'శక్తి చూపరా డింభకా'..    


బిగ్ బాస్ సీజన్ 5 మొదలైన సంగతి తెలిసిందే. సోమవారం నాడు హౌస్ లో నామినేషన్ ప్రక్రియ జరగ్గా.. మంగళవారం నాడు కొన్ని టాస్క్ లతో హౌస్ మేట్స్ ని ఆడించారు బిగ్ బాస్. ఉదయాన్నే 'సైడ్ సైడ్ సైడ్ ప్లీజ్' అనే పాటకి స్టెప్పులు వేసి రచ్చ చేశారు కంటెస్టెంట్స్. ఆ తరువాత బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరికీ 'శక్తి చూపరా డింభకా' అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ ప్రకారం.. ఉరుముల శబ్దం వచ్చిన ప్రతీసారి హౌస్ మేట్స్ పవర్ రూమ్ దగ్గర ఉన్న పవర్ స్కాన్ మీద చేయి పెట్టాల్సి ఉంటుంది. 


పవర్ స్కాన్ గ్రీన్ కలర్ లోకి రావాలి. అప్పుడు వాళ్లకు పవర్ రూమ్ యాక్సెస్ వస్తుంది. ఎక్కువ సార్లు పవర్ రూమ్ దగ్గరకు వెళ్లిన వాళ్లకు కెప్టెన్సీ పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే ముందుగా ఉరుముల సౌండ్ వచ్చినప్పుడు విశ్వ పవర్ స్కాన్ మీద హ్యాండ్ పెట్టడంతో అతడికి పవర్ రూమ్ యాక్సెస్ లభించింది. దీంతో విశ్వను పవర్ రూమ్ లోకి పిలిచి షాకిచ్చారు బిగ్ బాస్. తాను ఎన్నుకున్న ఇద్దరి ఇంటి సభ్యుల ఒంటిపై ఉన్న దుస్తులతో సహా అన్ని వస్తువులను స్టోర్ రూమ్ లో పెట్టాలని చెప్పారు. ఏ హౌస్ మేట్స్ ను ఈ టాస్క్ కోసం ఎన్నుకుంటారో వాళ్లు ఆపోజిట్ జెండర్ బట్టలు అడిగి వేసుకోవాల్సి ఉంటుంది. ఈ టాస్క్ చేయడానికి యాంకర్ రవి, ప్రియలను ఎంచుకున్నాడు విశ్వ. దీంతో రవి, ప్రియా తమ బట్టలన్నీ స్టోర్ రూమ్ లో పెట్టేశారు. ఈ క్రమంలో రవి ఒక ఫ్రాక్ వేసుకొని దర్శనమిచ్చాడు. రవిని అలా చూసిన హౌస్ మేట్స్ అంతా ఓ ఆట ఆదుకున్నారు. విశ్వ అయితే రవిని ఎత్తుకొని తిప్పేశాడు. సన్నీ ఏకంగా ముద్దులు పెడుతున్నట్లు వేషాలు వేశాడు. 


తమ్ముడిని తలచుకుంటూ ఏడ్చేసిన విశ్వ.. 


రవి తనను విశ్వ అన్నయ్య అని పిలుస్తుండడంతో విశ్వ ఎమోషనల్ అయ్యాడు. తన తమ్ముడు గతేడాది చనిపోయిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఏడ్చేశాడు. చనిపోయే వారం ముందు తన తమ్ముడు అమ్మతో 'అన్నయ్య అందరితో వర్కవుట్ చేయిస్తున్నాడు.. నాకు ఎన్ని సార్లు చెప్పినా నేను వినలేదు. ఈరోజు నుండి స్టార్ట్ చేస్తా అని విశ్వ షూస్ వేసుకొని వాకింగ్ వెళ్లాడట' ఆ విషయాలను రవి, మానస్ లతో చెబుతూ ఏడ్చేశాడు విశ్వ. హౌస్ లో అసలు ఎమోషనల్ అవ్వాలని అనుకోలేదని కానీ రవి అన్నయ్య అనేసరికి తమ్ముడు గుర్తొచ్చాడంటూ చెప్పుకొచ్చాడు. 


కంటెంట్ అని ఎవరూ మాట్లాడొద్దు.. 


