ప్రశాంత్ నీల్. తెలుగు గడ్డపై పుట్టిన దిగ్గజ దర్శకుడు. ‘కేజీఎఫ్’ సినిమాతో దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకున్నారు. ‘కేజీఎఫ్-2’తో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టారు. ప్రస్తుతం మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ల లిస్టులో ఆయన చేరిపోయారు. ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి  ‘సలార్’ అనే పాన్ ఇండియన్ మూవీ చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తో మరో సినిమా చేయబోతున్నారు. తాజాగా ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ట్విట్టర్ అకౌంట్ ను డీ-ఆక్టివేట్ చేశారు. ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు కారణం ఏంటని సినీ ప్రేక్షకులు ఆరా తీస్తున్నారు.


వాస్తవానికి ‘కేజీఎఫ్’ సక్సెస్ తర్వాత ప్రభాస్ తో సినిమా చేయనున్నట్లు ప్రభాస్ ప్రకటించారు. దీంతో కన్నడ ఫ్యాన్స్ ప్రశాంత్ పై నెగటివ్ కామెంట్స్ చేశారు. కన్నడ సినిమాతో హిట్ కొట్టిన ప్రశాంత్ నీల్ వెంటనే తెలుగు హీరోతో సినిమా చేయడం ఎందుకు? కన్నడలో ఆయన సినిమా చేయదగిన హీరో మరెవరూ లేరా? అంటూ ట్రోలింగ్ కు దిగారు. అయినా, తను ఈ ట్రోలింగ్స్ ను పెద్దగా పట్టించుకోలేదు.


ఆ ట్వీటే అసలు కారణమా?


జనవరి 8న ‘కేజీఎఫ్’ స్టార్ యశ్ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్ యశ్ కు బర్త్ డే శుభాకాంక్షలు చెప్పారు. ఇక్కడే అసలు సమస్య వచ్చిపడింది. ఆయన ఇంగ్లీష్ లోనో, కన్నడలోనో, తెలుగులోనో కాకుండా ఉర్దూలో ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో కన్నడ సినీ లవర్స్ ప్రశాంత్ నీల్ పై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ కు దిగారు. “మీకు కన్నడ వచ్చుకదా? అసలు ఉర్దూలో ట్వీట్ చేయాల్సిన అవసరం ఏముంది?” అంటూ మండిపడ్డారు. ఓ వైపు ఈ ట్రోలింగ్ కొనసాగుతుండగానే  ప్రశాంత్ నీల్ ట్విట్టర్ అకౌంట్ డీ-ఆక్టివేట్ అయ్యింది. ఆయన ట్విట్టర్ ను చూడ్డానికి ప్రయత్నిస్తే ఈ అకౌంట్ పని చేయడం లేదనే సందేశం కనిపిస్తోంది. నెటిజన్ల నుంచి వస్తున్న నెగెటివ్ కామెంట్స్ కు హర్ట్ అయ్యే ప్రశాంత్ నీల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ, ట్విట్టర్ అకౌంట్ ఎందుకు డీ ఆక్టివేట్ అయ్యింది? అనే విషయంపై అసలు విషయం తెలియాలంటే ప్రశాంత్ నీల్ స్పందించాల్సిందే .


నెటిజన్లపై సినీ పెద్దల ఆగ్రహం


అటు సినీ ప్రేక్షకుల ఓవరాక్షన్ పట్ల సినీ పెద్దలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హీరోల మీద అభిమానం ఉండవచ్చు కానీ, దర్శకులపై అడ్డగోలు వ్యాఖ్యలు చేయడం మంచిది కాదంటున్నారు. ‘ఆచార్య’ సినిమా ఫ్లాప్ అయిన సందర్భంలోనూ చిరంజీవి అభిమానులు కొరటాల శివను తీవ్రంగా ట్రోల్ చేశారు. ఆయన కూడా తన సోషల్ మీడియా అకౌంట్ ను క్లోజ్ చేశారు. తాజాగా ప్రశాంత్ నీల్ కూడా అలాంటి సమస్యనే ఎదుర్కొన్నారు.  అటు ‘సలార్’ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ప్రశాంత్ బిజీ అయ్యారు.


Read Also: ఈ గౌరవం ప్రతి భారతీయుడికి గర్వకారణం, ‘RRR’ టీమ్ కు ప్రధాని మోడీ అభినందనలు