Kannada Bigg Boss 12th Season Latest Update: ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ నడుస్తోంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో రియాలిటీ షో కొనసాగుతోంది. తాజాగా కన్నడ బిగ్ బాస్ షో 12వ సీజన్‌కు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఈ షోకు కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. పర్యావరణ నిబంధనలు ఉల్లంఘించారంటూ కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు షో నిర్వాహకులకు నోటీసులిచ్చి హౌస్‌కు సీల్ వేశారు. అయితే, టీం రిక్వెస్ట్ మేరకు ప్రభుత్వం సీల్‌ను ఎత్తేసింది.
టైం ఇచ్చిన డిప్యూటీ సీఎం
హౌస్‌కు సీల్ ఎత్తేయాలని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అధికారులను ఆదేశించారు. తప్పులను సరిదిద్దుకోవడానికి బిగ్ బాస్ నిర్వాహకులకు టైం ఇచ్చారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు. 'కన్నడ బిగ్ బాస్ షూటింగ్ జరుగుతున్న బిడాడిలోని జోలీవుడ్ ప్రాంగణంలో సీల్ ఎత్తేయాలని బెంగుళూరు సౌత్ డిస్ట్రిక్ట్ డిప్యూటీ కమిషనర్‌ను ఆదేశించాను.
పర్యావరణ పరిరక్షణ ఫస్ట్ ప్రాధాన్యం అయినప్పటికీ... స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నిబంధనలకు అనుగుణంగా ఉల్లంఘనలను పరిష్కరించేందుకు స్టూడియోకు టైం ఇవ్వనున్నాం. పర్యావరణ పరిరక్షణ పట్ల మా బాధ్యతను నిలబెట్టుకుంటూనే కన్నడ ఇండస్ట్రీ, వినోద పరిశ్రమకు సపోర్ట్ ఇచ్చేందుకు మేం కట్టుబడి ఉన్నాం.' అంటూ రాసుకొచ్చారు.
ప్రభుత్వానికి సుదీప్ థాంక్స్
హౌస్‌కు సీల్ ఎత్తేయడంతో కర్ణాటక ప్రభుత్వం, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు సుదీప్ థాంక్స్ చెప్పారు. 'సకాలంలో సపోర్ట్ ఇచ్చినందుకు డీకే శివకుమార్‌కు థాంక్స్ సార్. ఇటీవల జరిగిన గందరగోళంలో భాగం కాదని అంగీకరించినందుకు ప్రభుత్వం, సంబంధిత అధికారులకు ధన్యవాదాలు. నా రిక్వెస్ట్‌కు వెంటనే స్పందించిన డిప్యూటీ సీఎం గారిని నేను నిజంగా అభినందిస్తున్నా. ఆయన అంకితభావానికి ధన్యవాదాలు.' అని చెప్పారు.
Also Read: ఓటీటీలోకి వచ్చేసిన 'వార్ 2' - 3 భాషల్లో స్ట్రీమింగ్... ఎందులోనో తెలుసా?
అసలేం జరిగిందంటే?
బెంగుళూరు శివార్లలోని బిడడి హోబ్లిలోని జోలీవుడ్ స్టూడియోస్, అడ్వెంచర్స్‌లో బిగ్ బాస్ హౌస్ సెట్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం సీజన్ 12 రన్ అవుతోంది. 19 మంది కంటెస్టెంట్స్ హౌస్‌లో అడుగుపెట్టగా ఇప్పటికే ఇద్దరు ఎలిమినేట్ అయ్యారు. వందలాది మంది ఈ రియాలిటీ కోసం తెర వెనుక వర్క్ చేస్తున్నారు. అయితే, జోలీవుడ్ స్టూడియోస్‌లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను సరిగ్గా శుద్ది చేయడం లేదనే ఆరోపణలతో కర్ణాటక పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులకు హౌస్‌కు సీల్ వేశారు.
అయితే, సెట్ దగ్గర్లో 250 KLD సామర్థ్యం గల మురుగు నీటి శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేసినట్లు షో నిర్వాహకులు వివరణ ఇచ్చినప్పటికీ... అక్కడ సరైన డ్రైనేజీ కనెక్షన్స్ లేవని అధికారులు తెలిపారు. స్టూడియో నిర్వహణకు కాలుష్య నియంత్రణ బోర్డు నుంచి సరైన అనుమతులు కూడా పొందలేదని అన్నారు. పవర్ కూడా కట్ చేశారు. దీంతో షోకు బ్రేక్ పడింది. ఇక దీనిపై టీం ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయగా తప్పులు సరిదిద్దేందుకు టైం ఇస్తూ సీల్ ఎత్తేశారు.