'బిగ్ బాస్' తెలుగు సీజన్ 8 కీలక దశకు చేరుకుంది. రేటింగ్స్ విషయం ఎలా ఉన్నా... గత సీజన్ తో పోలిస్తే ఈసారి షో చూపిస్తున్న ఇంపాక్ట్ తక్కువే అని చెప్పాలి. గత సీజన్లో సరిగ్గా ఇదే సమయానికి SPY వర్సెస్ SPA వర్గాలు ఏర్పడిపోవడం, ఉన్న హౌస్ మేట్స్ అందరూ ప్రాణం పెట్టి ఆడడంతో ఆడియన్స్ అందరూ ఏదో ఒక గ్రూపును ఓన్ చేసుకున్నారు. కానీ ఈసారి సీజన్ 8కు ఆ స్థాయిలో ఫ్యాన్స్ ఏర్పడలేదు. ఆట ఇప్పుడిప్పుడే రసవత్తరంగా మారుతోంది. పృథ్వీ, నిఖిల్, గౌతమ్, నబీల్ లాంటి వాళ్ళు ఫిజికల్ గేమ్స్ లో దూసుకుపోతుంటే ఎంటర్టైన్మెంట్, మైండ్ గేమ్ లతో తేజ, అవినాష్ తమ ఇంపాక్ట్ చూపిస్తున్నారు. ఇక అమ్మాయిల్లో ప్రేరణ, యస్మి, రోహిణితో పాటు కొంతవరకూ హరితేజ కూడా అదరగొడుతున్నారు. నయని బాగానే ఆడుతున్నా... ఎక్కువగా ఏడుస్తుండడం ఆమెకు మైనస్ గా మారుతోంది. ఇక విష్ణు ప్రియ ఆట కంటే ఎక్కువగా పృథ్వీతో ట్రాక్ పైనే ఆధారపడినట్టు అనిపిస్తోంది. వీళ్ళందరూ ఏదో ఒక స్ట్రాటజీతో ఆటలో ముందుకు పోతుంటే ఒక్క హౌస్ మేట్ మాత్రం ఆటకు అడ్డంకిగా మారుతోందన్న అభిప్రాయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమే గంగవ్వ.
సీజన్ 4 లో సందడి చేసిన గంగవ్వ
అతి సామాన్య స్థితి నుంచి "మై విలేజ్ షో" యూట్యూబ్ ఛానెల్ ద్వారా వెలుగులోకి వచ్చిన గంగవ్వ సీజన్ 4లో తెలుగు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు బిగ్ బాస్ మోస్ట్ సక్సెస్ ఫుల్ సీజన్లలో ఒకటైన బిగ్ బాస్ 4లో బ్యాటరీ టాస్క్ లో అభిజిత్ టీం తరపున దివిని కిడ్నాప్ చేసే టాస్క్ లో గంగవ్వ కీలక పాత్ర పోషించింది. అయితే బిగ్ బాస్ వాతావరణం, అక్కడి ఏసీ చల్లదానాన్ని తట్టుకోలేక తొందరగానే బిగ్ బాస్ నుండి తనకు తానుగా బయటకు వచ్చేసింది. నాలుగేళ్ల తర్వాత వైల్డ్ కార్డుగా మళ్లీ సీజన్ 8లో ఎంట్రీ ఇచ్చింది గంగవ్వ. ఎంటర్ అయిన వెంటనే ఫిజికల్ టాస్క్ లో సైతం ఆమె ఓజీ టీంను ఓడించింది. అయితే ఆ తర్వాత పరిస్థితి మారింది.
ఇప్పటికీ స్ట్రాంగ్ గానే గంగవ్వ... కానీ?
బిగ్ బాస్ సీజన్ 8 రాను రాను మరింత కఠినంగా, ఫిజికల్ గా మారుతోంది. ఆడ మగ కలిపి మరి ఫిజికల్ టాస్కుల్లో పోటీ పడుతున్నారు. దాంట్లో చిన్న చిన్న దెబ్బలు కూడా తింటున్నారు. వీటిల్లో గంగవ్వ పాల్గొనకుండా బిగ్ బాస్ టీం జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆమె ఆరోగ్య పరంగా ఇది బాగానే ఉన్నా మరి ఇంత క్రిటికల్ గా మారుతున్న బిగ్ బాస్ టాస్కుల్లో ఆమె పరిమితం అయిపోతోంది. పోనీ సంచాలక్ గా పెడదామన్నా మొన్నటి వాటర్ ట్యాంక్ టాస్క్ లో ఆమె జడ్జిమెంట్ పై హౌస్ మేట్లలోనూ, ఆడియన్స్ లోనూ తీవ్ర అసంతృప్తి కనిపించింది. నామినేషన్స్ లోనూ హౌస్ మేట్లు ఎవరూ ఆమె జోలికి రావడం లేదు. కారణం ఆమెను నామినేట్ చేస్తే ఆమెకు బయట ఉన్న ఫాలోయింగ్, సింపతి తమకు వ్యతిరేకంగా మారుతాయేమో అన్న భయమే. దీనితో తెలియకుండానే గంగవ్వ బిగ్ బాస్ గేమ్ కి అడ్డంకి అయిపోతుందన్న అభిప్రాయం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. గంగవ్వ పరంగా గట్టిగానే బిగ్ బాస్ లో నిలబడుతున్నా రానున్న టాస్కులు, హౌస్ మేట్ల ఓటింగ్ భయాన్ని దృష్టిలో పెట్టుకుని గంగవ్వను మర్యాదపూర్వకంగానే బయటికి రప్పిస్తే బాగుంటుందని బిగ్ బాస్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి బిగ్ బాస్ టీమ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.