బిగ్ బాస్ సీజన్ 7లో 2.0 వెర్షన్ ప్రారంభమయ్యింది. మామూలుగా సండే అంటే ఎప్పుడూ ఫన్‌డే అని అంటుంటారు నాగార్జున. కానీ ఈసారి ఆదివారం ఎపిసోడ్ మాత్రం ఎలిమినేషన్స్‌తో మొదలయ్యింది. అది కూడా ఒకటి కాదు.. రెండు ఎలిమినేషన్స్ జరిగాయి. బ్యాక్ టు బ్యాక్ జరిగిన ఈ ఎలిమినేషన్స్ చూసి ప్రేక్షకులతో పాటు కంటెస్టెంట్స్ సైతం ఆశ్చర్యపోయారు. ఈ వారం నామినేషన్స్‌లో పవర్ అస్త్రా సాధించిన శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్, సందీప్ కాకుండా మిగిలిన ఏడుగురు ఉన్నారు. ఆ ఏడుగురిలో ఇద్దరు ఎలిమినేట్ అవ్వడం అందరికీ షాకింగ్‌గా అనిపించింది.


శుభశ్రీ ఎలిమినేట్..
ముందుగా శుభశ్రీ హౌజ్ నుండి ఎలిమినేట్ అవుతుందని శనివారం నుండే వార్తలు వైరల్ అయ్యాయి. అనుకున్నట్టుగానే తనే ఎలిమినేట్ అయ్యింది. ముందుగా యాక్టివిటీ ఏరియాలోకి నామినేషన్స్‌లో ఉన్నవారందరినీ రమ్మని పిలిచారు నాగార్జున. ఆ తర్వాత లైట్స్ అన్నీ ఆపేసి శుభశ్రీని బయటికి తీసుకొచ్చేశారు. అప్పటివరకు శుభశ్రీ ఎలిమినేట్ అవుతుందని కూడా ఎవరికీ తెలియదు. ఫైనల్‌గా తను ఎలిమినేట్ అయ్యి స్టేజ్‌పైకి వచ్చేసింది. తన వల్లే, తనకు చేసిన త్యాగం వల్లే శుభశ్రీ ఎలిమినేట్ అయ్యిందని గౌతమ్ చాలా ఫీల్ అయ్యాడు. శుభశ్రీని తిరిగి తీసుకొచ్చే అవకాశం ఉందా అని నాగార్జనను అడిగారు. ఆఖరికి తను కూడా ఎలిమినేట్ అవుతాడని ఊహించలేదు.


డబుల్ ఎలిమినేషన్..
శుభశ్రీ వెళ్లిపోయిన కాసేపటి తర్వాత కంటెస్టెంట్స్‌తో చిన్న ఆట ఆడించారు నాగార్జున. ఆ తర్వాత ఈరోజు డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని ప్రకటించారు. అమర్‌దీప్‌, గౌతమ్.. ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయ్యే పరిస్థితిలో ఉన్నారు. ఆ సమయంలో గౌతమ్ ఎలిమినేట్ అని బిగ్ బాస్ నాగ్ వెల్లడించారు. గౌతమ్ మాత్రం ఇది తాను ముందే ఊహించినట్టుగా బయటికి వచ్చేశాడు. చేతిలో వాళ్ల అమ్మ రాసిన ఉత్తరంలో బిగ్ బాస్ హౌజ్ నుండి వచ్చేశాడు గౌతమ్. స్టేజ్‌పైకి వచ్చిన తర్వాత కాసేపు కంటెస్టెంట్స్ గురించి మాట్లాడాడు. యావర్ మాత్రమే హౌజ్‌లో కరెక్ట్‌గా ఉన్నాడని, మిగతావారంతా ఫేక్ అని చెప్పుకొచ్చాడు. హౌజ్‌లో ఉన్నంతకాలం యావర్‌కు, గౌతమ్‌కు మధ్య మనస్పర్థలు తప్ప స్నేహం లేదు. అలాంటిది యావర్‌నే ప్రశంసిస్తుంటే కంటెస్టెంట్స్ సైతం షాక్ అయ్యారు. 


గౌతమ్ సీక్రెట్ రూమ్..
గౌతమ్ వెళ్లిపోతూ తన మనసులోని మాటలు అన్నీ బయటపెట్టాడు. మా బ్యాచ్ అంతా ఒక్కటిగా ఉంటూ స్వార్థంగా ఉన్నారని అన్నాడు. ప్రతి ఒక్కరిలో సెకండ్ సైడ్ ఉంది. అది ఈ రోజు ప్రూవ్ అయ్యింది అంటూ హౌజ్‌లో ఉన్నప్పుడు తను చెప్పలేనివి అన్నీ చెప్పేశాడు. ఆ తర్వాత తన తల్లి రాసిన లేఖ జీవితాంతం తనతోనే ఉంటుంది అని వెళ్లిపోతూ నాగార్జునతో అన్నాడు. కానీ అనూహ్యంగా నాగార్జున.. ఆ లెటర్‌ను తీసేసుకున్నారు. గౌతమ్‌ను వెళ్లిపోమన్నారు. కానీ మళ్లీ తనను వెనక్కి పిలిచి తన ఆట నచ్చిందని, అందుకే తనకు రెండో అవకాశం ఇవ్వాలనుకుంటున్నానని నాగ్ అన్నారు. అలా చెప్పి గౌతమ్‌ను సీక్రెట్ రూమ్‌కు పంపించారు. ఇలా జరుగుతుందని ఊహించని గౌతమ్.. సీక్రెట్ రూమ్‌లో అడుగుపెట్టి బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ బాగుందని కామెంట్ చేశాడు. గౌతమ్ బిగ్ బాస్ హౌస్‌లో శివాజీ, స్టార్ మా గ్రూపులకు దూరంగా ఉంటూ వస్తున్నాడు. అందుకే రెండు గ్రూపులు కలిపి గౌతమ్‌ను బయటకు పంపేశాయని ప్రేక్షకులు అనుకుంటున్నారు. 


Also Read: ఆ దేశంలో వరుణ్ తేజ్, లావణ్యల డెస్టినేషన్ వెడ్డింగ్ - పెళ్లి వేదికను లీక్ చేసిన ఉపాసన


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial