బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చారంటే ప్రతీ కంటెస్టెంట్.. విన్నర్ అవ్వాలని, కప్ గెలవాలనే చూస్తారు. ఆ క్రమంలో ఎన్నో వాగ్వాదాలు, గొడవలు జరుగుతూ ఉంటాయి. అయితే మిగతా బిగ్ బాస్ సీజన్స్‌కు భిన్నంగా ఈసారి బిగ్ బాస్‌లో ఎవరూ హౌస్‌మేట్స్ కాదని, అందరూ కేవలం కంటెస్టెంట్స్ మాత్రమే అని లాంచ్ డే రోజే ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున. దీంతో ఇప్పుడు కంటెస్టెంట్స్ మధ్య మరింత పోటీ ఎక్కువయ్యింది. అందరూ కంటెస్టెంట్స్ నుంచి హౌస్‌మేట్స్ లాగా పోటీపడడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ క్రమంలో బిగ్ బాస్.. వారికి ఇచ్చిన మొదటి టాస్క్ పూర్తయ్యింది. ఇందులో ఆట సందీప్, ప్రియాంక జైన్, రతిక, శివాజీ గెలిచారు. ఈ నలుగురిలో కేవలం ఇద్దరు మాత్రమే ఫైనల్‌కు వెళ్తారని, ఆ ఇద్దరు ఎవరో నిర్ణయించుకునే అవకాశం కంటెస్టెంట్స్‌కు ఇస్తున్నానని బిగ్ బాస్ చెప్పడంతో కంటెస్టెంట్స్ అంతా కలిసి ఆ ఇద్దరినే టార్గెట్ చేసినట్టుగా అనిపించింది.


అనర్హులుగా ప్రకటించిన కంటెస్టెంట్స్..
ముందుగా ఇమ్యూనిటీ కోసం బిగ్ బాస్.. ‘ఫేస్ ది బీస్ట్’ అనే టాస్క్‌ను ఇచ్చారు. ఈ టాస్క్‌లో కంటెస్టెంట్స్ అంతా బాడీ బిల్డర్స్‌తో తలపడ్డారు. అందులో ఆట సందీప్, ప్రియాంక జైన్.. ఎక్కువసేపు తలపడి.. ఫైనల్స్‌కు సెలక్ట్ అయ్యారు. ఆ తర్వాత బిగ్ బాస్‌ను ఇంప్రెస్ చేసే టాస్క్‌లో రతిక, శివాజీ గెలిచారు. ముందుగా శివాజీ.. తనకు కాఫీ పౌడర్ కావాలని కోప్పడుతూ చేసిన ప్రయత్నం బిగ్ బాస్‌ను ఇంప్రెస్ చేసింది. ఆ తర్వాత రతికను యాక్టివిటీ రూమ్‌లోకి గంటపాటు ఒకే పాటను వినిపించి.. ఆ తర్వాత దాని గురించి ఒక ప్రశ్న అడిగారు. రతిక.. సరైన సమాధానం చెప్పడంతో తను కూడా ఇమ్యూనిటీ టాస్క్‌కు సెలక్ట్ అయ్యింది. కానీ సందీప్, ప్రియాంకలాగా.. రతిక, శివాజీ.. బాడీ బిల్డర్స్‌తో తలపడి గెలవలేదని కంటెస్టెంట్స్ అంతా వారి మీద అసూయను పెంచుకున్నారు.


ఒక్కరితోనే క్లోజ్..
సందీప్, ప్రియాంక, రతిక, శివాజీ.. ఈ నలుగురిలో ఇమ్యూనిటీకి ఎవరు అనర్హులు అనే విషయంలో రతికకు, శివాజీకే ఎక్కువగా ఓట్లు పడ్డాయి. పైగా కంటెస్టెంట్స్ అంతా ఏయే కారణాలు చెప్పినా.. చివరికి సందీప్, ప్రియాంకలాగా వారు ఆడి గెలవలేదనే కారణాన్నే ముఖ్యంగా చూపించారు. రతిక విషయంలో తను ఏ పనులు చేయడం లేదని, ఒకరితోనే ఎక్కువ సన్నిహితంగా ఉంటుందని, మిగతా అందరితో కూడా మాట్లాడితే బాగుంటుంది అనే కారణాన్ని దామిని చెప్పింది. కిరణ్ రాథోడ్, షకీలా కూడా అసలు రతికతో ఏ బాండింగ్ లేదని చెప్పారు. ఫేస్ ది బీస్ట్ టాస్క్‌లో రతిక.. వెంటనే ఓడిపోయిందని శోభా శెట్టి కారణంగా చెప్పింది.


రతిక కన్నీళ్లు.. శివాజీ కోపం..
రతికతో పాటు శివాజీని కూడా టార్గెట్ చేశారు కొందరు కంటెస్టెంట్స్. గౌతమ్ కృష్ణ అయితే రతికకు, శివాజీకి ఇచ్చిన టాస్క్.. ఇంకెవరికి ఇచ్చినా.. బాగా చేస్తారని, అలా చూస్తే ఎవరైనా ఇమ్యూనిటీ టాస్క్‌కు సెలక్ట్ అయ్యిండేవారని కారణంగా చెప్పాడు. ‘మరి నువ్వు బల్లిలాగా సరిగా చేయలేదా? నువ్వు వీకా?’ అంటూ శివాజీ ఎదురుప్రశ్న వేశాడు. కంటెస్టెంట్స్ అంతా తమనే టార్గెట్ చేసేసరికి రతిక కన్నీళ్లు పెట్టుకుంది. శివాజీ కూడా తనకు చాలా కోపం వస్తున్నా కంట్రోల్‌లో ఉండడానికే ప్రయత్నించాడు. అసలు టాస్క్ ఏం ఇచ్చారో అడగకుండా ఎవరికి వారు డిసైడ్ అయిపోయి ఇలా చేయడం కరెక్ట్ కాదని రతిక వివరించే ప్రయత్నం చేసింది. ఇక బిగ్ బాస్ తాజా ఎపిసోడ్ పూర్తయ్యే సమయానికి సందీప్, ప్రియాంక మాత్రమే ఇమ్యూనిటీ టాస్క్‌కు అర్హులుగా నిలిచారు.


Also Read: సైకోలా మారిపోయిన ‘బిగ్ బాస్’ - కంటెస్టెంట్ల తలలపై పగిలిన గుడ్లు


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial