CCL 2023 Winner: సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2023 ట్రోఫీని తెలుగు వారియర్స్ గెలుచుకుంది. ఫైనల్ మ్యాచ్‌కు గానూ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌, సీజన్‌కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను తెలుగు వారియర్స్ కెప్టెన్ అక్కినేని అఖిల్ దక్కించుకున్నాడు. బెస్ట్ బౌలర్ ఆఫ్ ది మ్యాచ్, ఎంటర్‌టైనర్ ఆఫ్ ది సీజన్‌ అవార్డులు తమన్‌కు దక్కాయి. భోజ్‌పురి దబాంగ్స్‌తో జరిగిన ఫైనల్లో తొమ్మిది వికెట్ల తేడాతో గెలిచిన తెలుగు వారియర్స్ జట్టు ఏకంగా నాలుగోసారి సీసీఎల్ టైటిల్‌ను దక్కించుకుంది. విశాఖ పట్నం వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. 


భోజ్‌పురి దబాంగ్స్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్ల నష్టానికి 72 పరుగులకే పరిమితం అయింది. తెలుగు వారియర్స్ తరఫున కెప్టెన్ అక్కినేని అఖిల్ (32 బంతుల్లో 67) విధ్వంసక ఇన్నింగ్స్ ఆడి అర్థ శతకం సాధించాడు. అయితే అతనికి మిగతా బ్యాట్స్‌మెన్ నుంచి సహకారం ఏమాత్రం లభించలేదు. దీంతో తెలుగు వారియర్స్ జట్టు 10 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 104 పరుగులు సాధించింది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో తెలుగు వారియర్స్ 32 పరుగుల ఆధిక్యం సంపాదించింది.


భోజ్‌పురి దబాంగ్స్ రెండో ఇన్నింగ్స్‌లో ఆదిత్య ఓజా (13 బంతుల్లో 31), ఉదయ్ తివారీ (18 బంతుల్లో 34) రాణించారు. దీంతో భోజ్‌పురి జట్టు నిర్ణీత 10 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 32 పరుగుల ఆధిక్యం సంపాదించిన ఉన్న తెలుగు వారియర్స్‌ ముందు రెండో ఇన్నింగ్స్‌లో 58 పరుగుల లక్ష్యం మాత్రమే నిలిచింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన తెలుగు వారియర్స్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఈ లక్ష్యాన్ని చేధించింది.


సీసీఎల్ టోర్నమెంట్ 2011లో తొలిసారి జరిగింది. ఆ టోర్నమెంట్‌లో నాలుగు జట్లు మాత్రమే పాల్గొన్నాయి. తెలుగు వారియర్స్ జట్టు 2015 నుంచి వరుసగా మూడు సంవత్సరాల పాటు టైటిల్ గెలిచింది. ఇప్పుడు జరిగిన సీజన్లో ఎనిమిది జట్లు పాల్గొన్నాయి. భోజ్‌పురి దబాంగ్స్ జట్టు ఒక్క మ్యాచ్‌లో కూడా ఓడిపోకుండా ఫైనల్ చేరింది. కానీ ఫైనల్లో మాత్రం చేతులెత్తేసింది. ఈసారి గత సీజన్లకు భిన్నంగా టెస్టు ఫార్మాట్ తరహాలో రెండు ఇన్నింగ్స్‌లుగా సీసీఎల్‌ టోర్నమెంట్‌ను నిర్వహించారు.


మరోవైపు తెలుగు వారియర్స్ ప్రయాణం మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా సాగింది. రెండు అర్హత మ్యాచ్‌ల్లో ఓడిపోయిన తెలుగు వారియర్స్ ఒకానొక దశలో టోర్నీ నుంచి నిష్క్రమించే ప్రమాదాన్ని కూడా ఎదుర్కొంది. కానీ చెన్నై రైనోస్ నెట్ రన్ రేట్ మరింత తక్కువగా ఉండటం తెలుగు వారియర్స్‌కు బాగా కలిసొచ్చింది. శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో టోర్నమెంట్‌లో అత్యంత బలమైన జట్లలో ఒకటైన కర్ణాటక బుల్డోజర్స్‌ను తెలుగు వారియర్స్ ఓడించింది. ఈ విజయంతో ఫైనల్స్‌లో చోటు కూడా సంపాదించింది. నాకౌట్ దశ వరకూ కర్ణాటక బుల్డోజర్స్ అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. దీంతో ఆ జట్టును టైటిల్ రేసులో హాట్ ఫేవరేట్‌గా పరిగణించారు. కానీ టాలీవుడ్ జట్టు కర్ణాటక బుల్డోజర్స్‌ను సెమీస్‌లో బుల్డోజ్ చేసింది. మరోవైపు భోజ్‌పురి దబాంగ్స్ జట్టు సెమీఫైనల్లో ముంబై హీరోస్‌ను చిత్తుగా ఓడించి ఫైనల్‌కు చేరుకుంది.