Bigg Boss 7 Telugu Grand Finale Live Updates: ‘బిగ్ బాస్’ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్, రన్నరప్ అమర్ దీప్ - రూ.35 లక్షలు పేద రైతులకు ఇస్తానన్న రైతు బిడ్డ

Bigg Boss Season 7 Telugu Grand Finale Live : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన లైవ్ అప్‌డేట్స్ ఈ పేజ్‌ను చూస్తుండండి. ఎప్పటికప్పుడు తాజా సమాచారం.. టీవీలో లైవ్ కంటే ముందే అందిస్తాం.

Suresh Chelluboyina Last Updated: 17 Dec 2023 11:24 PM
గెలుచుకున్న రూ.35 లక్షలు రైతులకే ఇస్తా: పల్లవి ప్రశాంత్

బిగ్ బాస్‌లో గెలుచుకున్న ప్రైజ్ మనీ రూ.35 లక్షలు.. కష్టాల్లో ఉన్న రైతులకే ఇస్తానని పల్లవి ప్రశాంత్ తెలిపాడు. బిగ్ బాస్ ట్రోఫీ అందుకున్న తర్వాత ప్రశాంత్ మాట్లాడుతూ.. ‘‘రూ.35 లక్షలను రైతుల కోసం ఇస్తాను. కష్టాల్లో ఉన్న ప్రతీ ఒక్క రైతుకు ఇస్తా. పొట్ట మీద చేయి వేసుకొని చెప్తున్నా. మాట తప్పేదే లేదు. మళ్లీ వచ్చా అంటే తగ్గేదే లే. రైతుల కోసం ఆడినా, కారు నాన్నకు ఇస్తా, నక్లెస్ అమ్మకు ఇస్తా. డబ్బు జనాలకు ఇస్తా’’ అని తెలిపాడు. ‘‘ఓటు చేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి ఒక విషయం చెబుతా. ప్రతి రోజు ఇక్కడనే తిరిగినా. తినని రోజులు కూడా ఉన్నాయి. ఇంట్లో చెప్పలేదు. వాళ్లకు తిన్నానని అబద్ధం చెప్పేవాడిని. ముందుకు నడువు, నేను వెనక ఉంటా అని బాపు మాట ఇచ్చాడు. సార్‌తో పరిచయమైంది. నాగార్జునను చూడగానే మాట రాలేదు’’ అంటూ నాగార్జునపై ఎమోషనల్‌గా కవిత చెప్పాడు ప్రశాంత్.

‘బిగ్ బాస్’ సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ - రన్నరప్ అమర్ దీప్

‘బిగ్ బాస్’ సీజన్ 7లో టాప్ 2 కంటెస్టెంట్స్‌గా అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ నిలిచారు. హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి వారిని స్టేజ్ మీదకు తీసుకొచ్చారు. అనంతరం బిగ్ బాస్ సీజన్ 7 తెలుగు విన్నర్‌గా పల్లవి ప్రశాంత్ పేరును ప్రకటించారు. అమర్ దీప్ రన్నరప్‌గా నిలిచాడు.

బిగ్ బాస్ స్టేజ్‌పై కళ్యాణ్ రామ్ సందడి

‘డెవిల్’ మూవీ ప్రమోషన్‌లో భాగంగా నందమూరి కళ్యాణ్ రామ్ బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చారు. ఆయనతోపాటు సంయుక్త కూడా వచ్చింది. ఈ సందర్భంగా ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు.

రూ.15 లక్షలతో బయటకు వచ్చేసిన యావర్ - నరేష్, రాజ్ తరుణ్ సక్సెస్

బిగ్ బాస్ హౌస్‌లోకి రూ.15 లక్షల క్యాష్ బాక్సుతో వెళ్లారు అల్లరి నరేష్, రాజ్ తరుణ్. యావర్ కుటుంబ సభ్యులు సూట్ కేసు తీసుకోవాలని చెప్పడంతో తాను అదే చేశాడు. డబ్బుతో బయటకు వచ్చేశాడు. ‘‘ఇలా రావడం నాకు నచ్చలేదు. కానీ, నా ఫ్యామిలీ నిర్ణయమే నా నిర్ణయం’’ అని తెలిపాడు యావర్. ఆ తర్వాత మిమ్మల్ని ఇక మిస్ అవుతాననే బాధ ఎక్కువగా ఉంది. ప్రతి శనివారం మిమ్మల్ని చూడాలనిపించేది. ఇక చూడలేనని బాధపడుతున్నా అన్నాడు యావర్.

