BiggBoss 6 Telugu:అన్ని సీజన్లతో పోలిస్తే ఈ బిగ్ బాస్ సీజన్ 6 చాలా నిరాశజనకంగా, ప్రేక్షకులను అలరించకుండా ముందుకు సాగింది. కానీ ఈ సీజన్ విన్నర్ మాత్రం లక్కీ ఫెలో అని చెప్పాలి. అతనికి మొత్తం కోటి దాకా బహుమతులు అందే  అవకాశం ఉంది. యాభై లక్షల నగదు బహుమతితో పాటూ, మారుతి బ్రెజ్జా కారు, పాతిక లక్షల రూపాయలు విలువ చేసే 600 గజాల ఇంటి స్థలం కూడా దక్కనుంది. ఈ విషయం చెప్పగానే ఇంటి సభ్యులంతా ఎగిరి గంతేశారు. 


ఇక ఎపిసోడ్ విషయానికి వస్తే ఇంటి సభ్యులకు ఫైవ్ స్టార్ చాక్లెట్లు పంపించి విందు ఇచ్చారు బిగ్ బాస్. ఇక నాగార్జున మొదట క్యాంపెయిన్ టాస్కు ఇచ్చారు ఇంటి సభ్యులకు. రేవంత్ - శ్రీహాన్ మధ్య ఈ క్యాంపెయిన్ టాస్కు ఇచ్చారు. వీరిద్దరూ తమ కన్నా ఎవరు బెటర్ చెప్పుకోవాలని చెప్పారు. ఇద్దరూ ఒకరి గురించి ఒకరు చెప్పుకున్నారు. ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకునే రేవంత్ కు ఈసారి కూడా కోపం వచ్చేసింది. నాగార్జున ‘ఆదిరెడ్డితో ఫ్లిప్పర్ అన్నావ్ కదా’ అని అన్నారు. దానికి రేవంత్ ‘నాకు గుర్తు లేదు’ అన్నాడు. ఆదిరెడ్డితో ‘శ్రీహాన్ అన్నాడు కదా’ అనగా, నాకు గురు లేదు సర్ అన్నాడు ఆదిరెడ్డి. దానికి నాగార్జున నీకన్నా ఫ్లిప్పర్ లేడు అన్నారు. 


కాగా నాగార్జున ముగ్గురు సూట్‌కేసులు తెచ్చిపెట్టారు. అందులో ఒక సూట్‌కేసును ఎంచుకుంటే అందులో ఉండే డబ్బు, ప్రైజ్ మనీకి యాడ్ అవుతుంది అని చెప్పారు. దీంతో అందరూ కలిసి ఒక సూటుకేసు ఎంచుకున్నారు. అందులో మూడు లక్షల రూపాయలు ఉంది. దాన్ని ప్రైజ్ మనీకి యాడ్ చేసి యాభై లక్షల రూపాయలు చేశారు.  తరువాత కీర్తి - శ్రీసత్య వారిద్దరూ ఎందుకు బెటరో వాదించుకున్నారు. అలా అందరూ వాదించుకున్నారు. ఇనయా - ఆదిరెడ్డి కూడా వాదించుకున్నారు. ఆదిరెడ్డి వాదించడం చాలా చిరాకుగా అనిపించింది. 


తరువాత దెయ్యాల గదిలో ఇంటి సభ్యులు చేసిన విన్యాసాలు చూపించారు నాగార్జున. వాటిని చూసి అందరూ పడీ పడీ నవ్వుకున్నారు. తరువాత తాము బెస్ట్ అనుకున్న వారిలో ముగ్గురికి స్టార్ రేటింగ్స్ ఇచ్చి, ముగ్గురికి క్రాస్ సింబల్ ఫేస్ పైన ముద్రించాలని  చెప్పారు నాగార్జున. ఇందులో బ్యాడ్ అనుకున్నవారిపై డబుల్ క్రాస్, వెరీ బ్యాడ్ అనుకున్నవారిపై ట్రిపుల్ క్రాస్ వేయాలని చెప్పారు. అలా ట్రిపుల్ క్రాస్ ఎక్కువగా ఆదిరెడ్డి, ఇనాయ, కీర్తి నిలిచారు. వీరికి ఇద్దిరిద్దరూ ట్రిపుల్ క్రాస్ వేశారు. 


వారు సేఫ్...
మధ్యలో రేవంత్, కీర్తి సేఫ్ అయినట్లు ప్రకటించారు. అంటే శ్రీహాన్‌తో పాటూ వీరిద్దరూ కూడా ఫైనల్లోకి వెళ్లిపోయారు. ఇక మిగిలిన నలుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో గెస్ చేసి చెప్పాలని అడిగారు. శ్రీహాన్ రోహిత్ వెళ్లిపోతాడని చెబితే, కీర్తి ఆదిరెడ్డి పేరు చెప్పింది. ఇక రేవంత్ ఇనాయ వెళ్లిపోతుందని చెప్పాడు. దీంతో ఇనాయ ‘నిన్నే కదా నేను టాప్ 5 కంటెస్టెంట్ అన్నావు’ అంది. దానికి నాగార్జున ‘ఇది ఆయన మనసులో మాట’ అన్నాడు. 


Also read: నవ్వుతూ రేవంత్‌కి, శ్రీహాన్‌కి మధ్య గొడవ పెట్టేసిన నాగార్జున