Bigg boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ ఎవరో తేలిపోవడానికి ఇంకా రెండు వారాలు ఉంది. ఈవారం ఒకరు టాప్ 5లో నిల్చునే కంటెస్టెంట్‌గా నిలవబోతున్నారు. అందుకోసమే టిక్కెట్ టు ఫినాలే టాస్కు జరుగుతోంది. ఇందులో గెలిచిన వ్యక్తి ఫైనల్లోకి వెళ్లిన మొదటి కంటెస్టెంటు అవుతారు. అందులో భాగంగా గుడ్డు జాగ్రత్త అనే టాస్కు ఇచ్చారు. ఇందులో గుడ్డును ఒక స్టాండుపై నిల్చోబెట్టి, అది కింద పడకుండా చివరి వరకు వెళ్లాలి. కిందపడితే అవుట్ అయినట్టే.
ఆదిరెడ్డి, ఫైమా, రేవంత్, శ్రీహాన్ ఈ ఆట ఆడారు. రేవంత్ సగం దూరం వెళ్లాక గుడ్డు కింద పడిపోయింది. దీంతో అతనిలోని కోపం మళ్లీ కట్టలు తెంచుకుంది. సంచాలక్ అయిన శ్రీసత్యతో ఆయన వాదనకు దిగాడు. రేవంత్ ఓటమిని జీర్ణించుకోలేడు. ప్రతి దానికి వాదన పెట్టుకుంటాడు. ఈ ఒక్క గుణమే ఆయనలో పెద్ద మైనస్. లేకపోతే విన్నర్‌కి ఉండాల్సిన లక్షణాలు ఇతనిలో పుష్కలంగా ఉన్నాయి. గుడ్డు సంచాలక్ కి కనిపించకుండా అతను చేయి అడ్డుపెట్టడంతో శ్రీసత్య ‘మాకు కనిపించడం లేదు’ అని చెప్పింది. దానికి రేవంత్ ప్రేక్షకులకు చిరాకు తెప్పించేలా వాదించసాగాడు. చీటికి మాటికి అలగడం, వాదనకు దిగడం చూడటానికి విసుగ్గా అనిపిస్తుంది.
ఈ వారం ఎనిమిది మంది ఇంట్లో ఉన్నారు. వారిలో ఆరుగురు నామినేషన్లలో ఉన్నారు. వీరిలోంచి ఈవారం ఇద్దరినీ తీస్తారో లేక ఒకరిని ఎలిమినేట్ చేస్తారో ఇంకా క్లారిటీ లేదు. టాప్ 5ని ఫైనల్లోకి తీసుకెళితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది. టాప్ 6 అయితే మాత్రం ఈ వారం ఒకరు, వచ్చే వారం ఒకరిని ఎలిమినేట్ చేస్తారు. ఆదిరెడ్డి విన్నర్ మెటీరియల్ అయినా ఆయన చేసే కొన్ని ఓవరాక్షన్ పనులు, మాటలు, నాగార్జునతో అధికంగా వాదించడం, తానేదో చాలా గొప్ప వ్యక్తినని చెప్పుకోవడం, తాను నిజాయితీ పరుడినని పదే పదే చెప్పుకోవడం ఇవన్నీ కాస్త అతి అయ్యాయి. నామినేషన్లలో కూడా ఆయన మాట్లాడే తీరు, గొడవపడే తీరు అతిగా అనిపిస్తుంది.
Also read: టిక్కెట్ టు ఫినాలే రేసులో కీర్తికి కోపం - కాలితో తన్నిన కార్తీక దీపం బ్యూటీ