Bindu Madhavi | ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’లో సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ బిందు మాధవి. ‘అవకాయ్ బిర్యానీ’ టాలీవుడ్‌కు పరిచయమైన ఈ అచ్చ తెలుగు అమ్మాయి. ఇప్పటివరకు 11 సినిమాల్లో నటించిన బిందు మాధవి తెలుగు చిత్రాల్లో నటించింది తక్కువే. ‘అవకాయ్ బిర్యానీ’ తర్వాత పూర్తి భిన్న పాత్రతో ‘బంపర్ ఆఫర్’లో నటించింది. ఆ తర్వాత ‘రామ రామ కృష్ణ కృష్ణ’ సినిమాలో నటించింది. చివరిగా ‘పిల్ల జమిందారు’ సినిమాలో కనిపించింది. ఆ తర్వాత తమిళ చిత్రాల్లో బిజీగా మారిపోయింది. దాదాపు పదేళ్ల తర్వాత మళ్లీ ఓటీటీలో ప్రసారమవుతున్న ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 


‘బిగ్ బాస్ నాన్ స్టాప్’లో గత సీజన్లలో పాల్గొన్న కంటెస్టెంట్లను ‘వారియర్స్’ టీమ్‌గా, కొత్తగా వచ్చిన కంటెస్టెంట్లను ‘ఛాలెంజర్స్’గా విభజించిన సంగతి తెలిసిందే. అయితే, బిందు మాధవికి మాత్రం ఈ రెండు టీమ్స్‌లో ఏ టీమ్‌కు సెట్ కాదు. ఎందుకంటే.. ఆమె ఇదివరకే తమిళంలో ప్రసారమైన ‘బిగ్ బాస్’ సీజన్-1లో పాల్గొంది. దీంతో ఆమెకు ఇప్పటికే ‘బిగ్ బాస్’ హౌస్‌లో ఉన్న అనుభవం ఉంది. కానీ, ఆమె తమిళ ‘బిగ్ బాస్’లో పాల్గోవడం వల్ల టెక్నికల్‌గా ‘వారియర్స్’ టీమ్‌కు చెందదు. అందుకే ఆమెను ‘ఛాలెంజర్స్’ టీమ్‌లో పెట్టారు. దీంతో ఛాలెంజర్స్ టీమ్‌లో ‘బిగ్ బాస్’ అనుభవం ఉన్న ఏకైక కంటెస్టెంట్ బిందు మాధవి మాత్రమే. 


తమిళ బిగ్ బాస్‌లో ఎప్పుడు ఎలిమినేట్ అయ్యింది?: 2017లో ప్రారంభమైన తమిళ ‘బిగ్ బాస్’ మొదటి సీజన్‌లోనే బిందు మాధవి కంటెస్టెంట్‌గా తన లక్ పరీక్షించుకుంది. చాలా కూల్‌గా ఎవరినీ నొప్పించకుండా, అతి చేయకుండా ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆ సీజన్లో తమిళ నటి ఒవియాకు గట్టి పోటీ ఇచ్చిన మహిళ కంటెస్టెంట్ బిందు మాధవీయే. స్నేహన్, హరీష్, గణేష్‌లతో ఆమె పోటీ పడింది. కానీ, చివరికి టైటిల్ ఒవియాకే లభించింది. బిందు మాధవి టాప్-5లో స్థానం సంపాదించినా.. 97వ రోజే 4వ రన్నరప్‌గా ఎలిమినేట్ అయ్యింది. ఒక తెలుగమ్మాయి తమిళ బిగ్ బాస్‌లో టాప్-5లో స్థానం సంపాదించిందంటే గ్రేటే. అయితే, బిందు ఆ షోలో 35వ రోజు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. 


Also Read: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’: నామినేషన్లో ఉన్నది వీరే.. వీరిలో ఎవరికి మీ ఓటు?


డిప్రషన్‌తో ‘బిగ్ బాస్’లోకి ఎంట్రీ..: ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లెలో జన్మించిన బిందు మాధవి తమిళ చిత్రాల్లో బిజీగా ఉండటం వల్ల కుటుంబంతో సహా చెన్నైలో ఉంటోంది. బిందు 2005లో బయో టెక్నాలజీలో డిగ్రీ పూర్తి చేసింది. తాజాగా ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ వేదికపై హోస్ట్ నాగార్జునతో మాట్లాడుతూ.. ‘‘తమిళ బిగ్ బాస్‌లోకి వెళ్లే ముందు లవ్ ఫెయిల్యూర్ అయ్యింది. ఆ డిప్రషన్‌తో కౌన్సిలింగ్ తీసుకుంటున్న సమయంలో తమిళ బిగ్ బాస్‌లో అవకాశం వచ్చింది. అక్కడి వాతావరణం వల్ల త్వరగా డిప్రషన్ నుంచి కోలుకున్నా. బిగ్ బాస్ నన్ను మంచిగా మార్చింది. ఇప్పుడు మరోసారి ఆఫర్ వచ్చింది. తెలుగువాళ్లకు మరింత దగ్గరవ్వాలని ఇందులోకి వచ్చాను’’ అని తెలిపింది. ‘నాన్ స్టాప్’లో బిందుకు స్క్రీన్ షేర్ చాలా తక్కువగా ఉంది. చాలా తక్కువగా మాట్లాడటం, ఇతరులతో పెద్దగా కలవకపోవడం వల్ల ఆమె స్క్రీన్‌పై ఎక్కువగా కనిపించడం లేదు. గొడవలకు కూడా దూరంగా ఉంటూ కూల్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. మరి, తమిళ ప్రేక్షకుల్లా మన తెలుగు ప్రేక్షకులు ఆమెను ఆధరిస్తారో లేదో చూడాలి.