‘బిగ్ బాస్’ హౌస్‌లోకి రవితేజా ఎంట్రీ - అమర్‌కు బంపర్ ఆఫర్

బిగ్ బాస్ హౌస్‌లోకి రవితేజా వచ్చాడు. ఈ సందర్భంగా అమర్‌కు మంచి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. తన తర్వాతి సినిమాలో అమర్‌కు ఛాన్స్ ఇస్తున్నట్లు వెల్లడించాడు. ఇందుకు హౌస్ నుంచి బయటకు వచ్చేయాలని నాగార్జున చెప్పడంతో అందుకు సిద్ధమైపోయాడు అమర్. అయితే, హౌస్‌లోకి వెళ్లాలని నాగార్జున చెప్పారు.

అర్జున్ అంబటి ఔట్ - మిగిలింది ఆ ఐదుగురే

‘బిగ్ బాస్’ హౌస్‌లో ఉన్న ఆరుగురు ఫైనలిస్టుల నుంచి అర్జున్ అంబాటి ఔటయ్యాడు. హౌస్‌లోకి వెళ్లిన యాంకర్ సుమ.. అర్జున్‌ను హౌస్ నుంచి బయటకు తీసుకొచ్చింది. అనంతరం హోస్ట్ నాగార్జున.. అర్జున్, అతడి భార్యతో ఫొటో దిగారు. ఈ సందర్భంగా అంబటి తన బిడ్డకు ఆర్కా అని పేరు పెట్టనున్నట్లు ప్రకటించాడు.

ఏడిపించేసిన.. ‘బిగ్ బాస్’ సీజన్ హౌస్‌మేట్స్ ప్రోమో - బోరున ఏడ్చేసిన తేజ

‘బిగ్ బాస్’ సీజన్ 7 ముగింపు సందర్భంగా ప్రదర్శించిన ప్రోమో.. హౌస్‌మేట్స్‌ను భావోద్వేగానికి గురిచేసింది. టేస్టీ తేజ కన్నీళ్లు ఆపుకోలేక ఏడ్చేశాడు.

హౌస్‌లో పెర్ఫార్మేన్స్‌తో అదరగొట్టిన హౌస్ మేట్స్ - వాట్ లగాదియా!

బిగ్ బాస్ హౌస్‌లో గ్రాండ్ ఫినాలే సందర్భంగా హౌస్ మేట్స్.. తమ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టారు. ‘‘వాట్ లగాదేంగే..’’ అంటూ యావర్, ‘‘మాయదారి మైసమ్మా’’ సాంగ్‌తో శివాజీ ఆకట్టుకున్నారు. ప్రియాంక ‘‘రంజితమే.. రంజితమే..’’  సాంగ్‌కు డ్యాన్స్ చేసి అదరగొట్టింది. పల్లవి ప్రశాంత్.. మొక్కలు పట్టుకుని ‘‘తగ్గేదేలే..’’ సాంగ్‌కు డ్యాన్స్ చేశాడు. అర్జున్.. ‘‘సలాం రాఖీ భాయ్’’ సాంగ్‌కు డ్యాన్స్ చేశాడు. అమర్ దీప్ ‘‘రాజా రాజా ది గ్రేట్ రా’’ పాటకు చిందేశాడు. చివరిలో అందరూ ‘‘బ్యాడ్ యాస్’’ సాంగ్‌కు డ్యాన్స్ చేశారు.

నా బిడ్డ కోసం కాకినాడ, బెంగళూరు నుంచి అభిమానులు వచ్చారు - పల్లవి ప్రశాంత్ తండ్రి

పల్లవి ప్రశాంత్ గురించి కాకినాడ, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి జనాలు వస్తున్నారని ఆయన తండ్రి చెప్పారు. తమ పనులు ఆగిపోతున్నా.. తమ అబ్బాయిపై వారు ప్రేమ చూపుతున్నారని అన్నారు. నేను సీక్రెట్ చెప్పబోతున్నా 3 నెలల కిందట బిగ్ బాస్ ఆఫర్ వచ్చినట్లు చెప్పారు. ఆయన వెళ్లను అంటే రివర్స్‌లో నువ్వు వెళ్లలేవు.. ఆడలేను అన్నాను. అందుకే, పట్టుదలతో నాన్న బిగ్ బాస్‌కు వెళ్లారని శివాజీ చిన్న కొడుకు చెప్పాడు.

‘బిగ్ బాస్’ నుంచి బయటకు వెళ్లాక జీవితమే మారిపోయింది - కంటెస్టెంట్స్

బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత మీ జీవితాలు ఎలా ఉన్నాయని నాగార్జున అడిగిన ప్రశ్నకు కంటెస్టెంట్స్ తమ అభిప్రాయాలు చెప్పారు. తనపై నెగిటివిటీ పెరిగినా.. పాజిటివ్‌గా ముందుకెళ్తున్నానని శోభా తెలిపింది. భోలే షావలి.. అశ్వినీ శ్రీతో కాకుండా శుభశ్రీతో సాంగ్ ఆల్బమ్ చేసినట్లు వెల్లడించారు. గౌతమ్‌కు మూడు సినిమాలకు ఆఫర్ వచ్చినట్లు వెల్లడించాడు. బిగ్ బాస్ తనని టెన్ స్టెప్స్ పైకి తీసుకెళ్లినట్లు సందీప్ చెప్పాడు. ‘యానిమల్’కు కూడా కొరియోగ్రఫీ చేసినట్లు వెల్లడించారు. శుభశ్రీ కూడా పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ మూవీలో ఆఫర్ కొట్టేసినట్లు వెల్లడించింది. అవి కాకుండా మరో రెండు సినిమాల్లో ఆఫర్ వచ్చినట్లు వెల్లడించారు.

మొదలైన బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే

ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే లైవ్. ధీరా ధీరా సాంగ్‌కు నాగార్జున స్టైలిష్ ఎంట్రీ.

7 గంటల నుంచి ‘బిగ్ బాస్’ ఫినాలే లైవ్ ఆరంభం

‘బిగ్ బాస్’ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే లైవ్.. ఆదివారం రాత్రి 7 గంటల నుంచి ప్రసారం కానుంది. సుమారు 10 గంటలకు విజేతను ప్రకటించే అవకాశాలున్నాయి.

‘బిగ్ బాస్’ స్టేజ్‌పై మెరిసిన హీరోలు

'బిగ్ బాస్' సీజన్ 7 గ్రాండ్ ఫినాలేలో స్టేజి మీద ఐదుగురు హీరోలు సందడి చేశారు. మాస్ మహారాజా రవితేజ సంక్రాంతికి విడుదల చేయనున్న తన 'ఈగల్' చిత్రాన్ని 'బిగ్ బాస్ 7' ఫినాలేలో ప్రమోట్ చేశారు. నాగార్జున 'నా సామి రంగ' సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్న అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కూడా వచ్చారు. వీరిద్దరు బిగ్ బాస్ ప్రైజ్ మనీ సూట్ కేసుతో హౌస్‌లోకి వెళ్లారు. నందమూరి కళ్యాణ్ రామ్ కూడా బిగ్ బాస్ స్టేజ్‌పైకి వచ్చారు. ప్రముఖ యాంకర్ సుమ కనకాల తనయుడు, యువ హీరో రోషన్ కూడా బిగ్ బాస్‌ స్టేజ్‌పై మెరిశాడు. 

కనిపించని షకీలా, కిరణ్ రాథోడ్

ఆదివారం ప్రసారం కానున్న ‘బిగ్ బాస్’ సీజన్ 7 గ్రాండ్ ఫినాలేలో హౌస్ నుంచి ఎలిమినేటైన కంటెస్టెంట్స్ అంతా పాల్గొన్నారు. అయితే, షకీలా, కిరణ్ రాథోడ్ మాత్రం హాజరు కానట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమోలో వారిద్దరు కనిపించలేదు.

Background

Bigg Boss Season 7 Telugu Grand Finale Live Updates : ‘బిగ్ బాస్’ సీజన్ 7 ఉల్టాపుల్టా.. ఆదివారం రాత్రితో ముగియనుంది. డిసెంబరు 17, రాత్రి 7 గంటలకు ప్రసారమయ్యే గ్రాండ్ ఫినాలేలో విన్నర్ ఎవరో తేలిపోనుంది. హౌస్‌లో ఉన్న టాప్-6 కంటెస్టెంట్‌లలో ఇప్పటికే నలుగురు బయటకు వచ్చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ‘బిగ్ బాస్’ గ్రాండ్ ఫినాలే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. దీంతో సోషల్ మీడియాలో లీకులు మొదలయ్యాయి. యావర్, ప్రియాంక జైన్, అర్జున్ అంబటి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారని సమాచారం. అయితే, యావర్ రూ.15 లక్షల సూట్‌కేస్‌తో హౌస్ నుంచి బయటకు వచ్చేసినట్లు తెలుస్తోంది. చివరిగా శివాజీ, అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ ఉన్నట్లు సమాచారం. 


అయితే, శివాజీ కూడా హౌస్ నుంచి బయటకు వచ్చేసినట్లు తాజా సమాచారం. అంటే.. తుదిపోరు అమర్ దీప్, పల్లవి ప్రశాంత్ మధ్యే ఉందన్నమాట. అయితే, ఇప్పటికే విన్నర్ ఎవరు అనేది సోషల్ మీడియా తేల్చేసింది. పల్లవి ప్రశాంత్‌ తప్పకుండా ట్రోపీ గెలుచుకుంటాడని, అతడి మాత్రమే దానికి అర్హుడనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరి, అధికారిక ఓటింగ్ ఎలా ఉందో చూడాలి. ఎందుకంటే.. శివాజీ తన ప్రవర్తన వల్ల అభిమానులను కోల్పోవడంతో అంతా అమర్, పల్లవి ప్రశాంత్‌‌కు సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. అమర్‌కు సీరియల్ ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఫాలోయింగ్ లభిస్తోంది. దీంతో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయనేది ‘బిగ్ బాస్’ నిర్వాహకులకే తెలుస్తుంది. 


ఆదివారం ప్రసారం కానున్న ‘బిగ్ బాస్’ సీజన్ 7 గ్రాండ్ ఫినాలేలో హౌస్ నుంచి ఎలిమినేటైన కంటెస్టెంట్స్ అంతా పాల్గొన్నారు. అయితే, షకీలా, కిరణ్ రాథోడ్ మాత్రం హాజరు కానట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమోలో వారిద్దరు కనిపించలేదు.


ఎప్పుడు మొదలైంది? ఎంతమంది కంటెస్టెంట్స్?


ఉల్టాపుల్టా కాన్సెప్ట్‌తో సెప్టెంబరు 3న ‘బిగ్ బాస్’ సీజన్ 7 మొదలైంది. మొదట్లో 14 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. ఆ తర్వాత ‘బిగ్ బాస్’ 2.0 పేరుతో మరో నలుగురికి హౌస్‌లోకి పంపారు. ఈ సీజన్‌లో పాల్గొన్న కంటెస్టెంట్స్ వీళ్లే. 


ఏయే కంటెస్టెంట్ ఎప్పుడు ఎలిమినేట్ అయ్యారంటే.. 


1. కిరణ్ రాథోడ్ (నటి) - మొదటి వారం ఎలిమినేటెడ్ 
2. షకీలా (నటి) - 2వ వారం ఎలిమినేటెడ్
3. దామిని (సింగర్) - 3వ వారం ఎలిమినేటెడ్
4. రతిక (నటి, ఇన్‌ఫ్లూయెన్సెర్) - 4వ వారం, రీ ఎంట్రీ తర్వాత 11వ వారం
5. శుభశ్రీ (లాయర్, నటి) - 5వ వారం ఎలిమినేటెడ్ 
6. నయని పావని (నటి) - 6వ వారం ఎలిమినేటెడ్ 
7. పూజ (సీరియల్ నటి) - 7వ వారం ఎలిమినేటెడ్ 
8. ఆట సందీప్ (కొరియోగ్రాఫర్) - 8వ వారం ఎలిమినేటెడ్
9. టేస్టీ తేజ (జబర్దస్త్ కమెడియన్) - 9వ వారం ఎలిమినేటెడ్
10. భోలే షావలి - 10వ వారం ఎలిమినేటెడ్
11. అశ్వినీ శ్రీ - 11వ వారం 
12. డాక్టర్ గౌతం (నటుడు) - 12వ వారం ఎలిమినేటెడ్ 
13. శోభా శెట్టి (‘కార్తీక దీపం’ నటి) - 13వ వారం ఎలిమినేటెడ్


టాప్-6 ఫైనలిస్టులు వీరే


1. పల్లవి ప్రశాంత్ (రైతు) - ఫైనలిస్ట్
2. అమర్ దీప్ (‘జానకి కలగనలేదు’ నటుడు) - ఫైనలిస్ట్ 
3. ప్రిన్స్ యవార్ (‘నా పేరు మీనాక్షి’ నటుడు) - ఫైనలిస్ట్
4. ప్రియాంక జైన్ (‘జానకి కలగనలేదు’ సీరియల్ నటి) - ఫైనలిస్ట్ 
5. శివాజీ (హీరో) - ఫైనలిస్ట్
6. అర్జున్ అంబాటీ (సీరియల్ నటుడు) - ఫైనలిస్ట్


‘బిగ్ బాస్’ సీజన్ 7కు సంబంధించిన అన్ని ఎపిసోడ్స్, స్పెషల్ స్టోరీస్ చూసేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.