బిగ్ బాస్ సీజన్ 7లో మొదటి కెప్టెన్సీ టాస్క్ ఎండ్ స్టేజ్‌కు చేరింది. ఇప్పటికే కంటెస్టెంట్స్ అంతా జంటలుగా విడిపోయి కెప్టెన్సీకి సంబంధించిన మూడు టాస్కులు పూర్తిచేశారు. ఈ మూడు టాస్కులు పూర్తయిన తర్వాత ప్రతీ జంట నుండి ఎవరో ఒకరు మాత్రమే ఫైనల్ కెప్టెన్సీ పోటీదారులుగా నిలుస్తారు. తాజాగా కెప్టెన్సీకి సంబంధించిన చివరి టాస్క్ ప్రోమో విడుదలయ్యింది. ఇందులో కంటెస్టెంట్స్ అంతా పోటాపోటీగా ఆడడంతో పాటు ఒకరిపై ఒకరు తీవ్రంగా మండిపడడం కూడా ఈ ప్రోమోలో కనిపించింది. ముఖ్యంగా సందీప్, పల్లవి ప్రశాంత్ మధ్య గట్టి పోటీ నడిచినట్టు తెలుస్తోంది.


కెప్టెన్సీ రేసులో ఆ నలుగురు..


ముందుగా ఈ ప్రోమోలో ‘‘సీజన్ 7లో మొదటి కెప్టెన్ అయ్యేందుకు బిగ్ బాస్ మీకు ఇస్తున్న టాస్క్.. రంగు పడుద్ది రాజా. మీ టీషర్ట్‌పై మీ పోటీదారుల యొక్క పెయింట్ అంటకుండా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఆఖరి రౌండ్‌లో ఎండ్ బజర్ మోగే సమయానికి ఎవరి టీషర్ట్‌పై తక్కువ పెయింట్ ఉంటుందో వారు ఈ సీజన్ యొక్క మొట్టమొదటి కెప్టెన్‌గా నిలుస్తారు’’ అని టాస్క్ గురించి స్పష్టంగా వివరించారు బిగ్ బాస్. దీన్ని బట్టి చూస్తే కెప్టెన్సీ ఫైనల్ రేసులో ఉన్న టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ, పల్లవి ప్రశాంత్, సందీప్.. ఒక సర్కిల్‌లో ఉంటూ తమ రంగును ఇతరుల టీషర్ట్‌పై రుద్దడానికి ప్రయత్నించారు. ఈ టాస్కులో ప్రియాంక సంచాలకురాలిగా వ్యవహరిస్తోంది.


కొట్టి చూపించాలా అంటూ సందీప్ వార్నింగ్..


టాస్క్ ప్రారంభం అవ్వగానే సందీప్, పల్లవి ప్రశాంత్.. తేజను టార్గెట్ చేశారు. దీంతో తేజ వెంటనే ఔట్ అయిపోయాడు. ఆ తర్వాత ప్రశాంత్, సందీప్ మధ్య పోటీ మొదలయ్యింది. సందీప్ టీషర్ట్ లాగి మరీ.. రంగు పూయాలని ప్రయత్నించాడు ప్రశాంత్. ఇదంతా బయట నుండి గమనిస్తున్న అమర్‌దీప్.. ‘‘వీడు లాగాడు షర్ట్’’ అని ప్రశాంత్‌ను చూపిస్తూ అరిచాడు. ఆ తర్వాత సందీప్.. ‘‘మొహం మీద కొట్టావు నువ్వు’’ అంటూ ప్రశాంత్‌పై అరవడం మొదలుపెట్టాడు. దానికి ప్రశాంత్ ఒప్పుకోలేదు ‘‘నువ్వే కొట్టావు’’ అంటూ వాదించాడు. దానికి కోపం తెచ్చుకున్న సందీప్.. ‘‘కొట్టి చూపించాలా’’ అని ప్రశాంత్‌ను అడిగాడు. దానికి ప్రశాంత్.. చేతులు కట్టుకొని సందీప్ ముందు నిలబడి.. ‘‘కొట్టు అన్న’’ అని వ్యంగ్యంగా అన్నాడు. 


కొడితే తాటతీస్తా..


ఆ తర్వాత సందీప్.. ప్రశాంత్‌ను సర్కిల్ నుండి బయటికి లాగడానికి ప్రయత్నించడంతో తను రేసు నుండి తప్పుకోవాల్సిందే అని సంచాలకురాలిగా ప్రియాంక వెల్లడించింది. ‘‘తోసుకోకూడదని రాసారా? తోసుకుంటారు బయటికి వెళ్లడానికి. నన్ను తోసినప్పుడు నేను తోయనా? నన్ను కొడితే నేను వాడి తాటతీస్తా’’ అంటూ ప్రియాంకపై సీరియస్ అయ్యాడు సందీప్. అదే సమయంలో ప్రశాంత్‌ను సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు శివాజీ. దానికి అమర్‌దీప్‌కు కోపం వచ్చి ‘‘ప్రశాంత్ గెలుస్తాడు నువ్వేం కంగారుపడకు’’ అన్నాడు. ‘‘జనాలు చూస్తున్నారులే ఆగు’’ అన్నాడు శివాజీ. ‘‘జనాలు చూస్తే నేనే వెళ్లిపోతా ఎల్లుండి’’ అని అమర్‌దీప్ సమాధానమిచ్చాడు. తేజ, సందీప్ రేసు నుండి తప్పుకున్న తర్వాత గౌతమ్, ప్రశాంత్ కెప్టెన్సీ కోసం పోటీపడ్డారు. ఇక వీరిద్దరిలో బిగ్ బాస్ సీజన్ 7 మొదటి కెప్టెన్ ఎవరు అయ్యారో తెలియాలంటే నేడు ప్రసారమయ్యే ఎపిసోడ్ చూడాల్సిందే.



Also Read: గుక్కపట్టి ఏడ్చేసిన అమర్, ప్రశాంత్- ఫ్లోలో నిజం ఒప్పేసుకున్న శివాజీ!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial