‘బిగ్ బాస్’ హౌస్‌లో సీరియల్ బ్యాచ్‌గా పేరొందిన శోభా శెట్టి, ప్రియాంక, అమర్‌దీప్‌లకు ఊహించని షాక్ ఎదురైంది. వారికి సన్నిహితుడైన ఆట సందీప్.. ఆదివారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ‘బిగ్ బాస్’ సీజన్-7లో హౌస్ నుంచి ఎలిమినేటైన తొలి మేల్ కంటెస్టెంట్‌గా సందీప్ బయటకు వచ్చేశాడు. దీంతో మిగిలిన ముగ్గురి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వాస్తవానికి అర్జున్ అంబాటి కూడా సీరియల్ నటుడే. అయితే, బయటే ఆట చూసి హౌస్‌లోకి ఎంటర్ కావడం వల్ల.. ఆ ముగ్గురితో కలిసీ కలవనట్లు ఉంటున్నాడు. అవసరమైనప్పుడు వారికి సాయం చేస్తున్నాడు. మరోవైపు SPY (శివాజీ, ప్రశాంత్, యావర్) బ్యాచ్‌తో కూడా కలుస్తూ బ్యాలెన్సుడ్‌గా ఉంటున్నాడు. గౌతమ్, టేస్టీ తేజాలు కూడా ఇదే తరహాలో ఉంటున్నారు. రతిక వల్ల అశ్వినీ మెల్లగా శోభాశెట్టితో జతకట్టింది. ఇక వీరి దోస్తీల విషయాన్ని పక్కన పెడితే.. ఈ సోమవారం జరగబోయే నామినేషన్స్ మంచి రంజుగా మారనున్నాయి. ఈ సారి శోభాశెట్టికి గట్టిగానే నామినేషన్స్ పడే అవకాశాలున్నాయి. మరోసారి ప్రియాంక, అమర్‌దీప్‌లు నామినేషన్స్‌లోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 


8 వారాలు సేఫ్, నామినేషన్స్‌లోకి రాగానే ఎలిమినేట్


8 వారాల వరకు ఆట సందీప్ హౌస్‌లో సేఫ్‌గా గడిపేశాడు. దీనికి కారణం.. పవర్ అస్త్ర. హౌస్‌లో ఎంటర్ కాగానే పవర్ అస్త్రను సంపాదించుకుని ఐదు వారాల ఇమ్యునిటీ కొట్టేశాడు సందీప్. ఆ తర్వాత నామినేషన్స్‌లోకి కూడా రాలేదు. దీంతో సేఫ్‌గా హౌస్‌లో గడిపేశాడు. అయితే, ఈ వారం మాత్రం టేస్టీ తేజ, యావర్‌, అర్జున్‌లు నామినేట్ చేయడంతో నామినేషన్స్‌లోకి వచ్చాడు. సందీప్ గురించి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ప్రేక్షకులు రివేంజ్ తీర్చుకున్నారు. దీంతో అతి తక్కువ ఓట్లతో సందీప్‌ బయటకు వచ్చేశాడు. అయితే, ఈ వారం శోభాశెట్టి బయటకు వచ్చేస్తుందని భావించారు. ఎలిమినేషన్స్‌లో కూడా చివర్లో శోభా, సందీప్ ఉన్నారు. దీంతో శోభా వెళ్లిపోతుందని అనుకున్నారు. అనధికార ఓటింగ్స్‌లో కూడా శోభాశెట్టికే అతి తక్కువ ఓట్లు వచ్చాయి. అంటే, ఆమె ఎలిమినేషన్ నుంచి జస్ట్ మిస్ అని చెప్పుకోవచ్చు. ఈసారి నామినేషన్స్‌లోకి వచ్చిందంటే మాత్రం.. తప్పకుండా ఎలిమినేట్ అవ్వడం ఖాయమని తెలుస్తోంది. ఒక వేళ రతిక నామినేషన్స్‌లోకి వస్తే.. శోభాకు మరో వారం ఉండేందుకు అవకాశం రావచ్చు.


యావర్‌పై రతిక ఫైర్ 


ఫన్‌డేలో భాగంగా హోస్ట్ నాగార్జున.. ఒక పడవలో ఇద్దరు కంటెస్టెంట్ల ఫొటోలు పెట్టి.. వారిలో ఎవరిని బోటు నుంచి కిందికి తోసేస్తావని ప్రశ్నించారు. ఈ సందర్భంగా యావర్ వంతు వచ్చింది. పడవలో శివాజీ, రతిక ఫొటోలు ఉండగా.. రతికాను ముంచేయడానికి సెలక్ట్ చేసుకున్నాడు. దీంతో నాగార్జున ‘‘రతికాను వాటర్‌లో పడేస్తావా?’’ అని అడిగితే.. ‘‘ఆమె కోసం నేను దిగిపోతా’’ అని యావర్ అన్నాడు. ‘‘శివాజీ నాకు పిల్లర్‌లా ఉన్నాడు. అందుకే రతికాను ముంచేస్తున్నా’’ అని తెలిపాడు. దీంతో ‘‘పిల్లర్‌ను ముంచి పిల్లను ఉంచేస్తావా’’ అని నాగ్ కామెంట్ చేశారు. ఆ తర్వాత నాగ్ చిన్న బ్రేక్ ఇవ్వడంతో.. రతిక, యావర్ మధ్య వాగ్వాదం నెలకొంది. తనను పడవ నుంచి దించేయడాన్ని సీరియస్‌గా తీసుకుంది. తనతో మాట్లాడవద్దంటూ యావర్‌ను పట్టించుకోకుండా వెళ్లిపోయింది. ఆ తర్వాత నాగార్జున స్టేజ్ మీదకు వచ్చి హౌస్‌లో ఏదో గొడవ జరిగినట్లుంది అని అన్నారు. దీంతో  రతిక.. ‘‘ఎలా బ్యాలెన్స్‌గా ఉండాలనేది తెలుసుకున్నా’’ అని అంది. దీంతో నాగ్ వెంటనే అదిరిపోయే పంచ్ వేశారు. ‘‘నీ వల్ల ఎవరైనా బ్యాలెన్స్ తప్పుతారేమో గానీ.. నువ్వు తప్పవు’’ అని అన్నారు.  


Also Read: వాళ్ల వల్లే నేను మునిగిపోయేలా ఉన్నానన్న అమర్ దీప్ - నేను ఉన్నా, లేకున్నా వాడ్ని ఫైనల్స్​లో చూడాలన్న శివాజీ!