‘బిగ్ బాస్’ సీజన్-7 ఆదివారం నుంచి టెలికాస్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. ‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్’లో లైవ్ కూడా ఇస్తోంది. ప్రేక్షకులు ఎప్పుడైనా సరే బిగ్ బాస్ హౌస్‌లోకి తొంగి చూడవచ్చు. వారి టార్చర్ భరించవచ్చు. అయితే, చాలా ఓపిక కూడా ఉండాలి. అయితే, దీన్ని తెలుగు బిగ్ బాస్ అనే సంగతి ఒక్కోసారి పెద్దాయన మరిచిపోతున్నాడేమో. ఎందుకంటే.. ఇంటి సభ్యులంతా తమకు వచ్చి రాని ఇంగ్లీష్‌లో వాయించేస్తున్నారు. ఎందుకంటే.. వారిలో కొంతమంది కంటెస్టెంట్లకు తెలుగు అస్సలు రాదు. దీంతో ఈ షో చూస్తున్న ప్రేక్షకులు కాస్త అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు కంటెస్టెంట్లు ఇంగ్లీష్‌లో మాట్లాడుతుంటే.. ‘బిగ్ బాస్’ వార్నింగ్ ఇచ్చేవారు. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. లైవ్‌లో అబ్జర్వ్ చేస్తే.. కంటెస్టెంట్లు ఇంగ్లీష్‌లోనే సంభాషణలు సాగిస్తున్నారు. బిగ్ బాస్ కూడా చూసీ చూడనట్లు వదిలేస్తున్నారు. బహుశా రెండో రోజే ఎందుకులే లెక్చర్స్ అని అనుకున్నాడో ఏమో.. భాష విషయంలో వెసులుబాటు ఇస్తున్నాడని ప్రేక్షకులు అంటున్నారు.
తెలుగురాని కంటెస్టెంట్లు వీళ్లే
ఈసారి కూడా ‘బిగ్ బాస్’లోకి తెలుగురాని పాపులర్ సెలబ్రిటీలు ఎంట్రీ ఇచ్చారు. కిరణ్ రాథోడ్, ప్రిన్స్ యావర్, శుభశ్రీ, ప్రియాంక జైన్‌లకు తెలుగు రాదు. అయితే, కిరణ్, ప్రిన్స్‌తో పోల్చితే శుభశ్రీ, ప్రియాంక జైన్‌లు చాలా బెటర్. ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చినవారు తప్పకుండా తెలుగులో మాట్లాడాలనేది రూల్. అలాగని, అస్సలు తెలుగురాని వారిని కూడా తెలుగులోనే మాట్లాడాలని అనడం కూడా తప్పే. కాబట్టి, వారికి నేర్చుకోడానికి టైమ్ ఇవ్వాలనే వాదన ఉంది. మరి, అలాంటప్పుడు తెలుగురాని కంటెస్టెంట్లను తీసుకురావడం ఎందుకు? వారిని ఇబ్బంది పెట్టడం ఎందుకనే చర్చ కూడా నడుస్తోంది. తెలుగులో అంతమంది సెలబ్రిటీలు ఉండగా వీరే దొరికారా అనే సందేహాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రేక్షకుడు ఓటేయాలంటే.. హౌస్‌లో వారి బిహేవియర్, వారు ఏం మాట్లాడుతున్నారనే విషయంపై కూడా ఫొకస్ పెట్టాల్సి ఉంటుంది. తెలుగురాని కంటెస్టెంట్లు ఉంటే.. మిగతా కంటెస్టెంట్‌లు కూడా వారితో ఇంగ్లీష్, హిందీ భాషల్లోనే మాట్లాడాల్సి వస్తోంది. అలా ‘బిగ్ బాస్’ హౌస్ కాస్త హింగ్లిష్ హౌస్‌గా మారిపోతోంది. తెలుగు రాని కంటెస్టెంట్లు.. తమ తోటి సభ్యులు ఏం మాట్లాడుతున్నారో అర్థంకాక జీరో ఫేస్ పెడుతున్నారు. ఇలాగైతే ఎలా పెద్దాయనా?? అని ప్రేక్షకులు అంటున్నారు. మరి, హోస్ట్ నాగార్జున గానీ, ‘బిగ్ బాస్’ గానీ వారికి హితబోధ చేస్తారో లేదో చూడాలి.
ప్రస్తుతం హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు వీరే
1. ప్రియాంక జైన్ (‘జానకి కలగనలేదు’ సీరియల్ నటి)
2. శివాజీ (హీరో)
3. దామిని (సింగర్)
4. ప్రిన్స్ యవార్ (‘నా పేరు మీనాక్షి’ నటుడు)
5. శుభశ్రీ (లాయర్, నటి)
6. షకీలా (నటి)
7. ఆట సందీప్ (కొరియోగ్రాఫర్)
8. శోభా శెట్టి (‘కార్తీక దీపం’ నటి)
9. టేస్టీ తేజ (జబర్దస్త్ కమెడియన్)
10. రతిక (నటి, ఇన్‌ఫ్లూయెన్సెర్)
11. డాక్టర్ గౌతం (నటుడు)
12. కిరణ్ రాథోడ్ (నటి)
13. పల్లవి ప్రశాంత్ (రైతు)
14. అమర్ దీప్ (‘జానకి కలగనలేదు’ నటుడు)
ఈ వారం ఎలిమినేషన్‌లో ఉన్నది వీరే?
‘బిగ్ బాస్’ సీజన్ 7లో జరిగిన మొదటి నామినేషన్స్‌లో 8 మంది ఎలిమినేషన్ రేసులో ఉన్నట్టు సమాచారం. గౌతమ్ కృష్ణ, రతిక, షకీలా, పల్లవి ప్రశాంత్, శోభా శెట్టి, కిరణ్ రాథోడ్, ప్రిన్స్ యావర్, దామిని భట్ల.. ఈ 8 మంది నామినేషన్స్‌లో ఉన్నారు. అసలు ఈ 8 మంది ఎలా నామినేట్ అయ్యారు, నామినేషన్స్ ప్రక్రియలో వచ్చిన మార్పులు ఏంటి, ఆ సమయంలో జరిగిన వాగ్వాదాలు ఏంటి తెలుసుకోవాలంటే ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేంత వరకు ఆగాల్సిందే. కానీ ‘బిగ్ బాస్’ ప్రేక్షకులు తమ ఫేవరెట్ కంటెస్టెంట్‌ను నామినేషన్ నుండి తప్పించి, ‘బిగ్ బాస్’లో కొనసాగేలా చేయాలంటే వారి చేతిలో కేవలం ఒక ఓటు మాత్రమే ఉంటుంది. ఇంతకు ముందులాగా హాట్‌స్టార్‌లో 10 ఓట్లు, ఫోన్ నుండి 10 మిస్డ్ కాల్స్ లాంటి ఆప్షన్‌ను ‘బిగ్ బాస్’ తొలగించారు. ప్రస్తుతం ఆడియన్స్ చేతిలో ఒక హాట్‌స్టార్ ఓటు, ఒక మిస్డ్ కాల్ ఆప్షన్ మాత్రమే ఉంటుంది.