బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమయ్యి ఇప్పటికీ నాలుగు వారాలు అవుతోంది. ఇప్పటికీ మూడు ఎలిమినేషన్స్ పూర్తయ్యాయి. కానీ ఈ మూడు ఎలిమినేషన్స్‌లో బయటికి వెళ్లిపోయింది లేడీ కంటెస్టెంట్సే. ఇక నాలుగో వారం కూడా మరో లేడీ కంటెస్టెంటే ఎలిమినేట్ అవ్వనుందని టాక్ వినిపిస్తోంది. దీంతో బిగ్ బాస్ హౌజ్‌లో అమ్మాయిల సంఖ్యకు, అబ్బాయిల సంఖ్యకు చాలా తేడా రానుంది. బిగ్ బాస్ సీజన్ 7లో  మొత్తంగా 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. అందులో ఏడుగురు మగవారు, ఏడుగురు ఆడవాళ్లు. తాజాగా జరిగే ఎలిమినేషన్‌తో మరో లేడీ కంటెస్టెంట్ వెళ్లిపోగా.. ఇంకా ముగ్గురు లేడీ కంటెస్టెంట్స్ మాత్రమే మిగులుతారు అని టాక్ వినిపిస్తోంది.


టాస్కుల విషయంలో టోటల్ ఫెయిల్..
ఈసారి బిగ్ బాస్ నుండి రతిక ఎలిమినేట్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. రతిక హౌజ‌లోకి ఎంటర్ అయినప్పటి నుండి చాలావరకు ప్రేక్షకులు అందంగా ఉంది అనిపించేలా తప్పా బాగా ఆడుతుంది అనిపించేలా ఒక్క పని కూడా చేయలేదు. ఫిజికల్ టాస్కుల విషయంలో రతిక.. ఎప్పుడూ చురుగ్గా ఉండేది కాదు. ఓసారి పవర్ అస్త్రా టాస్కులో టీమ్‌ల పరంగా పోటీపడుతున్న సమయంలో రతిక వల్లే తన టీమ్.. పవర్ అస్త్రా టాస్క్‌ను ఓడిపోయింది. ఇలా తను ఆడిన చాలావరకు ఫిజికల్ గేమ్స్‌లో రతిక వీక్‌గానే అనిపించింది. అంతే కాకుండా చురుగ్గా ఆలోచించాల్సిన గేమ్స్‌లో కూడా తను అంతగా యాక్టివ్‌గా ఉండేది కాదు. 


పల్లవి ప్రశాంత్‌నే టార్గెట్..
బిగ్ బాస్‌లో టాస్కుల విషయాన్ని పక్కన పెడితే.. పల్లవి ప్రశాంత్‌తో స్నేహం.. రతికను ప్రేక్షకుల్లో చాలా నెగిటివ్‌గా చేసింది. మొదట్లో పల్లవి ప్రశాంత్‌ను ఎవరూ పట్టించుకోకపోయినా.. రతికనే వెళ్లి స్నేహం చేసింది. ఆ స్నేహాన్ని ప్రశాంత్.. ప్రేమ అనుకున్నాడు. తనతో ప్రేమగా ఉండడం మొదలుపెట్టాడు. ప్రేమగా మాట్లాడడం మొదలుపెట్టాడు. నా ప్రాపర్టీ అంటూ వ్యాఖ్యలు కూడా చేశాడు. రతిక కూడా అవన్నీ చూస్తూ సైలెంట్‌గానే ఉంది. కానీ ఒక్కసారి ఓ నామినేషన్స్ సమయంలో ప్రశాంత్ ప్రవర్తనను తప్పుబట్టడం మొదలుపెట్టింది. ఆ నామినేషన్స్ వల్ల ప్రేక్షకుల్లో ప్రశాంత్‌పైకంటే రతికపైనే నెగిటివిటీ ఎక్కువగా పెరిగిపోయింది.


ఎలిమినేషన్‌కు అవే కారణాలు..
పవర్ అస్త్రా కోసం కంటెస్టెంట్స్ అంతా టీమ్‌గా వీడిపోయి ఆడినప్పుడు రతిక ప్రవర్తన.. ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించేలా చేసింది. పవర్ అస్త్రా ఎవరికి దక్కాలో తానే నిర్ణయిస్తాను అంటూ కంటెస్టెంట్స్ అందరినీ విసిగించింది. తన మాట వినాలని లేకపోతే ఆటను ముందుకు సాగనివ్వను అని మొండిగా ప్రవర్తించింది. ఇలా పలు సందర్భాల వల్ల రతికపై ప్రేక్షకుల్లో ఇష్టం పోయింది. చిన్న చిన్న విషయాల్లో కంటెస్టెంట్స్‌తో వాగ్వాదాలు పెట్టుకోవడం. పల్లవి ప్రశాంత్‌ను ఊరికే టార్గెట్ చేసినట్టుగా మట్లాడడం ఇవన్నీ.. తన నామినేషన్‌కు ముఖ్య కారణాలుగా నిలిచాయని ప్రేక్షకులు అంటున్నారు. అంతే కాకుండా పల్లవి ప్రశాంత్‌కు ఉన్న ఫాలోయింగ్‌తో పోలిస్తే రతిక ఫాలోయింగ్ చాలా తక్కువ. ఈ కారణంగా కూడా తను ఎలిమినేట్ అయ్యి ఉండవచ్చని బిగ్ బాస్ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అంతే కాకుండా ఎంటర్‌టైన్మెంట్ విషయంలో కూడా రతిక.. ప్రేక్షకులను ఒక్కసారి కూడా నవ్వించలేకపోయింది.


Also Read: శివాజీ అనర్హుడు అని ప్రకటించిన కంటెస్టెంట్స్ - దీంతో నాగార్జున అలాంటి నిర్ణయం!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial