Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ అన్నీ సీజన్లను చూస్తే దాదాపు ఆటలు ఒకేలాంటివి రిపీట్ అవుతుంటాయి. అదే పువ్వులు ఏరుకునే ఆట, అదే తాళ్లు ముడివిప్పే ఆట... ఇలా తెలిసిన ఆటలే కావడంతో ప్రేక్షకులకు కాస్త బోరింగ్ గా అనిపించింది. అందుకేనేమో ఈసారి పాము - నిచ్చెన ఆట పెట్టారు. మొన్నటి వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున ఇంటి సభ్యులతో ఎవరు పాము? ఎవరు నిచ్చెన? అనే ఆట ఆడించారు. ఆ పామునే ఈ ఆటలోనూ ఉపయోగించారు. 


ప్రోమోలో ఏముందంటే ఇంటి సభ్యులకు కెప్టెన్సీ కంటెండర్ల టాస్కు ఇచ్చాడు బిగ్‌బాస్. ఆ టాస్కులో భాగంగా పాము - నిచ్చెన ఆట ఇచ్చారు. ఇందులో ఒక మూల ‘వేర్ హౌస్’ నిర్మించారు. అందులో మట్టిని సమయాను సారంగా పెడుతూ వచ్చారు. ఆ మట్టిని తెచ్చి సగం మంది ఇంటి సభ్యులు నిచ్చెనలు కట్టాలి. సగం మంది ఇంటి సభ్యులు పామును నిర్మించాలి. అయితే పాపం కీర్తి ఒక చేతి వేలి విరిగిపోవడంతో ఆమె చాలా ఇబ్బంది పడింది. మట్టి ఎత్తి తెచ్చుకుని పామును కట్టేందుకు ఇబ్బంది పడింది. 


ఆ తరువాత పాము బుస్ మనే శబ్ధాన్ని ఇచ్చినప్పుడు పాము బొమ్మలు నిర్మించిన వారిలో ఒకరు, నిచ్చెనలు కట్టిన వారిలోని ఒకరిని ఎంచుకుని వారి నిచ్చెనలోని మట్టిని లాక్కోవాల్సి ఉంటుంది. అయితే కీర్తికి అవకాశం రావడంతో రాజ్ కట్టిన నిచ్చెనలోని మట్టిని తీసేందుకు ప్రయత్నించింది. ఒంటి చేత్తోనే కష్టపడింది. కానీ వీలు కాలేదు. దీంతో ఏడ్చేసింది. అందరూ వచ్చి ఓదార్చారు. ‘తాను వేలి నొప్పి వల్ల ఏడ్వడం లేదని, దీని వల్ల ఏమీ చేయలేకపోతున్నాను’ అని చెప్పి ఏడ్చింది. ఆమె కాళ్లలో కూడా స్టీలు రాడ్స్ ఉన్నాయి. అయినా ఆమె ఫిజికల్‌గా ఆడేందుకు చాలా కష్టపడుతోంది. 


వాసంతి లాక్ మామూలుగా లేదు...
గీతూ ట్విన్ సిస్టర్‌లా రెచ్చిపోయే శ్రీసత్యను వాసంతి చాలా తెలివిగా లాక్ చేసింది. వాసంతి కట్టిన పాములోని మట్టిని తీసేందుకు వచ్చింది శ్రీసత్య.  ఎలాగోలా కాస్త మట్టిని తీసుకుంది కానీ ఆమెను కదలనివ్వకుండా గట్టిగా పట్టేసి లాక్ చేసేసింది వాసంతి. సత్య ఆ పట్టు నుంచి విడిపించుకోలేకపోయింది. 


గీతూ వెళ్లడంతో ఆటలో గొడవలు ఉండవు, గొడవలు పెట్టేవాళ్లు ఉండరు అనుకుంటున్నారు అంతా. కానీ గొడవలు లేకుండా ఆటతోనే ముందుకు సాగించాలని కొత్త ఆటలు పరిచయం చేస్తున్నాడు బిగ్ బాస్. 



ఇక ఈ వారం నామినేషన్ల విషయానికి వస్తే తొమ్మిది మంది నామినేషన్లలో నిలిచారు. వారిలో ఈ వారం ఎవరు వెళ్లినా గట్టి కంటెస్టెంట్ బయటకు వెళ్లినట్టే. వారంతా కూడా గట్టిగా అరుస్తూ, గొడవలు పడుతూ నోటితో ఆడే వాళ్లే. ఎవరైతే ఇంట్లో కామ్ అండ్ కంపోజ్డ్ గా ఉంటారో వారెవరూ నామినేట్ అవ్వలేదు. వాసంతి, మెరీనా కూడా కామ్ అండ్ కంపోజ్డ్ గానే ఉంటారు. కానీ ఈసారి నామినేట్ అయ్యారు. వీళ్లిద్దరూ కాకుండా  బాలాదిత్య, ఫైమా, కీర్తి, ఇనాయ, శ్రీహాన్, ఆదిరెడ్డి, రేవంత్ ఉన్నారు నామినేషన్లలో. ఈసారి ఫైమాకు గండం తప్పేలా లేదు. ఎందుకంటే ఈసారి ప్రేక్షకుల ఓటింగ్ సరళి మారింది. ఎవరైతే ఇంట్లో నోరు పారేసుకోకుండా, ఎదుటివారిని తేలికగా చేసి మాట్లాడకుండా ఉంటారో వాళ్లకే ఓట్లేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే కీర్తి, వాసంతి, మెరీనా ఆటలో అంత స్ట్రాంగ్ కాకపోయినా, వారు ఉండే పద్ధతికి ఓట్లు పడే అవకాశం ఉంది. బాలాదిత్యకు కూడా ఓట్లు పడే అవకాశం ఉంది. ఇక రేవంత్, ఇనాయ ఓటు బ్యాంకు గట్టిది. కాబట్టి వాళ్లు కూడా ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్లరు. శ్రీహాన్, ఆదిరెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉంది వారిని తీసేంత ధైర్యం చేయరు బిగ్ బాస్. ఇక మిగిలింది ఫైమా. కాబట్టే ఈసారి ఫైమాకే తక్కువ ఓట్లు వచ్చే అవకాశం ఉంది.


Also read: నామినేషన్లలో మళ్లీ ఇనయానే టార్గెట్ చేసిన హౌస్, నామినేట్ అయింది వీళ్లే