ఇండియాలో అత్యధిక ప్రేక్షకాధరణ పొందిన షో ‘బిగ్ బాస్’. ప్రాంతీయ భాషల్లో కూడా ఈ షో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగులో ఈ షోకూ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో.. సెప్టెంబరు 3 నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో కూడా ఈ షోకు మంచి క్రేజ్ ఉంది. కమల్ హాసన్ హోస్ట్‌గా ఈ షో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది. అయితే, తెలుగు తరహాలోనే తమిళంలో కూడా గత సీజన్స్ ఊహించని షాకిచ్చినట్లు తెలుస్తోంది. టీఆర్పీ ఒక్కసారిగా డౌన్ కావడంతో ఈ సారి ప్లాన్ మార్చాలని నిర్ణయించుకున్నారు. తెలుగులో ‘బిగ్ బాస్’ సీజన్ 7ను ఉల్టాఫల్టా అంటూ కొత్తగా ఉండేలా ప్లాన్ చేశారు. అలాగే తమిళంలో కూడా సరికొత్తగా ఆలోచనతో ముందుకు వస్తున్నారు. ఒకే షోలో రెండు ‘బిగ్ బాస్’ హౌస్‌లతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.


తాజాగా విడుదలైన ప్రోమోలో స్వయంగా హోస్ట్ కమల్ హాసన్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రోమోను కూడా కొత్తగా ప్లాన్ చేశారు. ఇందులో కమల్ హాసన్ డ్యుయల్ రోల్‌లో కనిపించారు. ‘బిగ్ బాస్’ సీజన్ 7 (తమిళ్) గురించి కమల్ చెబుతుంటే.. మరో పాత్ర ‘‘ఎప్పుడూ అదే ఇల్లు, అంతే మంది కంటెస్టెంట్లు, అదే కన్ఫెషన్ రూమ్, అవే ట్విస్టులు. అందులో ఏముంది కొత్తదనం?’’ అంటూ వెటకారంగా ప్రశ్నిస్తారు. దీనికి సమాధానంగా హోస్ట్ కమల్ స్పందిస్తూ.. ‘‘ఈ సారి ఒక్క హౌస్ కాదు. ఒకే షో, రెండు హౌస్‌లు’’ అని సమాధానం ఇస్తారు. దీంతో తమిళ బిగ్ బాస్‌పై అంచనాలు పెరిగిపోయాయి. రెండు హౌస్‌లో కంటెస్టులను విడివిడిగా ఉంచుతూ.. వారం వారం ఒక్కో హౌస్ నుంచి ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేస్తారని తెలుస్తోంది. అయితే, కంటెస్టెంట్ల సంఖ్యను పెంచే అవకాశాలు లేవని సమాచారం.


Also Read: 'బిగ్ బాస్ సీజన్ 7' కంటెస్టెంట్స్ వీళ్లేనా? లిస్ట్‌లో ఎవరెవరు ఉన్నారంటే?


తెలుగులో కూడా ఇదే కాన్సెప్ట్?


తెలుగు ‘బిగ్ బాస్’ సీజన్-7లో కూడా తమిళ ‘బిగ్ బాస్’ కాన్సెప్ట్‌నే అమలు చేయనున్నారని తెలుస్తోంది. తెలుగులో ఈ విషయాన్ని ఇంకా రివీల్ చేయకున్నా.. తమిళ ప్రోమోతో ఇది స్పష్టమవుతుంది. దక్షిణాది ‘బిగ్ బాస్’ షోస్ అన్నీ దాదాపు ఒకేసారి, ఒకే కాన్సెప్ట్‌తో నడుస్తుంటాయి. ఈసారి కూడా అదే జరిగితే తెలుగులో కూడా ఒకే షోలో రెండు హౌస్‌లు చూసే అవకాశం ఉంటుంది. 




తెలుగు ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్లు ఎవరు?


తాజా సమాచారం ప్రకారం సీరియల్ నటులు అమర్దీప్ (జానకి కలగనలేదు), నటి శోభా శెట్టి (కార్తీక దీపం). 'మొగలిరేకులు' సీరియల్ ఫేమ్ సాగర్, 'జానకి కలగనలేదు' సీరియల్ ఆర్టిస్ట్ ప్రియాంక జైన్, మరో సీరియల్ నటి పూజా మూర్తి, అంజలి పవన్, డాన్స్ మాస్టర్ ఆట సందీప్, యూట్యూబర్ అనిల్ జీల, సీతల్ గౌతమన్, పల్లవి ప్రశాంత్, రంగస్థలం మహేష్, జబర్దస్త్ నుంచి బుల్లెట్ భాస్కర్, రియాజ్, తేజ.. టీవీ9 యాంకర్ ప్రత్యూష, ఆకాశవీధిలో హీరో గౌతమ్ కృష్ణ, యాక్టర్ క్రాంతి, సింగర్ దామిని, అన్షు, మోడల్ యవార్.. ఈ 20 మంది కంటెస్టెంట్స్ సీజన్ సెవెన్ లో ఫైనలిస్టులుగా కన్ఫర్మ్ అయినట్లు సమాచారం.