బిగ్ బాస్ సీజన్ 7లో ఒక వారం కలిసున్న తర్వాత, హౌజ్ వాతావరణం అంతా బాగానే ఉంది అని అనిపించినా.. నామినేషన్స్ సమయానికి మళ్లీ వాడివేడి వాతావరణం కనిపిస్తోంది. ఒకరిపై ఒకరు చెప్పుకుంటున్న కారణాలు, దానికి అవతల కంటెస్టెంట్స్ ఇస్తున్న సమాధానాలు.. ఇవన్నీ కంటెస్టెంట్స్ మధ్య వాగ్వాదాలను పెంచుతున్నాయి. ముఖ్యంగా శివాజీపై జరిగిన నామినేషన్స్‌లో కంటెస్టెంట్స్ అంతా తమ పాయింట్స్‌ను వినిపిస్తున్నా అవి వినడానికి కూడా శివాజీ సిద్ధంగా లేరు. ప్రియాంక జైన్, శివాజీ మధ్య జరిగిన వాగ్వాదం పర్సనల్ అటాక్‌లాగా ఉంది అని ప్రేక్షకులు భావించారు.


ప్రశాంత్‌కే సపోర్ట్..
నేటి (సెప్టెంబర్ 11న) ఎపిసోడ్‌లో శివాజీని ఎవరు నామినేట్ చేయాలని అనుకుంటున్నారు అనగానే.. అమర్‌దీప్, ప్రియాంక, షకీలా, శోభా శెట్టి, దామిని ముందుకు వచ్చారు. ముందుగా అమర్‌దీప్.. తనను ఆట ఆడడం లేదని ఊరికే టార్గెట్ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నారని కారణం చెప్పాడు. అంతే కాకుండా ఊరికే ప్రశాంత్‌ను పొగుడుతుంటే మిగిలిన వాళ్లు ఆడడం లేదనే భావన కలుగుతుందన్నాడు. బలహీనంగా ఉన్నవాళ్లను సపోర్ట్ చేస్తా అనడం కరెక్ట్ కాదని అన్నాడు అమర్‌దీప్. దానికి సమాధానంగా శివాజీ.. ‘నేను బలహీనంగా ఉన్నవాళ్లతోనే ఉంటా. వారిని కూడా నాతో పాటు ముందుకు తీసుకువెళ్తా. నా బిడ్డల మీద ఒట్టు బలహీనమైన సెక్షన్ కోసం ఉంటా అన్నదే నా నినాదం’ అని స్టేట్‌మేంట్ ఇచ్చారు. అమర్‌దీప్ నామినేషన్ పూర్తయిన తర్వాత ప్రియాంక రంగంలోకి దిగడంతో వాతావరణం మరింత వేడిగా మారింది.


అమర్యాదగా మాట్లాడొద్దు..
ప్రియాంక వచ్చి పనుల్లో యాక్టివ్‌గా పాల్గొనడం లేదని ముందుగా ఒక కారణం చెప్పి శివాజీని నామినేట్ చేసింది. ఇసుక టాస్కులో శివాజీ చేసిన తప్పుల గురించి చెప్తుండగా.. తన మాట వినకుండా నామినేట్ చేసి వెళ్లిపో అన్నట్టుగా మాట్లాడాడు శివాజీ. అప్పుడు కూడా ఇలాగే చేశారు అంటూ ప్రియాంక ఆయన తప్పును ఎత్తిచూపింది. సామెతలు చెప్పడం, హేళన చేయడంలాంటివి చేస్తున్నారంటూ చెప్పింది. ప్రియాంక చెప్పిన ప్రతీ మాటను మధ్యలో ఖండిస్తూ మాట్లాడాడు శివాజీ. పో అంటూ అమర్యాదగా మాట్లాడాడు. అలా తనతో ప్రవర్తించవద్దు అని, తనకు నచ్చదు అంటూ గట్టిగా చెప్పింది ప్రియాంక. నామినేషన్స్ పూర్తియిన తర్వాత ప్రియాంకను పో అంటూ హేళనగా మాట్లాడిన శివాజీ ‘ముందు గేమ్ ఆడు’ అంటూ కామెంట్ చేశాడు. దానికి ‘ఆడుతున్నాను’ అంటూ ప్రియాంక సమాధానం ఇవ్వగా ‘ఎంజాయ్ చేయడానికి వచ్చావు’ అంటూ శివాజీ విమర్శించాడు. ‘ట్రిప్‌కు వచ్చాను కదా’ అంటూ వెటకారం చేసింది ప్రియాంక. ‘హౌజ్‌ను మ్యానేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నావు. అది జరగదు. నీ వల్ల కాదు’ అంటూ అధికారికంగా మాట్లాడే ప్రయత్నం చేశాడు శివాజీ. దానికి సమాధానంగా ‘నేను మ్యానేజ్ చేస్తే వేరేలా ఉంటుంది’ అని తన మాటను తిప్పికొట్టింది ప్రియాంక.


మైండ్ గేమ్స్ ఆడుతున్నారు..
శివాజీతో సన్నిహితంగా ఉండే షకీలా కూడా తనను నామినేట్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ‘మీరు మైండ్ గేమ్స్ ఆడుతున్నారు. మీరు హౌజ్‌లో ఉండే నేను మైండ్ గేమ్ ఆడలేను’ అనే కారణంతో శివాజీని నామినేట్ చేసింది షకీలా. ఆ తర్వాత శోభా శెట్టి, దామిని కూడా ఇంచుమించు ప్రియాంక చెప్పిన కారణాలే చెప్పి శివాజీని నామినేట్ చేశారు. ఎవరు, ఏం మాట్లాడినా శివాజీ వినకుండా వ్యంగ్యంగా సమాధానాలు ఇవ్వడంపై ప్రేక్షకులు విమర్శలు కురిపిస్తున్నారు. ఫన్‌గా ఉన్నంతసేపు శివాజీ బాగుంటున్నాడని, ఎవరైనా విమర్శిస్తే ఒప్పుకోవడం లేదని బిగ్ బాస్ ఫ్యాన్స్.. తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.


Also Read: 'పెదకాపు'లో నా క్యారెక్టర్ చూసి ఇక ఆపు తల్లీ అంటారు, ఆ విషయాలు ఇక్కడ వద్దు: అనసూయ


Join Us on Telegram: https://t.me/abpdesamofficial