Akhil Fights With Bindu Madhavi | ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ ఓటీటీ.. రసవత్తరంగా మారింది. ఇప్పుడు ఆడియన్స్ ఫోకస్ అంతా బిందు మాధవి, అఖిల్ మీదే ఉంది. చిత్రం ఏమిటంటే.. బిందు రోజు రోజుకు ఫేమస్ అవుతుంటే.. అఖిల్ మాత్రం ఉన్న పేరు కూడా చెడగొట్టుకుంటున్నాడని అనిపిస్తోంది. దీనికి తోడు అషూరెడ్డి అఖిల్, నటరాజ్ మాస్టార్‌లు అఖిల్‌ను మరింత తప్పుదోవ పట్టిస్తున్నారనేది స్పష్టమవుతోంది. అయితే, ఇటీవల బిందు, అఖిల్ మధ్య జరిగిన వాగ్వాదంపై ‘బిగ్ బాస్’ పెద్ద పంచాయతీయే పెట్టాడు. ఓ టాస్క్‌లో అఖిల్ ‘‘నేను ఆడ..’’ అని అన్నాడు. బిందు మాధవి అతడిని అనుకరిస్తూ ‘‘నువ్వు ఏదీ ఆడ’’ అని అంది. దీంతో అఖిల్ ‘‘నువ్వు ఆడుతున్నావా?’’ అని బిందును అడిగాడు. కొద్ది సేపటి తర్వాత ‘‘నువ్వు నన్ను ఆడ ఆడ అన్నావు. మాటలు సరిగ్గా రానివ్వు’’ అని వార్నింగ్ ఇచ్చాడు. బిందు మాధవి తనను ‘ఆడంగి’ అన్నదంటూ ఏడ్చేశాడు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ‘బిందు-అఖిల్’కు వివాదాన్ని తీర్చేందుకు పెద్ద పంచాయతీయే పెట్టాడు. జడ్జిగా ముమైత్ ఖాన్‌ను రంగంలోకి దించాడు. బిందు తరఫున శివ.. అఖిల్ తరఫున నటరాజ్ మాస్టర్ వాదనలు వినిపించారు. దీన్ని నటరాజ్ మాస్టార్ బాగా ఉపయోగించుకున్నాడు. బిందుపై తనకున్న ఆక్రోశాన్ని కక్కేందుకు దీన్ని వేదికగా చేసుకున్నాడు. ‘వకీల్ సాబ్’లో పవన్ కళ్యాణ్ తరహాలో నటించే ప్రయత్నం చేశాడు.
వాదనల్లో భాగంగా బిగ్ బాస్.. అఖిల్, బిందు మద్దతుదారులను రెండు భాగాలు చేశాడు. అయితే, అఖిల్ టీమ్‌లోని అషూ రెడ్డి చాలా ఓవర్ చేస్తున్నట్లు అనిపించింది. వారంతా కలిసి బిందు మాధవిని ఒంటరి చేసే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించింది. చిత్రం ఏమిటంటే అఖిల్ టీమ్‌కు మద్దతుగా ఉన్న అరియానా.. తనకు ఇష్టం లేకుండానే బిందు గ్రూపులో ఉండాల్సి వచ్చింది. ఆమె బిందుకు మైనస్‌గా మారింది. దీనికి జడ్జిగా వ్యవహరించిన ముమైత్ ఖాన్ కూడా అఖిల్‌కు మద్దతుగా ఉన్నట్లు కనిపించింది. బిందు మాధవి తన వాదన వినిపిస్తున్నప్పుడు కూడా నటరాజ్, అఖిల్ టీమ్ మొత్తం ఆమెపై పడిపోయారు. దీంతో బిందు మాధవి విసురుగా మైక్ విసిరేసి వెళ్లిపోయింది. ఆ తర్వాత బెడ్ మీద పడుకుని ఏడ్చేసింది. చెప్పాలంటే హౌస్ మొత్తం ఒక వైపు.. బిందు మాధవి ఒక వైపు అయిపోయారనిపిస్తోంది. కేవలం శివ, మిత్ర, మహేష్ మాత్రమే బిందు సైడ్ ఉన్నట్లగా ఉంది. దీనివల్ల బయట నుంచి బిందుకు మద్దతు పెరుగుతున్నట్లు అనిపిస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ సారి కూడా అఖిల్‌కు టైటిల్ కష్టమే అనే టాక్ వినిపిస్తోంది.
Also Read: 'ఛాన్స్ వస్తే అరియనా మూతి పగలగొడతా' సరయు ఫైర్
ఏ పదమైతే అఖిల్‌ను బాధించిందో.. అదే పదాన్ని ఈ పంచాయతీలో పదే పదే వినిపించి ‘బిగ్ బాస్’ అతడి పరువును మరింత తీసినట్లయ్యింది. అఖిల్ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి ‘ఆడ’ పదాన్ని కంటెస్టెంట్లు పలకడం అతడికి కాస్త ఇబ్బందికరమైనదే. ఇక జడ్జి ముమైత్ ఖాన్ విషయానికి వస్తే.. మొదటి నుంచి ఆమె అఖిల్‌కు మద్దతుగానే ఉంది. జడ్జిగా ఉన్నా సరే.. ఆమె అతడితోనే పులిహోర కబుర్లు చెబుతూ టైంపాస్ చేస్తోంది. అఖిల్‌ను ‘బిందు’ బాధితుడిగా ముమైత్ భావిస్తోంది. చివరికి తీర్పు కూడా అఖిల్‌కు అనుకూలంగా ఇచ్చింది. అయితే, తెలుగు రాని ముమైత్ ‘ఆడ’ పదాన్ని ఎలా విశ్లేషించి తీర్పు ఇచ్చిందనే సందేహాలు నెలకొన్నాయి. అయితే, బిందు టీమ్‌లో ఉన్న అరియానా ‘బ్లాక్ షీప్’గా వ్యవహరించడం వల్లే ముమైత్ అలా తీర్పు ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. బిందు రూడ్ బిహేవియర్ అని నాగార్జున చెప్పారని, ఆమె టీమ్‌లో ఉన్న అరియానా స్వయంగా బిందు ‘ఆడ’ అన్నట్లు చెప్పిందని, నటరాజ్ మాస్టార్‌కు ఎక్కువ పాయింట్లు వచ్చాయని కారణాలు తెలిపింది. ఈ విషయంలో మహేష్ నిరసన వ్యక్తం చేశాడు. ఇలాంటి తీర్పు ముందే ఊహించానని తెలిపాడు. వాస్తవానికి బిందు మాధవి.. అఖిల్‌ను ‘ఆడంగి’ అనే ఉద్దేశంతో ఆడ అని అనలేదు. ‘‘నువ్వు ఏదీ ఆడ’’ అని మాత్రమే అన్నది. అఖిలే దాన్ని పొరపాటుగా తీసుకున్నాడు. ఇటీవల ‘డిస్నీ హాట్ స్టార్’ విడుదల చేసిన ప్రోమోలో కూడా బిందు వ్యాఖ్యలు స్పష్టంగా ఉన్నాయి. ఆ బిందు.. అఖిల్‌ను ఏమన్నదో ఈ వీడియోలో చూడండి.
అఖిల్- బిందు మధ్య జరిగిన వివాదం వీడియో:
Also Read: పునర్నవి కావాలని చేసిందా? పొరపాటు జరిగిందా?