తెలుగు ప్రజలందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న ‘బిగ్‌బాస్ 7’ ప్రారంభం అయ్యే తేదీని స్టార్ మా అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 3వ తేదీ నుంచి బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ప్రారంభం కానుంది. గత సీజన్ల మాదిరిగానే అక్కినేని నాగార్జున ఈ సీజన్‌కు కూడా హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేశారు.
ప్రోమో ఇలా..
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కొత్త ప్రోమోను రమేశ్, రాధ అనే ఇద్దరు ప్రేమికులతో ప్రారంభించారు నిర్వాహకులు. వీరిలో రమేశ్.. కొండపై నుంచి జారి పడిపోబోతుంటే.. రాధ కొండపై నుంచి చున్నీ ఇచ్చి పట్టుకోమని అంటుంది. మామూలుగా సినిమాల్లో ఇలాంటి సీన్ వచ్చినప్పుడు రమేశ్.. కచ్చితంగా బతికి బయటపడతాడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమోలో మాత్రం అలా జరగదు.
రమేశ్ ఇక బతికేస్తాడు అనుకొనే సమయానికి రాధకు తుమ్ము వస్తుంది. అంతే మన రమేశ్ లోయలో పడి చనిపోతాడు. ఇలాగే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కూడా ఎవరి ఊహకు అందకుండా ఉంటుందని నిర్వాహకులు ఈ ప్రోమో ద్వారా చెప్పకనే చెప్పారు. అంతే కాకుండా ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్ ఆటలు చెల్లవని, బిగ్ బాస్ ఆడించే ఆటలు మాత్రమే చెల్లుతాయని హోస్ట్ నాగార్జున స్పష్టం చేశారు. ఈ బిగ్ బాస్ సీజన్... ముందు సీజన్స్ కంటే చాలా భిన్నంగా ఉంటుంది అని నాగార్జున కచ్చితంగా చెప్పారు. అలాగే బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గ్రాండ్ లాంచ్ సెప్టెంబర్ 3వ తేదీన అని ప్రోమోలో స్పష్టం చేశారు.
టాలీవుడ్ కింగ్ నాగార్జున గత నాలుగు సీజన్ల నుంచి బిగ్ బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. తెలుగులో బిగ్ బాస్ మొదటి సీజన్‌కు జూనియర్ ఎన్‌టీఆర్‌కు హోస్ట్ స్థానాన్ని ఇచ్చి ఈ షోపై హైప్‌ను విపరీతంగా పెంచేశారు. అంతే కాకుండా జూనియర్ ఎన్‌టీఆర్ కోసం ఫ్యామిలీ ఆడియన్స్ అంతా బిగ్ బాస్ చూడడం ప్రారంభించారు.
ఆ తర్వాత రెండో సీజన్‌లో నాని హోస్ట్‌గా ఎంటర్ అయ్యాడు. అయితే నాని హోస్టింగ్‌కు ఎంతమంది ఫ్యాన్స్ అయ్యారో, అదే రేంజ్‌లో నెగిటివిటీ కూడా ఎదురు అయింది. అందుకే తరువాతి సీజన్‌కు హోస్టింగ్ చేయడానికి నేచురల్ స్టార్ నాని ఒప్పుకోలేదు. ఆ తర్వాత బరిలోకి దిగారు కింగ్ నాగార్జున. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 నుంచి ఇప్పటివరకు నాగార్జున స్థానాన్ని ఎవరూ తీసుకోలేకపోయారు. ప్రతీ సీజన్ స్టార్టింగ్‌లో నాగ్ స్థానంలో మరో హీరో బిగ్ బాస్ హోస్ట్‌గా కనిపించనున్నాడు అంటూ పుకార్లు వస్తాయి. అయితే అవేవి నిజం కాదని చివర్లో తెలుస్తుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విషయంలో కూడా అదే జరిగింది.