‘బిగ్ బాస్’ సీజన్ 7లో నామినేషన్స్ సెగ నుండి హౌజ్‌మేట్స్ బయటికి రాకముందే.. వారి కళ్ల ముందు మొదటి టాస్క్ పెట్టారు ‘బిగ్ బాస్’. ఆ టాస్క్‌కు సంబంధించిన ప్రోమోలు తాజాగా విడుదలయ్యాయి. ‘ఫేస్ ది బీస్ట్’ అనే పేరుతో ఒక ఇమ్యూనిటీ టాస్క్‌ను కంటెస్టెంట్స్ ముందు పెట్టాడు ‘బిగ్ బాస్’. అసలు ఎవరూ ఊహించని విధంగా ఇద్దరు పహిల్వాన్‌లను తీసుకొచ్చి.. కంటెస్టెంట్స్‌ను వారితో పోటీపడమన్నారు. దీంతో ఇంత సీరియస్ టాస్క్‌లో కూడా నవ్వులు పూశాయి. బాడీ బిల్డర్స్‌ను చూస్తూ కంటెస్టెంట్స్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్, వారితో పోటీపడడం కోసం కంటెస్టెంట్స్ పడిన కష్టాలు ప్రోమోలో చూపించారు.


బాడీ బిల్డర్స్‌తో కామెడీ..
తాజాగా విడుదలయిన ‘బిగ్ బాస్’ సీజన్ 7 డే 3 రెండో ప్రోమోలో ముందుగా బాడీ బిల్డర్‌తో తలపడడం కోసం యావర్‌ను పిలిచారు ‘బిగ్ బాస్’. ప్రిన్స్ యావర్‌కు అప్పుడే కండల వీరుడు అనే పేరు వచ్చింది. అయితే ఆ కండలతో బాడీ బిల్డర్‌తో పోటీపడడానికి చాలా కష్టపడ్డాడు యావర్. తనను కంటెస్టెంట్స్ అంతా కలిసి బాగానే సపోర్ట్ చేశారు. ఆ తర్వాత టాస్క్ చూసి దిమ్మదిరిగింది అంటూ దామిని వ్యాఖ్యలు చేసింది. ఆ తర్వాత హీరో శివాజీ టర్న్ వచ్చింది. బాడీ బిల్డర్‌ను చూసి శివాజీ భయపడుతుంటే.. లేడీ బాడీ బిల్డర్‌ను పిలవాలా అంటూ షకీలా జోకులేసింది. అయినా కూడా వద్దంటూ శివాజీ రింగ్‌లోకి ఎంటర్ అయ్యాడు. ఎంటర్ అవ్వగానే బాడీ బిల్డర్.. ఒక్కసారిగా తనను వెనక్కి తోయడంతో కిందపడ్డాడు. అది కూడా తేజ.. కామెడీ చేయగా.. ఇతర కంటెస్టెంట్స్ నవ్వుకున్నారు.


రంగంలోకి దిగిన పల్లవి ప్రశాంత్..
మహిళా కంటెస్టెంట్స్‌కు కూడా బాడీ బిల్డర్‌తో పోటీపడే టర్న్ వచ్చింది. అందులో ముందుగా షకీలా.. మీతో పోటీపడితే చచ్చిపోతానంటూ యాక్షన్స్‌తోనే చూపించింది. అది చూసి ఇతర కంటెస్టెంట్స్ నవ్వుకున్నారు. టేస్టీ తేజ అయితే ఆ బాడీ బిల్డర్‌ను చూసి కనీసం రింగ్‌లోకి కూడా వెళ్లకుండా భయపడ్డాడు. అప్పుడే ఆ బాడీ బిల్డర్.. తేజ కాళ్లు పట్టుకొని బయటికి లాగి పడేశాడు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ టర్న్ వచ్చింది. పుష్ప మ్యానరిజంతో తగ్గేదే లే అన్నట్టుగా రింగ్‌లోకి ఎంటర్ అయ్యాడు ప్రశాంత్. అతడి యాక్షన్స్‌ను కంటెస్టెంట్స్ అంతా ఆశ్చర్యపోతూ చూశారు, నవ్వుకున్నారు. ఆ బాడీ బిల్డర్‌ను ఎదిరించడానికి పల్లవి ప్రశాంత్ దగ్గర ఖండ బలం లేకపోయినా.. బుద్ధి బలంతో అతడి కాళ్లను గట్టిగా పట్టుకొని కదలనివ్వలేదు. ఆ స్ట్రాటజీని ఇతర కంటెస్టెంట్స్ మెచ్చుకున్నారు. 


కన్నీళ్లు పెట్టుకున్నారు..
పల్లవి ప్రశాంత్ బాగా ఆడాడంటూ శివాజీ ప్రశంసించాడు. అతడిని చాలా స్ట్రాంగ్ అన్నాడు. అప్పటివరకు నవ్వులతో నిండిపోయిన ప్రోమో.. ఒక్కసారిగా కలర్ మారిపోయింది. గౌతమ్ కృష్ణ ఒంటరిగా కూర్చొని ‘‘ఎవరిని నమ్మేది లేదు, ఎవరికీ వినేది లేదు’’ అంటూ తనలో తాను చెప్పుకున్నాడు. ఆ తర్వాత కన్నీళ్లు పెట్టుకున్నాడు. కారణం ఏంటో తెలియదు కానీ.. ఆట సందీప్ కూడా కన్నీళ్లు పెట్టుకోవడంతో ప్రిన్స్ యావర్.. తనను దగ్గర తీసుకొని ఓదార్చాడు. ఇక ‘బిగ్ బాస్’ సీజన్ 7లో ‘ఫేస్ ది బీస్ట్’ టాస్క్‌లో గెలిచినవారికి ఏకంగా అయిదు వారాల పాటు ఇమ్యూనిటీ దొరుకుతుంది కాబట్టి ఇందులో ఎవరు విన్ అవుతారో తెలియాంటే నేటి ఎపిసోడ్ ప్రసారం అయ్యేవరకు ఎదురుచూడాల్సిందే.



Also Read: పులిహోర మొదలెట్టేసిన రతిక, ప్రశాంత్- ‘బిగ్ బాస్’ ఇంట్లో మొదటి టాస్క్ 'ఫేస్ ది బీస్ట్'