బిగ్ బాస్ సీజన్ 7 అంతా నిజంగానే ఉల్టా పుల్టాలాగా ఉంది అని ప్రేక్షకులకు అనిపించడం మొదలయ్యింది. ఇంతకు ముందు సీజన్స్‌లో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి అయిదుగురు కంటెస్టెంట్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంటర్ అవ్వడం ప్రేక్షకులతో పాటు కంటెస్టెంట్స్‌ను కూడా ఆశ్చర్యపరిచింది. తాజాగా ప్రసారమయిన ఎపిసోడ్‌లో నాగార్జున మరో ట్విస్ట్ ఇచ్చారు. ఇప్పటివరకు హౌజ్ నుండి అయిదుగురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోగా.. అందులో ముగ్గురిని స్టేజ్‌పైకి పిలిచారు. అంతే కాకుండా వారిని బిగ్ బాస్ హౌజ్‌లోకి కూడా పంపించారు. అంతే కాకుండా ఆ ముగ్గురిలో ఎవరో ఒకరు మళ్లీ కంటెస్టెంట్‌గా బిగ్ బాస్ హౌజ్‌లోకి అడుగుపెట్టవచ్చని అన్నారు నాగార్జున.


మీ టీమ్‌లో ఉంటే మీ టీమ్ గెలిచినట్టే..
బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయిపోయిన దామిని, రతిక, శుభశ్రీలకు నాగార్జున మరో అవకాశం ఇచ్చారు. ఈ ముగ్గురిని బిగ్ బాస్ హౌజ్‌లోకి మళ్లీ కంటెస్టెంట్‌గా పంపిస్తానని అన్నారు. కాకపోతే ఈ ముగ్గురిలో మళ్లీ కంటెస్టెంట్ ఎవరు అవ్వాలి అనే నిర్ణయాన్ని ప్రస్తుతం హౌజ్‌లో ఉన్న కంటెస్టెంట్స్‌కే వదిలేశారు. అయితే కంటెస్టెంట్స్ తమ నిర్ణయాన్ని తెలిపే ముందు దామిని, రతిక, శుభశ్రీలకు ఓటు అడిగే అవకాశాన్ని అందించారు. ముందుగా దామిని.. తనకు ఓటు వేయమని అడగడానికి ముందుకొచ్చింది. ‘‘నేను వెళ్లేటప్పుడు శివాజీగారు ఒక మాట అన్నారు. నీ ఆట నువ్వు ఆడలేదమ్మా అని. అప్పుడు బయట ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి నేను ఆడాను అని స్ట్రాంగ్‌గా ఫీల్ అయ్యాను కానీ బయటికి వెళ్లాక నా ఆట నేను నిజంగా పూర్తిస్థాయిలో ఆడలేదు. నేను ఎప్పుడూ హౌజ్‌లో ఎవరిని కించపరిచినట్లు మాట్లాడలేదు. యావర్‌కు పేడ కొట్టాను కాబట్టే నన్ను పంపించేశారు ఆడియన్స్. కానీ అది టాస్క్ కోసం మాత్రమే. అందరికీ సమానంగా గౌరవం ఇస్తాను నేను. మీ మ్యూజిక్ సిస్టమ్‌ను, వంటక్కను మీరు మిస్ అయ్యారు. చిన్న చిన్న తప్పుల వల్ల ఎలిమినేట్ అయ్యాను కానీ నేను ఈ హౌజ్‌కు అర్హురాలిని అనుకుంటున్నాను. నేను స్ట్రాంగ్ కంటెస్టెంట్. నేను మీ టీమ్‌లో ఉంటే మీ టీమ్ కచ్చితంగా గెలుస్తుంది’’ అంటూ కంటెస్టెంట్స్‌కు విజ్ఞప్తి చేసుకుంది దామిని.


