బిగ్ బాస్ రియాలిటీ షో అంటే ప్రేక్షకుల్లో ఎక్కువగా గుర్తింపు లేని సినీ సెలబ్రిటీలతో పాటు ఫేడవుట్ అయిన సినిమా స్టార్లను తీసుకొచ్చి ఒక హౌజ్‌లో పెట్టి, బయట ప్రపంచంతో ఏ సంబంధం లేకుండా వారితో ఆటలు ఆడించి ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసే ప్రయత్నం చేస్తారు మేకర్స్. ఇప్పటివరకు బిగ్ బాస్ రియాలిటీ షో ఎన్నో భాషల్లో ప్రసారం అయ్యింది. కానీ మొదటిసారి బిగ్ బాస్‌లోకి ఒక ఎమ్మెల్యే కంటెస్టెంట్‌గా వచ్చారు. దీంతో ప్రేక్షకులు ఆశ్చర్యపోవడంతో పాటు విమర్శిస్తున్నారు కూడా. ప్రస్తుతం బిగ్ బాస్‌లోకి ఎమ్మెల్యే ఎంట్రీ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.


బిగ్ బాస్ కన్నడలో..
కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్ బిగ్ బాస్ కన్నడ రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి సోషల్ మీడియాలో దుమారాన్ని రేపారు. సోమవారం సాయంత్రం ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుండగా.. దీనికి సంబంధించిన ప్రోమోలో చిక్కబల్లాపూర్ ఎమ్మెల్యే ఈశ్వర్ గ్రాండ్‌గా బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంటర్ అవుతున్నట్టు చూపించారు. అంతే కాకుండా ఈ ప్రోమోలో కంటెస్టెంట్‌గా జాయిన్ అవ్వడం సంతోషంగా ఉంది అంటూ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు ఎమ్మెల్యే. 38 ఏళ్ల ఈ ఎమ్మెల్యే ప్రస్తుతం ఒక కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌ను నడుపుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మినిస్టర్ కే సుధాకర్‌ను ఓడించారు. రాజకీయాల్లో తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్నారు ఈశ్వర్.


యాక్షన్ తీసుకోండి ప్లీజ్..
బిగ్ బాస్ కన్నడ సీజన్ 10లో ఈశ్వర్ కంటెస్టెంట్‌గా కనిపించిన ప్రోమో విడుదల అవ్వగానే ఒక రాజకీయ నాయకుడు అయ్యిండి, అది కూడా పదవిలో ఉంటూ ఇలాంటి షోలోకి వెళ్లడం ఏంటి అని ప్రేక్షకులు విమర్శిస్తున్నారు. ఒక నెటిజన్ అయితే ఏకంగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు డిప్యుటీ సీఎం కే శివకుమార్‌ను ట్విటర్‌లో ట్యాగ్ చేస్తూ.. ‘బిగ్ బాస్ కన్నడలోకి ఎంటర్ అయిన చిక్కబల్లాపూర్ ఎమ్మెల్యే ప్రదీప్ ఈశ్వర్‌పై చర్యలు తీసుకోండి ప్లీజ్. ప్రజలు ఆయనను సేవ చేయడానికి ఎన్నుకుంటే ఆయన మాత్రం చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నారు’ అంటూ ట్వీట్ చేశారు.






గెస్ట్ మాత్రమే..
మరో నెటిజన్.. ‘‘మీరు ట్యాక్సులు కడతారు, వారు దానినే జీతంగా తీసుకుంటారు. ప్రపంచానికి దూరంగా ఉండే రియాలిటీ షోలకు కూడా వెళతారు. రాజకీయం అనేది ఇలా పనిచేయదు అనుకుంటా’’ అని ట్వీట్ చేశారు. ఇలాగే చాలామంది ప్రజలు తమ కోపాన్ని, ఆగ్రహాన్ని బయటపెట్టారు. కానీ ఈశ్వర్ ఫ్యాన్స్ మాత్రం ఆయన ఏం చేసినా కరెక్టే అన్నట్టు సపోర్ట్ చేశారు. కలర్స్ కన్నడ ఛానెల్ ప్రకారం బిగ్ బాస్ కన్నడ షోలో కంటెస్టెంట్స్ అంతా బిగ్ బాస్ హౌజ్‌లో 100 రోజులు ఉండడానికి అగ్రిమెంట్ సైన్ చేయాలి. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 10లో కంటెస్టెంట్స్ ఎవరు అనేది మేకర్స్ ఫిక్స్ అయినట్టు సమాచారం. అయితే ప్రదీప్ ఈశ్వర్ కంటెస్టెంట్‌లాగా కాకుండా కేవలం గెస్ట్‌లాగా మాత్రమే ఈ రియాలిటీ షోలోకి ఎంటర్ అయినట్టు తెలుస్తోంది. కానీ గెస్ట్ అయినా.. కంటెస్టెంట్ అయినా అలాంటి ఒక రియాలిటీ షోకు ఎమ్మెల్యే వెళ్లడం కరెక్ట్ కాదని చాలామంది సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.


Also Read: వామ్మో శుభశ్రీ, ‘బిగ్ బాస్’లో ఉన్న 5 వారాల్లో అంత సంపాదించిందా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial