బిగ్ బాస్ సీజన్ 7లోని మొదటి ఎపిసోడ్ చాలా సరదాగా మొదలయ్యింది. ముందుగా లాంచ్ డే ఎపిసోడ్ ఈరోజు కూడా కంటిన్యూ అయ్యింది. ఇక నిన్న హీరో నవీన్ పోలిశెట్టిని నాగార్జున.. బిగ్ బాస్ హౌజ్‌లోకి పంపడం వరకే చూపించారు. ఈరోజు అక్కడ నుండే ఎపిసోడ్ ప్రసారం అయ్యింది. నవీన్ పోలిశెట్టి వెళ్లిపోయిన తర్వాత నుంచి కంటెస్టెంట్స్ అంతా ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి, ఒకరితో ఒకరు ఎక్కువగా సమయాన్ని గడపడానికి ప్రయత్నించడం మొదలుపెట్టారు. ఎన్నో సరదా కబుర్లు కూడా చెప్పుకున్నారు. అందులో భాగంగానే శివాజీ తన పర్సనల్ లైఫ్ గురించి, పెళ్లి గురించి కామెంట్స్ చేశారు.


పెళ్లి కాలేదు..
శివాజీకి పెళ్లి అయ్యింది అని టేస్టీ తేజ అనగా.. నాకు పెళ్లి అయ్యిందా అంటూ సందేహంగా ప్రశ్నించారు శివాజీ. అయితే పెళ్లి కాలేదా అంటూ శుభశ్రీ ఆశ్చర్యపోయి అడిగింది. అప్పుడు కూడా శివాజీ కాలేదు అన్నట్టుగా అడ్డంగా తల ఊపారు. సింగిల్, రెడీ టు మింగిల్, కాంప్లికేటెడ్.. ఇందులో ఏది అని అడగగా.. శివాజీ ఏదీ కాదు అన్నట్టుగా సమాధానం ఇచ్చారు. కన్ఫర్మా, అన్ని కెమెరాలు చూస్తున్నాయి, పెళ్లి కాలేదా అని టేస్టీ తేజ మళ్లీ మళ్లీ అడిగాడు. ‘మొత్తం కెమెరాలు ఇటు తిప్పినా అదే చెప్తా.. కాలేదు.’ అంటూ శివాజీ సమాధానమిచ్చారు. ‘పిల్లను ఇవ్వలేదు’ అంటూ ధీనంగా చెప్పారు. నీకేం తక్కువ అని అడగగా.. అన్ని ఎక్కువనే ఇవ్వలేదు అని చెప్పారు శివాజీ. సీరియస్‌గా చెప్పు బ్రో అని తేజ అనగా.. ‘ఎవర్రా నీకు బ్రో దున్నపోతులాగా ఉన్నావు’ అంటూ తేజ మీద కామెంట్ చేశాడు. అయితే ఏమని పిలవాలి నిన్ను అని అడగగా.. ‘నాకు తెలిసిన వారు అందరూ శివన్నా’ అని పిలుస్తారు అని చెప్పుకొచ్చాడు.


రాత్రంతా కబుర్లు..
బిగ్ బాస్ సీజన్ 7లో సరదా సంభాషణల మధ్య కొన్ని సీరియస్ సంభాషణలు కూడా జరుగుతున్నాయి. లాంచ్ ఎపిసోడ్ అయిన తర్వాత, కంటెస్టెంట్స్ అంతా హౌజ్‌లోకి వెళ్లిన తర్వాత వారు పడుకోవాలా వద్దా అని బిగ్ బాస్ ప్రత్యేకంగా ఏమీ చెప్పలేదు. దీంతో అసలు పడుకోవాలా వద్దా, పడుకుంటే పనిష్మెంట్ ఏమైనా ఇస్తారా అని చాలామందిలో అనుమానాలు మొదలయ్యాయి. పైగా పడుకోవడానికి తగిన ఏర్పాట్లు కూడా బిగ్ బాస్.. కంటెస్టెంట్స్ కోసం చేయలేదు. దీంతో వారిలో అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. చాలా లేట్ అయింది పడుకుందాం అనే సమయానికి రతిక.. అక్కడ ఉన్నవారితో ‘మనం ఇంకా హౌజ్‌మేట్స్ అవ్వలేదు అని అన్నారు కదా. ఒకవేళ సరిగా రూల్స్ పాటించేవారిని మాత్రమే హౌజ్‌లో ఉంచుతారేమో. ఇంకా పడుకోమని చెప్పి లైట్స్ ఆఫ్ చేయలేదు కదా’ అని చెప్పింది. దీంతో రతిక అనుమానం కరెక్టే అని నమ్మినవారు రాత్రంతా పడుకోకుండా అలాగే కూర్చున్నారు.


అప్పుడే వెళ్లిపోవాల్సింది..
రాత్రంతా పూర్తిగా పడుకోకుండా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చాలామంది కబుర్లు చెప్పుకుంటూనే కూర్చున్నారు. అదే సమయంలో ‘రూ.35 లక్షలు ఇచ్చి వెళ్లిపోమన్నప్పుడే వెళ్లిపోవాల్సింది. పడుకోకుండా ఏంటి ఈ కష్టాలు. ఆలోచించుకోమన్నప్పుడే గట్టిగా ఆలోచించుకోవాల్సింది’ అంటూ శివాజీ సరదాగా అన్నాడు. దానికి రతిక కూడా ఒప్పుకుంటూ తనతో పాటు సరదాగా గొంతుకలిపింది.


Also Read: ‘బిగ్ బాస్’ హౌస్‌లో హింగ్లీష్ - సబ్ టైటిల్స్ ప్లీజ్!