Pallavi Prashanth Arrest: బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ చిక్కుల్లో పడ్డాడు. విజేతగా నిలిచిన ఆనందం ఎంత సేపు నిలవలేదు. అభిమానులు ‘అతి’ అతడిని జైలుకు పంపేలా చేసింది. అయితే, కేవలం అభిమానులు చేసిన అల్లర్ల వల్లే కాదు.. పల్లవి ప్రశాంత్ అత్యుత్సాహం కూడా అరెస్టుకు కారణమని తెలుస్తోంది. పోలీసుల మాట వినకుండా మొండిగా వ్యవహరించడం వల్లే అభిమానులు రెచ్చిపోయారని, ప్రభుత్వ, ప్రైవట్ ఆస్తులను ధ్వంసం చేశారనేది ప్రధాన ఆరోపణ. మరి, ఇంతకీ ఆ రోజు ఏం జరిగింది? ఆ అల్లర్ల వెనుక పల్లవి ప్రశాంత్ ప్రమేయం ఉందా?


అసలు ఏం జరిగిందంటే..


పోలీసులు.. పల్లవి ప్రశాంత్‌ను అరెస్ట్ చేసిన తర్వాత అసలు ఆ రోజు ఏం జరిగింది అని వివరాలను బయటపెట్టారు. గొడవ జరుగుతుందని పల్లవి ప్రశాంత్‌ను వేరే గేట్ నుంచి బయటికి పంపినా.. అతడు వినకుండా మళ్లీ అక్కడికే తిరిగి వచ్చాడని, అలా రావడంతోనే గొడవ పెద్దగా అయ్యి.. పోలీసుల కార్లపై దాడి జరిగిందని క్లారిటీ ఇచ్చారు. ప్రశాంత్ విన్నర్ అయిన తర్వాత ర్యాలీ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో అతడి సోదరుడు మనోహర్, ఫ్రెండ్ వినయ్.. రెండు కార్లను అద్దెకు తెచ్చారు. ఆ సమయంలో అక్కడ ఉన్న పరిస్థితుల్లో ర్యాలీ కష్టమని, కావాలంటే తరువాతి రోజు సభ ఏర్పాటు చేసుకోమని చెప్పారు పోలీసులు. అంతే కాకుండా వాళ్లు అద్దెకు తెచ్చుకున్న కార్లను తీసుకొని వేరే వాహనాల్లో పంపించారు.


పోలీసుల మాట వినని ప్రశాంత్


ప్రశాంత్ మాత్రం ర్యాలీ జరిగే తీరాలి అంటూ మరోసారి అద్దె వాహనాలు తీసుకొని స్టూడియోస్ వద్దకు తిరిగి వచ్చాడని, అటుగా రావద్దని, ర్యాలీ నిర్వహించడం కష్టమని ఎంత చెప్పినా.. ప్రశాంత్ తమ మాట వినలేదని పోలీసులు చెప్తున్నారు. పల్లవి ప్రశాంత్ ర్యాలీనే అడ్డుకుంటారా అని అతడి ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. అక్కడ ఉన్న కార్లతో పాటు రెండు పోలీస్ వాహనాలపై కూడా దాడి చేసి.. వాటి అద్దాలను ధ్వంసం చేశారు. ఆరు ఆర్టీసీ బస్సుల అద్దాలను కూడా పగలగొట్టారు. వారి ప్రవర్తన చూసి పోలీసులు సూమోటోగా కేసు నమోదు చేసుకున్నారు. ముందుగా వెనక్కి వెళ్లిపోమంటే వెళ్లకుండా ఉన్న రెండు కార్ల డ్రైవర్లను అరెస్ట్ చేశారు. కేసులో ఏ1గా పల్లవి ప్రశాంత్ పేరును నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత అతడిని అదుపులోకి తీసుకున్నారు.


మరిన్ని అరెస్టులకు అవకాశం


కేసు నమోదు చేయడంతో పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నాడని వార్తలు ప్రచారమయ్యాయి. అయితే అలా జరగలేదని, తాను ఇంటి వద్దే ఉన్నానని ఒక వీడియోను విడుదల చేశాడు ప్రశాంత్. ఆ వీడియో బయటికొచ్చిన కొన్ని గంటల్లోనే పోలీసులు.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు సూమోటోగా నమోదు చేసిన కేసుతో పాటు దాడులకు పాల్పడ్డ ఆకతాయిలపై మరో కేసు కూడా నమోదయ్యింది. బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ గీతూ రాయల్ కారు అద్దాలు పగలగొట్టారని, తనతో అసభ్యంగా ప్రవర్తించే ప్రయత్నం చేశారని పలువురు ఆకతాయిలపై ఆమె ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఆ రోజు గొడవను కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేసినా.. ఆకతాయిలు మరింత రెచ్చిపోయారు. దీంతో సీసీటీవీ ఫుటేజ్ చూసి మరికొందరిని అదుపులోకి తీసుకుంటామన్నారు. అలాగే రోజు వివిధ యూట్యూబ్ చానెళ్లలో వచ్చిన వీడియోలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రశాంత్ ప్రస్తుతం 14 రోజులు రిమాండ్‌లో ఉన్నాడు.


Also Read: పల్లవి ప్రశాంత్‌కు 14 రోజుల రిమాండ్ - చంచల్‌గూడ జైలుకు తరలింపు