లోబోతో కలిసి సిరి ప్రాంక్ ప్లాన్ చేసింది. ఈ క్రమంలో ఇద్దరూ తిట్టుకున్నారు.  లోబో వచ్చి ఏదైనా ప్రాబ్లెమ్ ఉంటే నాతో చెప్పు వేరే వాళ్లతో కాదని అనగా.. సిరి పట్టించుకోకుండా వెళ్లిపోయింది. దీంతో హర్ట్ అయిన లోబో ఏవేవో మాటలంటూ.. 'ముఖం చూస్కో అద్దంలో' అని డైలాగ్ వేశాడు. దానికి సిరి రియాక్ట్ అవుతూ.. 'ముఖం గురించి మాట్లాడితే ముఖం పగిలిపోద్ది' అని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇదంతా నిజమని హౌస్ మేట్స్ అనుకుంటుండగా.. ప్రాంక్ అని చెప్పి షాకిచ్చింది సిరి. ఇది చూసిన నటరాజ్ మాస్టర్ ఎమోషన్స్ తో ఆడుకోవద్దని అన్నారు. అలానే సరయు కూడా కంటెంట్ కోసం ఇదంతా చేస్తున్నారా అంటూ పెదవి విరిచింది. దీనికి సీరియస్ అయిన సిరి 'కంటెంట్ అని ఎవరూ మాట్లాడొద్దు' అని చెప్పి వెళ్లిపోయింది. ఆ తరువాత ఇదే విషయంపై విశ్వతో డిస్కస్ చేసింది సిరి. స్మోకింగ్ రూమ్ లో లోబో, సరయు కూడా ఇదే విషయం గురించి చర్చించుకున్నారు. 


కాజల్ పై మండిపడ్డ లహరి.. 




కిచెన్ రూమ్ లో ఎవరూ సరిగ్గా పని చేయడం లేదని ప్లాన్ చేసుకొని చేద్దామని కాజల్ ఇనీషియేట్ చేసింది. ఇది లహరికి నచ్చలేదు. కాజల్ తననే పెర్సనల్ గా టార్గెట్ చేస్తుందని కాజల్ పై మండిపడింది. తనపై ఎటాక్ చేస్తే ఊరుకునేదే లేదంటూ వార్నింగ్ ఇచ్చింది. ఒక పెర్సన్ కి మీరిచ్చే రెస్పాన్స్ బాలేదంటూ కాజల్ ని ఓ ఆట ఆడేసుకుంది. దీంతో కాజల్.. లహరికి క్షమాపణలు చెబుతూ తనకు ఎవరినీ హర్ట్ చేసే ఉద్దేశం లేదని చెప్పింది. అనంతరం కాజల్ కన్నీళ్లు పెట్టుకుంది. 


కాజల్ కి నిద్ర లేకుండా చేసిన మానస్.. 


సెకండ్ టైమ్ పవర్ స్కాన్ చేసే ఛాన్స్ మానస్ కొట్టేశాడు. అనంతరం పవర్ రూమ్ లోకి వెళ్లిన మానస్ కి ఓ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. తను ఎన్నుకునే హౌస్ మేట్ రాత్రి అందరూ పడుకున్న తరువాతే పడుకోవాలి. మధ్యలో ఎవరైనా లేస్తే మళ్లీ వాళ్లు పడుకునే వరకు కాజల్ మేల్కొనే ఉండాలి. 


ఆవేశంతో ఊగిపోయిన యానీ మాస్టర్.. 




రాత్రి సమయంలో జెస్సీ ఓ కుర్చీపై కాలు వేసుకొని కూర్చున్నాడు. అక్కడకు వచ్చిన యానీ మాస్టర్ కుర్చీలో నుంచి కాలు తీయమని అడిగింది. దానికి జెస్సీ ఒప్పుకోలేదు. దీంతో ఆవేశంతో ఊగిపోయింది యానీ మాస్టర్. నాటకాలు వేయకంటూ జెస్సీపై ఫైర్ అయింది. నీ వాయిస్‌ లేస్తే నా గొంతు లేవదా? అని మండిపడుతుండగా.. జెస్సీ క్లాప్స్ కొడుతూ ఆమెకి మరింత కోపాన్ని తెప్పించాడు. ఈ విషయంలో హౌస్ మేట్స్ అంతా జెస్సీని తప్పుబట్టడంతో అతడు యానీ మాస్టర్ కి సారీ చెప్పాడు. కానీ అతడు చెప్పే విధానం సరిగ్గా లేకపోవడంతో యానీ మాస్టర్ మరింత ఆగ్రహానికి గురయ్యారు. ఈ విషయంలో లోబో.. జెస్సీకి సారీ ఎలా చెప్పాలో గీతోపదేశం చేశారు. ఆ తరువాత యానీ మాస్టర్ బెడ్ పై పడుకొని ఏడ్చేశారు.