తెలుగు ప్రేక్షకుల ఫేవరెట్ షో బిగ్ బాస్ ఇప్పటికే ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. ఏడాదికి ఒకసారి ఈ షోని నిర్వహిస్తుంటారు. అయితే ఈసారి బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ మొదలుపెట్టారు. ఫిబ్రవరి 26 నుంచి ఈ షోని టెలికాస్ట్ చేస్తున్నారు. ఈ షో స్పెషాలిటీ ఏంటంటే.. నాన్ స్టాప్ గా హాట్ స్టార్ లో ప్రసారమవుతూనే ఉంటుంది. ఇక 24 గంటలు చూడలేని వాళ్ల కోసం హాట్ స్టార్ లో ప్రతిరోజు ఓ గంట ఎపిసోడ్ ని టెలికాస్ట్ చేస్తారు. ఈ విషయాన్ని ముందే చెప్పారు. ఈ గంటలోనే మొత్తమన్నీ కవర్ అయిపోతాయన్నమాట. 


అయితే ఇప్పుడు రోజుకి రెండు స్పెషల్ ఎపిసోడ్స్ ని టెలికాస్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ చూడలేని వారికోసం ఉదయం పది గంటలకు ఒక ఎపిసోడ్, రాత్రి 9 గంటలకు మరో స్పెషల్ ఎపిసోడ్స్ ని టెలికాస్ట్ చేయనున్నారు. ఈ విషయాన్ని ఓ ప్రోమో ద్వారా వెల్లడించారు. ఇక షో మొదలైన రెండో రోజే నామినేషన్స్ పెట్టి హౌస్ మేట్స్ మధ్య గొడవలు పెట్టేశారు బిగ్ బాస్. అలానే కెప్టెన్సీ టాస్క్ కూడా జరుగుతోంది. ఇదిలా ఉండగా.. సాధారణంగా నాగార్జున శనివారం, ఆదివారం మాత్రమే స్క్రీన్ పై కనిపించేవారు. అయితే ఓటీటీ వెర్షన్ కి సంబంధించి మాత్రం శనివారం మాత్రమే హోస్ట్ గా కనిపించనున్నారు.


17 మంది కంటెస్టెంట్స్ తో ఈ షో మొదలైంది. మొత్తం పదిహేడు మందిలో పాతవాళ్లు, కొత్తవాళ్లు అంతా ఉన్నారు. పాత వాళ్లను వారియర్స్ గా, కొత్తవాళ్లను ఛాలెంజర్స్ గా విడగొట్టారు బిగ్ బాస్. దానికి తగ్గట్లుగానే టాస్క్ లను కూడా ఇస్తున్నారు. ప్రస్తుతానికి ఇంట్లో ఛాలెంజర్స్ కే ఆధిపత్యం ఇచ్చారు. 24 గంటల ఈ షోని 84 రోజులు కంటిన్యూస్ గా ప్రసారం చేయనున్నారు. ఈసారి కంటెస్టెంట్స్ అందరూ కాస్త పేరున్న వాళ్లు కావడంతో 84 రోజుల కంటే ఎక్కువ ఉన్నా.. ఆశ్చర్యపోనక్కర్లేదు.