Meaning of Thandel : టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య చివరిగా కనిపించిన ‘కస్టడీ’ మూవీ ప్రేక్షకులను అంతగా అలరించలేకపోయింది. తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం విడుదలైనా, ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. ప్రస్తుతం నాగ చైతన్య తన ఆశలన్నీ తర్వాతి సినిమా ‘తండేల్’ మీదే పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన చందు మొండేటి దర్శకత్వంలో ఈ మూవీ చేస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ లో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నాగ చైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ సంస్థ '100 పర్సెంట్ లవ్' నిర్మించింది. ఇప్పుడు మళ్లీ ‘తండేల్’ మూవీని నిర్మిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తాజాగా విడుదలైన వీడియో గ్లింప్స్ సినిమాపై అంచనాలు భారీగా పెంచింది.
నాగ చైతన్య కెరీర్ లో 23వ సినిమాగా ‘తండేల్’ తెరకెక్కుతోంది. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఇప్పుడు ‘తండేల్’ కోసం మరోసారి జోడీ కడుతోంది. తాజాగా ఈ సినిమా టైటిల్ గురించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఇంతకీ ‘తండేల్’ అంటే ఏంటి? అని నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఎవరి తోచినట్టుగా వారు ‘తండేల్’ అర్థాలు చెప్తున్నారు.
‘తండేల్’ అంటే ఏమిటీ?
తాజాగా ‘తండేల్’ అంటే ఏంటో స్వయంగా చిత్ర దర్శకుడు చందూ మొండేటి వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన టైటిల్ మీనింగ్ చెప్పారు. గుజరాతీ భాషలో ‘తండేల్’ అంటే బోటు నడిపే ఆపరేట్ అని అర్థం అన్నారు. గుజరాత్, పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలోని గ్రామాల ప్రజలు ‘తండేల్’ అనే పదాన్ని ఉపయోగిస్తారని చెప్పారు. బతుకుతెరువు కోసం గుజరాత్ వీరవల్‌కు వెళ్లిన కొంత మంది శ్రీకాకుళం మత్స్యకారులు, చేపల వేటకు వెళ్లి పాకిస్థాన్ కోస్టుగార్డులకు చిక్కుతారు. ఆ తర్వాత ఏం జరిగిందనే కథాంశంతో ‘తండేల్’ సినిమా తెరకెక్కనుంది. ఇందులో నాగ చైతన్య గుజరాత్ సముద్రతీర జలాల్లో చిక్కుకున్న శ్రీకాకుళానికి చెందిన జాలరి పాత్రలో కనిపించనున్నారు.
నాగ చైతన్య రీసెంట్ గా ‘ధూత’ అనే వెబ్ సిరీస్ లో నటించాడు. జర్నలిస్టు పాత్రలో కనిపించిన ఆయన అద్భుత నటనతో ఆకట్టుకున్నాడు. ప్రైమ్ వీడియోలో రీసెంట్ గా ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు వచ్చింది. సూపర్ నేచురల్ హారర్ కథాంశంతో ఈ సిరీస్ తెరకెక్కింది. ఈ వెబ్ సిరీస్‌కు విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించారు. మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్ తో ఉన్న ఈ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
Read Also: ‘సూపర్ మ్యాన్’ కాదు అమీర్ ఖాన్ కొడుకు - అతడిని చూస్తే మీరూ ఇలాగే కన్‌ఫ్యూజ్ అవుతారు!