బిగ్ బాస్ సీజన్ 7లో ఎన్నో అనుకోని ఎలిమినేషన్స్ జరుగుతున్నాయని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ కంటే దారుణంగా ఆడేవారు ఉన్నా కూడా ప్రత్యేకంగా ఈ కంటెస్టెంట్సే ఎలిమినేట్ అవ్వడానికి కారణమేంటి అని బిగ్ బాస్ ఫ్యాన్స్ చర్చించుకోవడం మొదలుపెట్టారు. తాజాగా పూర్తయిన నాలుగో ఎలిమినేషన్‌లో రతిక బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటికి వెళ్లిపోయింది. ఇక తనకంటే ముందు మూడోవారంలో దామిని బయటికి వెళ్లిపోయింది. దామిని.. అప్పుడప్పుడు అందరితో వాదించినా.. కొందరిని టార్గెట్ చేసినట్టు మాట్లాడినా.. తనకంటే అసలు ఆట బాగా ఆడనివాళ్లు కూడా హౌజ్‌లో ఉన్నారని, తన ఎలిమినేషన్ సమయంలో చాలామంది అభిప్రాయపడ్డారు. తాజాగా బిగ్ బాస్ విశేషాలను పంచుకుంటూ ఒక యూట్యూబర్‌తో ఇంటర్వ్యూలో పాల్గొంది దామిని. అందులో పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టింది. 


ఒక్కొక్కరికి నాలుగైదు పీఆర్ ఏజెన్సీలు ఉన్నాయి..
అన్‌ఫిల్టర్డ్ అంటూ యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహాతో కలిసి ఇంటర్వ్యూలో పాల్గొంది దామిని. ఇందులో బయట ప్రేక్షకులకు తెలియని పలు విషయాలను తను పంచుకుంది. ముందుగా ‘‘సోమవారం నేను నామినేట్ అయితే మంగళవారం వరకు ఈ అమ్మాయి బయటికి వచ్చేస్తుంది అని ఎలా? వాళ్లు అంత కరెక్ట్‌గా ఎలా అంచనా వేస్తున్నారు’’ అని తన అనుమానాన్ని బయటపెట్టింది దామిని. అంతే కాకుండా ‘‘నేను అసలు జోక్ చేయడం లేదు. ఒక్కొక్కరికి నాలుగైదు పీఆర్ ఏజెన్సీలు ఉన్నాయి బయట. వారెవరూ నేను పేర్లు చెప్పాలి అనుకోవడం లేదు.’’ అంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది.


పీఆర్ ఏజెన్సీలు ఆడతాయి..
ఎలిమినేషన్ విషయంలో ‘సంతోషమా? బాధా?’ అని దామినిని ప్రశ్నించగా.. ‘నిరాశ అని చెప్పొచ్చు’ అంటూ సమాధానమిచ్చింది. తను ఊహించుకున్న గ్రాఫ్ ఇక్కడ నుంచి అక్కడికి అలా వెళ్లిందా అన్న ప్రశ్నకు.. ‘‘నెంబర్స్ పెరిగాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్స్ పెరిగారు’’ అని సమాధానమిచ్చింది. ‘‘అదే ఫాలోవర్స్ బయట ఉంటే నీకు రావు అనుకుంటున్నావా’’ అని సూటిగా ప్రశ్నించాడు నిఖిల్. దానికి దామిని దగ్గర సమాధానం లేదు. ఒకవేళ మరోసారి బిగ్ బాస్‌లో ఛాన్స్ ఇస్తే అని అడిగితే.. ‘‘లోపల ఆడాలి, బయట కూడా ఆడాలి. బయట ఎవరు ఆడతారు అంటే... పీఆర్ ఏజెన్సీలు ఆడతాయి’’ అని సూటిగా చెప్పేసింది.


ఏడ్చేశాను, అమ్మ కూడా ఏడ్చింది..
అయితే మిగతావారు పీఆర్ ఏజెన్సీలను పెట్టి ఆడిస్తున్నారని దామిని పదేపదే అంటుండగా.. ‘‘నువ్వు అలా ప్రిపేర్ అవ్వకపోవడం నీ తప్పు కూడా అవ్వచ్చు కదా’’ అని కౌంటర్ ఇచ్చాడు నిఖిల్. దానికి ‘‘ఎన్నిరోజులని మాస్క్ వేసుకొని ఉంటాం షోలో’’ అని తన అభిప్రాయాన్ని బయటపెట్టింది దామిని. ఇక దామిని ఎలిమినేషన్‌కు తను మతపరమైన వ్యాఖ్యలు చేయడమే ముఖ్య కారణమని పలువురు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దానిగురించి కూడా దామిని ఈ ఇంటర్వ్యూలో రియాక్ట్ అయ్యింది. ‘‘వినాయక చవితిరోజు తను అక్షింతలు వేశాడండి అనేది మాత్రం టెలికాస్ట్ అయ్యింది. దాని ముందు ఏం జరిగింది, తర్వాత ఏం జరిగింది టెలికాస్ట్ చేయలేదు’’ అంటూ వాపోయింది. అంతే కాకుండా బయటికి రాగానే ఏడ్చేశానని, తనతో పాటు తన అమ్మ కూడా ఏడ్చిందని, 45 సెకండ్లు ఇద్దరూ ఏం మాట్లాడుకోలేదని బయటపెట్టింది దామిని.






Also Read: మీరు చూసింది వేరు, ఇంతకంటే దిగజారవద్దు - రతిక టీమ్ మండిపాటు


Join Us on Telegram: https://t.me/abpdesamofficial