ఓ సినిమా తీయడం అనేది మనిషి పుట్టుకతో సమానమని అగ్ర దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) అన్నారు. ప్రతిభావంతులైన యువతను ప్రోత్సహించడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. దర్శకుడిగా ఇప్పుడు ప్రభాస్‌తో 'ప్రాజెక్ట్ కె' చేస్తున్న ఆయన... దీనికి ముందు 'జాతి రత్నాలు' నిర్మించారు. ఇప్పుడు 'చెడ్డి గ్యాంగ్ తమాషా' అనే చిన్న సినిమా టీజర్ విడుదల చేశారు. 


వెంకట్ కళ్యాణ్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన సినిమా 'చెడ్డి గ్యాంగ్ తమాషా' (Cheddi Gang Tamasha Movie). అబుజా ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ లీల ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు నిర్మించాయి. సిహెచ్ క్రాంతి కిరణ్ నిర్మాత. ఈ సినిమాలో గాయత్రి పటేల్ హీరోయిన్. షూటింగ్ కంప్లీట్ అయ్యింది. త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శుక్రవారం ఈ సినిమా టీజర్‌ను నాగ్ అశ్విన్ విడుదల చేశారు.
  
చెడ్డి గ్యాంగ్ to తమాషా గ్యాంగ్!
Cheddi Gang Tamasha Teaser : నలుగురు కుర్రాళ్లతో కలిసి హైదరాబాద్ సిటీలో చోరీలకు పాల్పడే ఓ యువకుడు జీవితం, ఓ అమ్మాయి ప్రేమ కారణంగా ఏ విధంగా మారింది? ప్రేమలో పడ్డాక ఆ 'చెడ్డి గ్యాంగ్' కాస్త 'తమాషా గ్యాంగ్'గా ఎలా మారింది? అనేది సినిమా కథ అని టీజర్ చూస్తే తెలుస్తోంది. 



టీజర్ బావుంది : నాగ్ అశ్విన్
'చెడ్డి గ్యాంగ్' టీజర్ బావుందని నాగ్ అశ్విన్ అన్నారు. అది చూస్తే... తాను తీసిన 'ఎవడే సుబ్రమణ్యం' గుర్తుకు వచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇంకా నాగ్ అశ్విన్ మాట్లాడుతూ... ''మా కుటుంబానికి ఎంతో సన్నిహితులైన నిర్మాత క్రాంతి కిరణ్ గారు, యంగ్ టీమ్ తీసిన ఈ 'చెడ్డి గ్యాంగ్ తమాషా' విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చిన్న సినిమా, పెద్ద సినిమా అంటూ తేడా ఏం ఉండదు. కంటెంట్ బాగుంటే ప్రతి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారు'' అని చెప్పారు. 


పదిహేనేళ్ల కల : వెంకట్ కళ్యాణ్
''ఈ సినిమా నా 15 సంవత్సరాల కల. సినిమా మీద ప్రేమతో, నటుడు అవ్వాలనే మా అమ్మ కోరికతో ఇండస్ట్రీకి వచ్చా. నాగ్ అశ్విన్ గారు మా టీజర్ విడుదల చేయడం హ్యాపీగా ఉంది. ప్రేక్షకులు అందరికీ మా సినిమా వినోదం అందిస్తుందని కచ్చితంగా చెప్పగలను'' అని హీరో, దర్శకుడు వెంకట్ కళ్యాణ్ చెప్పారు. నాలుగు గంటల కంటెంట్ ఉన్న సినిమాను 2.40 గంటలకు కుదించడానికి చాలా కష్టపడినట్లు, గర్భశోకను అనుభవించినట్టు నిర్మాత క్రాంతి వివరించారు. త్వరలో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. సినిమాలో అవకాశం రావడం పట్ల గాయత్రి పటేల్ సంతోషం వ్యక్తం చేశారు. 


Also Read : ఎన్టీఆర్ - కొరటాల శివ సినిమా టైటిల్ అది కాదు!


ఇంకా ఈ కార్యక్రమంలో నాగ్ అశ్విన్ తల్లి డాక్టర్ జయంతి రెడ్డి, డాక్టర్ ఉష, నటుడు లోహిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వెంకట్ కళ్యాణ్, గాయత్రి పటేల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సీహెచ్ క్రాంతి కిరణ్ నిర్మాత. విహారి పాటలు రాయగా... అర్జున్ నల్లగొప్పుల సంగీతం అందించారు.