‘బిగ్ బాస్’ సీజన్-7లో ప్రస్తుతం కెప్టెన్సీ టాస్క్ నడుస్తోంది. ఈ సందర్భంగా హౌస్‌మేట్స్ అంతా రెండు గ్రూపులుగా విడిపోయి స్కిట్ చేస్తున్నారు. అయితే, ఈ స్కిట్ పూర్తిగా డబుల్ మీనింగ్‌తో నిండిపోయింది. టేస్టీ తేజా ‘ఫస్ట్ నైట్’ అంటూ శోభాశెట్టి వెంటపడటం.. ప్రియాంకతో శివాజీ పులిహోర కలపడం వంటివి చూడానికి కాస్త ‘అతి’ అనిపించినా.. కొందరికి నచ్చే అవకాశమైతే ఉంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో చూస్తే మీకూ అదే అనిపిస్తుంది. 


గ్రహాంతరవాసిని మెప్పిస్తేనే కెప్టెన్సీ


హౌస్‌లో కెప్టెన్సీ కోసం ‘బిగ్ బాస్’ ఓ టాస్క్ ఇచ్చాడు. ఒక యూఎఫ్‌వో గులాబీపురం, జిలేబీపురం మధ్యలో క్రాష్ అయ్యిందని.. ఎవరైతే గ్రహాంతరవాసులను మెప్పిస్తారో వారికి ఆ ఊరి నుంచి కెప్టెన్సీ వస్తుందని బిగ్ బాస్ తెలిపాడు. ఈ సందర్భంగా వారితో ఒక స్కిట్ చెయ్యించాడు. హౌస్‌మేట్స్ ఆ పాత్రల్లో జీవించారు. టాస్కులో భాగంగా రెండు ఊర్లలో ప్రజలుగా హౌస్‌మేట్స్ నటించారు. గులాబీపురం ఊరికి శోభా సర్పంచ్. ఆమె తన భర్త తేజాతో విడాకులు తీసుకుని ఒంటరిగా ఉంటుంది. యావర్ పల్లెటూరి అమ్మాయి కోసం వెతుకుతున్న ఎన్ఆర్ఐ అబ్బాయి. సర్పంచ్‌ను ఇంప్రెస్ చేసేందుకు తెలుగులో మాట్లాడతాడు. ఊర్లో అందరి గాసిప్స్ చేసే టీ కొట్టు ఓనర్ అమర్ దీప్. సర్పంచ్ శోభను ప్రేమిస్తున్న రోడ్ సైడ్ రోమియో గౌతమ్. పూజా ఒక పల్లెటూరి అమ్మాయి. పక్కఊరి అర్జున్ అంటే క్రష్. ప్రియాంక జిలేబీపురం సర్పంచ్. భోలే.. జ్యోతిష్కుడు.. తనతో మాట్లాడేవారితో మాత్రమే మాట్లాడుతాడు. సందీప్.. ఆ ఊరిలో కీళ్లి కొట్టు యజమాని. అర్జున్ గల్లీ గూండా. అశ్వినీ పల్లెటూరి అందమైన అమ్మాయి. ప్రశాంత్ అర్జున్ వెంట తిరిగే కుర్రాడు. రెండూళ్లకు పెద్దమనిషి శివాజీ. 


తేజా ‘ఫస్ట్ నైట్’ గోల - శివాజీ పులిహోర


బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో ఈ స్కిట్ మొత్తం నడించింది. ఆ తర్వాత గులాబీపురం, జిలేబీపురం మధ్య గుడ్లను బ్యాలెన్స్ చేసే టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఇందులో జిలేబీపురం హౌస్‌మేట్స్ విజేతలుగా నిలిచారు. గ్రహాంతరవాసి స్కిట్ గురువారం కూడా కొనసాగనున్నట్లు తాజా ప్రోమోలో చూపించారు. ఇందులో టేస్టీ తేజ.. ఈ రోజు తన పెళ్లి రోజని, ఫస్ట్ నైట్ రోజు ఇదే డ్రెస్ వేసుకున్నా అంటూ ఊర్లో చెప్పుకోవడమే కాకుండా.. శోభాశెట్టిని కూడా ఆటపట్టించాడు. అయితే శోభా మాత్రం పదే పదే అలా అనొద్దంటూ తేజాను కొట్టడం కనిపించింది. మరోవైపు శివాజీ రెండు ఊర్లకు పెద్ద మనిషిగా వ్యవహరిస్తూనే.. జిలేబీపురం సర్పంచ్ ప్రియాంకాకు పులిహోర కలుపడం కనిపించింది. ‘‘నువ్వు నడుస్తుంటే.. నెమలి నాట్యమాడుతున్నట్లే ఉంది’’ అని శివాజీ అన్నాడు. మధ్యలో ఎందుకో ఒక బిగ్ బాస్ ఒక బీప్ కూడా వేసుకున్నట్లు కనిపించింది. మొత్తానికి ఈ స్కిట్ పెద్దలకు మాత్రమే అన్నట్లుగా ఉంది. తాజా సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ రెండూ ఊర్లకు మధ్య మరో పోటీ పెట్టినట్లు సమాచారం. అందులో కూడా జిలేబీపురమే గెలిచి కెప్టెన్సీకి అవసరమైన ఫైనల్ టాస్క్‌కు అర్హత పొందినట్లు తెలిసింది.