ రాష్ట్రంలో టాలీవుడ్ సినిమాలకు మంచి ఆదరణ ఉందని, ముఖ్యంగా సరిహద్దు జిల్లాల్లో ఎక్కువగా తెలుగు సినిమాలను ప్రేమిస్తారని అన్నారు. అలాగే రాష్ట్రంలో షూటింగ్ ల గురించి చరణ్ తో కాసేపు చర్చించారు.  చత్తీస్ ఘడ్ లో ఉన్న సినిమా పాలసీ గురించి, లోకేషన్స్ గురించి వివరించారు. రామ్ చరణ్ ను చత్తీస్ ఘఢ్ సందర్శించాలని ఆహ్వానించారు. దీనిపై రామ్ చరణ్ స్పందిస్తూ.. త్వరలో తాను  తన బృందంతో కలసి చత్తీస్ ఘడ్ లో పర్యటిస్తానని అన్నారు. భేటీ అనంతరం రాష్ట్రానికి సంబంధించిన హెర్బల్ ప్రొడక్ట్స్ అలోవెరా జ్యూస్, చింతపండు, మిఠాయి తదితర అటవీ సంబంధ ఉత్పత్తులను పంపిణీ చేశారు. చత్తీస్ ఘడ్ ప్రజల ప్రేమ పట్ల రామ్ చరణ్ కృతజ్ఞతలు తెలిపారు. 


అంతకముందు రామ్ చరణ్ కు ఢిల్లీలో ఘన స్వాగతం పలికారు అభిమానులు. ఆయన ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అవుతున్నారు అని తెలియగానే క ఢిల్లీ విమానాశ్రయం వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. ‘ఆర్ఆర్ఆర్’, రామ్ చరణ్ ఫ్లెక్సీలు, బ్యానర్లు పట్టుకుని హల్చల్ చేశారు. ఇక రామ్ చరణ్ అభిమానులతో కలసి సెల్ఫీలు దిగారు. అనంతరం ‘ఇండియా టుడే కాంక్లేవ్’ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఢిల్లీలో జరగిన ఈవెంట్ లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, క్రికెటర్ సచిన్ లతో పాటు రామ్ చరణ్ కూడా అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఆయన హైదరాబాద్ కు చేరుకున్నారు. 


ఇక రామ్ చరణ్ తదుపరి శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆర్ సి 15’ లో భాగం కానున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కియార అద్వానీ రెండోసారి చరణ్ తో జత కట్టనుంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీను ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ మూవీ తర్వాత చరణ్, ‘ఉప్పెన’ ఫేమ్ దర్శకుడు సాన బుచ్చిబాబుతో ఓ సినిమా చేయనున్నారు.


Read Also: ఆస్కార్‌తో హైదరాబాద్‌ చేరుకున్న ‘RRR’ టీమ్, ఘన స్వాగతం పలికిన అభిమానులు