ఎంత స్ట్రాంగ్ అని మీరే చూస్తారు..
దామిని తర్వాత రతిక తనకు ఓటు వేయమని అడగడానికి ముందుకొచ్చింది. ‘‘అందరికీ నమస్కారం. నిజాయితీగా ఉండి, తెలిసో తెలియకో చేసిన తప్పులను సరిదిద్దుకునే ధైర్యం ఉంటే ఆ దేవుడు ఇంకొక అవకాశం కల్పిస్తాడని మా నాన్న ఎప్పుడూ చెప్తుండేవాడు. ఆ అవకాశం నాకు వచ్చి, నేను ఇక్కడ నిలబడినందుకు అదృష్టంగా భావిస్తున్నాను. నా గేమ్ చాలా బాగుంది, స్ట్రాంగ్ కంటెస్టెంట్, ఈమెకు ఇంకొక అవకాశం ఇచ్చి చూద్దాం అని మీలో అందరూ అనుకుంటున్నారు. నాకు తెలుసు. నేను చేస్తున్నాను. అదే మీరు నాకు ఓటు వేసి గెలిపించడంలో చూపిస్తారని నేను కోరుకుంటున్నాను. ఒక్క అవకాశం ఇస్తే నేను మెంటల్‌గా ఎంత స్ట్రాంగో ఫిజికల్‌గా కూడా అంతే స్ట్రాంగ్‌గా ఉంటాను. ఒక్క అవకాశం ఇవ్వండి. నేను ఎంత స్ట్రాంగ్‌గా వస్తానో, నా గేమ్ ఎంత స్ట్రాంగ్ ఉంటుందో మీరే చూస్తారు’’ అని రతిక చెప్పింది.


లాయర్ పాప విజ్ఞప్తి..
ఆ తర్వాత వచ్చిన శుభశ్రీ వచ్చి ‘‘లాయర్ పాప, శుభశ్రీ, సుబ్బు, సుబమ్మ అని చాలా పేర్లు ఇచ్చారు మీరు. చాలా ఎంటర్‌టైన్మెంట్ కూడా ఇచ్చాను. నా ఆట, మాట, ఎంటర్‌టైన్మెంట్, నా ఎమోషన్స్ అన్నీ మీరు చూశారు. అయిదు వారాలు ఇక్కడ ఉండి చాలా ఎంజాయ్ చేశాను. నా ఫోకస్ కూడా మీరు చూశారు. అయిదు వారాల్లో అన్ని ఆటల్లో నా బెస్ట్ ఇచ్చాను. ఇప్పుడు ఇంకా ఇవ్వాలని ఉంది. అనుకోకుండా గతవారం ఎలిమినేట్ అయిపోయాను. కానీ ఇప్పుడు ఇంకొక అవకాశం ఇచ్చారు. నాకు తెలుసు నేను వెళ్లిన తర్వాత అందరి మనోభావాలు దెబ్బతిన్నాయని. ఇప్పుడు ఇంకొక కొత్త అవకాశం ద్వారా ఈ మనోభావాలకు రిపేర్ చేసే టైమ్ వచ్చేసింది. నాకు ఓటు వేస్తారని, అవకాశం ఇస్తారని నేను నమ్ముతున్నాను.’’ అని విజ్ఞప్తి చేసుకుంది. ఇప్పుడు ఈ ముగ్గురిలో తిరిగి కంటెస్టెంట్‌లాగా ఎవరిని తీసుకురావాలి అనే నిర్ణయం కంటెస్టెంట్స్ చేతిలో ఉంటే.. ఎక్కువ ఓట్లు సాధించిన వారిని తిరిగి హౌజ్‌లోకి ఎప్పుడు పంపాలి అనే నిర్ణయం బిగ్ బాస్ చేతిలో ఉంటుందని నాగార్జున స్పష్టం చేశారు. పైగా వీరికి ఓట్లు ఎలా వేయాలి అని ఆదివారం ఎపిసోడ్‌లో వివరిస్తానని చెప్పారు.


Also Read: టికెట్ రేట్లు తగ్గితే ఇంత లాభమా - ఒక్క రోజులో 60 లక్షల మంది అంటే మాటలా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial