బిగ్ బాస్ సీజన్ 7లో మొదటి ఎలిమినేషన్ పూర్తయ్యింది. సీనియర్ నటి కిరణ్ రాథోడ్.. బిగ్ బాస్ హౌజ్ నుండి బయటికి వచ్చేసింది. బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమయ్యి వారం రోజులే అయ్యింది. అయినా కూడా కొందరు కంటెస్టెంట్స్. ఒకరితో ఒకరు చాలా క్లోజ్ అయిపోయారు. అలా అయిపోయినవారిలో షకీలా, కిరణ్ రాథోడ్ కూడా ఒకరు. నేటి (సెప్టెంబర్ 10న) ఎపిసోడ్‌లో ఆడించిన ఆటలో కూడా ఒకరికి ఒకరు లైక్ ఇచ్చుకున్నారు వీరిద్దరు. అంతలోనే కిరణ్ రాథోడ్.. ఎలిమినేట్ అని చెప్పడంతో షకీలా కన్నీరుమున్నీరయ్యారు. ఇక హౌజ్ నుండి ఎలిమినేట్ అయ్యి స్టేజ్‌పైకి వచ్చిన కిరణ్ రాథోడ్.. కంటెస్టెంట్స్‌లో నలుగురికి ఉల్టా, నలుగురికి సీదా ట్యాగ్ ఇచ్చింది.


బిగ్ బాస్ అనేది తెలుగు షో కాబట్టి అందులో అసలు తెలుగు రాని ఒక కంటెస్టెంట్ వచ్చి ఇబ్బందులు పడడం సహజమే. కానీ తెలుగు నేర్చుకోవాలని కూడా కిరణ్ రాథోడ్ ఎప్పుడూ పూర్తిగా ప్రయత్నించలేదు. అంతే కాకుండా ప్రేక్షకులను ఇంప్రెస్ చేసేలా తను పెద్దగా ఏ యాక్టివిటీలో పాల్గొనలేదు. దీంతో ప్రేక్షకులు తనను ఎక్కువకాలం హౌజ్‌లో ఉంచడం అనవసరం అనుకొని మొదటి వారమే బయటికి పంపించేశారు. ఇక హౌజ్ నుండి బయటికి వచ్చిన తర్వాత స్టేజ్‌పై ఉన్నప్పుడు టేస్టీ తేజ, పల్లవి ప్రశాంత్, రతిక, శోభా శెట్టిలకు ఉల్టా అనే ట్యాగ్ ఇచ్చింది కిరణ్. దానికి తగిన కారణాలను కూడా చెప్పింది.


అందుకే వారు ఉల్టా..
పల్లవి ప్రశాంత్ చాలా ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడని, ఇప్పటికే తను విన్నర్ అనేసుకుంటున్నాడని కిరణ్ రాథోడ్ ముక్కుసూటిగా తన అభిప్రాయాన్ని చెప్పింది. రతికతో హౌజ్‌లో ఉన్నప్పుడు తన వైబ్ ఎప్పుడూ మ్యాచ్ అవ్వలేదని చెప్పింది. అంతే కాకుండా మనం అక్కడే కూర్చొని ఉన్నా.. తను పక్కన నుండి నడుచుకుంటూ వెళ్లిపోతుంది కానీ కనీసం చూసి నవ్వదు అంటూ తన ప్రవర్తనను విమర్శించింది. దీనికి సమాధానంగా రతిక.. తను నన్ను తప్పుగా అర్థం చేసుకుందని, ఇప్పటినుండి ప్రవర్తనను మార్చుకుంటానని చెప్పింది. టేస్టీ తేజ నవ్విస్తూనే మంచి గేమ్ ప్లాన్‌తో ఉన్నాడని, తనను ఎవరూ నమ్మకండి అంటూ కంటెస్టెంట్స్‌ను హెచ్చరించింది. ఇక శోభా శెట్టి చాలా స్వార్థపరురాలి అని చెప్పింది కిరణ్ రాథోడ్. అంతే కాకుండా తనకు నచ్చిన యావర్, షకీలా, శివాజీ, శుభశ్రీకి సీదా అనే ట్యాగ్ ఇస్తూ వారి గేమ్ కోసం ఆల్ ది బెస్ట్ తెలిపింది.


దామిని చేతిలో తోలుబొమ్మ..
బిగ్ బాస్ హౌజ్ నుండి ఎలిమినేట్ అయిపోయిన ప్రతీ ఒక్కరు బిగ్ బాస్ బజ్‌లో ఇంటర్వ్యూలో ఇచ్చిన తర్వాతే బయటికి వెళ్తారు. అయితే బిగ్ బాస్ సీజన్ 7 కోసం బిగ్ బాస్ బజ్‌లో ఇంటర్వ్యూలో జరిపించడానికి గీతూ రాయల్ రంగంలోకి దిగింది. కిరణ్ రాథోడ్‌తో తను చేసిన ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. ‘ఇంత త్వరగా బయటికి వచ్చేయడం ఎలా ఉంది’ అంటూ గీతూ ప్రశ్నించింది. ‘నేను హౌజ్‌లో ఉండాలా వద్దా అని ప్రేక్షకులు చాలా త్వరగా డిసైడ్ చేశారు’ అని తెలిపింది కిరణ్ రాథోడ్. సోషల్ మీడియాలో ఉన్నట్టుగా హౌజ్‌లో ఎందుకు హాట్‌గా లేరు అని అడిగితే.. ‘ఇది ఒక ఫ్యామిలీ షో అని దామిని చెప్పింది’ అని సమాధానం ఇచ్చింది. ‘అంటే దామిని ఆడిచ్చిన తోలుబొమ్మ కిరణ్ రాథోడ్’ అని గీతూ అనగా.. కిరణ్ ఆ మాటను ఖండించలేదు. అంతే కాకుండా గీతూ వీక్ అన్న మాటను కూడా కిరణ్ ఒప్పుకుంది. ప్రేక్షకులు తన దగ్గర నుండి ఏం కోరుకున్నారో అది తాను చేయలేకపోతున్నానని ఇప్పుడు అర్థమవుతుందని చెప్పింది. ‘ఒకవేళ మళ్లీ అవకాశం వస్తే మీలో మీరు ఏం మార్చుకుంటారు’ అని అడిగితే ‘నేను తెలుగులో మాట్లాడేదాన్ని, వారు అన్న మాటలకు తెలుగులోనే తిరిగి సమాధానం ఇచ్చేదాన్ని’ అని తెలిపింది. 


తన వల్లే ఎలిమినేట్ అయ్యాను..
బిగ్ బాస్ సీజన్ 7లోని కంటెస్టెంట్స్ పేరును ఒక్కొక్కటిగా గీతూ చెప్తుండగా.. కిరణ్ రాథోడ్ వారికి ట్యాగ్స్ ఇచ్చింది. శుభశ్రీని డంబ్ అని, శోభా శెట్టిని నాగిన్ అని చెప్పింది కిరణ్. దామిని తనకు తాను ఉమెన్ కార్డును అడ్డం పెట్టుకుంటుందని కిరణ్ కామెంట్ చేసింది. ప్రశాంత్ ఇప్పటికే చాలా ప్రిపేర్ అయ్యి వచ్చాడని, ఏదో ఒకరోజు అదే తనను దెబ్బతీస్తుందని, ప్రేక్షకులు కనిపెట్టేస్తారని చెప్పింది. గౌతమ్ తరువాతి వారంలో కచ్చితంగా ఎలిమినేట్ అయిపోతాడని కాన్ఫిడెన్స్‌తో చెప్పింది. ఇక టేస్టీ తేజ వల్లనే తాను ఎలిమినేట్ అయిపోయానంటూ తన ఫోటోపై గుడ్డు కొట్టింది. తేజతో పాటు శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్ ఫోటోలపై కూడా గుడ్లు కొట్టింది కిరణ్ రాథోడ్.


Also Read: టేస్టీ తేజాను ఎలుకల మందు పెట్టి చంపేస్తా, నాగార్జున ముందే షకీలా వార్నింగ్


Join Us on Telegram: https://t.me/abpdesamofficial