Telugu Bigg Boss 7: బిగ్ బాస్ సీజన్ 7లో ఒకవైపు హౌజ్‌మేట్స్‌తో ఫన్ టాస్కులు చేయిస్తూనే.. మరోవైపు కొందరు హౌజ్‌మేట్స్‌తో మధ్యమధ్యలో సరదాగా ఆడుకుంటున్నారు బిగ్ బాస్. ఇప్పటికే ప్రసారమయిన ఎపిసోడ్‌లో అమర్‌దీప్‌ను యాక్టివిటీ ఏరియాకు పిలిపించి 15 నిమిషాల్లో ఒక కిలో కేక్‌ను పూర్తి చేయమని తెలిపారు. అమర్ ఎంతో కష్టపడి సగం కేక్ తిని, ఇంక తన వల్ల కాదు అని చెప్పి బయటికొచ్చాడు. ఇప్పుడు అర్జున్ టర్న్ వచ్చింది. ఈసారి అర్జున్ కోసం ఏకంగా 2 కిలోల కేక్‌ను పంపారు బిగ్ బాస్. అది ఎలా పూర్తి చేయలో తెలియక అర్జున్ తిప్పలు పడుతుంటే.. మిగతా హౌజ్‌మేట్స్ అంతా కామెడీ చేశారు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది.


అర్జున్‌కు కేక్ పరీక్ష..
‘‘ఇప్పుడు అర్జున్ కోసం మాత్రమే ఆ కేక్‌ను పంపిస్తున్నాం. ఆ కేక్‌ను తను పూర్తిగా తినగలిగితే మిగతా ఇంటి సభ్యులకు కూడా కేక్ లభిస్తుంది’’ అంటూ 2 కిలోల కేక్ పంపించి అర్జున్‌కు షాకిచ్చాడు బిగ్ బాస్. ‘‘వీడే కాదు వీళ్ల ఫ్యామిలీ మొత్తం కూడా తినలేరు’’ అంటూ కేక్‌ను చూసి శివాజీ కామెడీ చేశాడు. ‘‘అమర్‌దీప్.. చూడడానికి మీకు పంపిన కేక్ బాగుందా? ఈ కేక్ బాగుందా’’ అంటూ హౌజ్‌మేట్స్‌తో కలిసి బిగ్ బాస్ కూడా కామెడీ చేశారు. ‘‘నాకు పంపిన కేకే బాగుంది’’ అని అమర్ సమాధానం చెప్పగా.. ‘‘తినడానికి ఇది బాగుంటుంది’’ అని కౌంటర్ వేశాడు బిగ్ బాస్.


మనిషి అన్నవాడు తినలేడు..
‘‘మనిషి అన్నవాడు ఎవడైనా 2 కిలోల కేక్ తింటాడా బిగ్ బాస్’’ అంటూ కేక్‌ను తినడం మొదలుపెట్టాడు అర్జున్. ‘‘నువ్వు తింటావులే తిను’’ అంటూ అమర్ ప్రోత్సహించాడు. ‘‘నిదానంగా తిను అర్జున్.. కంగారు ఎందుకు? దేవుడా అర్జున్‌కు కేక్‌ను తినే శక్తిని ప్రసాదించు’’ అంటూ అక్కడే కూర్చొని చూస్తూ ఉన్నాడు శివాజీ. ఒకే దగ్గర కూర్చొని తినలేక అర్జున్.. మధ్యమధ్యలో లేచి అటు తిటు తిరుగుతుండగా.. ప్రశాంత్ వచ్చి ‘‘నీ వల్ల అవుతుంది’’ అంటూ ప్రోత్సహించడం మొదలుపెట్టాడు. ‘‘రేయ్ కండలకు, తినే పొట్టకు ఏంట్రా సంబంధం?’’ అని అర్జున్ వాపోయాడు. ‘‘ఏం కాదు అన్నా’’ అని ప్రశాంత్ ఎంకరేజ్ చేశాడు.


అమర్ శాపం ఫలించింది..
కేక్‌ను తినలేక అర్జున్ కష్టపడడం చూసి బిగ్ బాస్.. మరో ఆఫర్ ఇచ్చారు. ‘‘యావర్‌తో కలిసి ఫినిష్ చేయండి’’ అని చెప్పాడు. ‘‘ఎలాగైనా ఫినిష్ చేయాలి మనం’’ అంటూ శివాజీ.. అర్జున్, యావర్‌లను ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టాడు. వారిద్దరూ కూడా ఆ కేక్ తినలేక ఒక స్పూన్ పెట్టుకోవడం, అటు ఇటు తిరగడం చేశారు. అయితే ఇక స్పూన్‌తో తింటే పని అవ్వదంటూ.. వాటిని తీసి పక్కన పెట్టేశాడు శివాజీ. దీంతో కష్టపడి చేతితో తిని యావర్, అర్జున్ కలిసి ఆ కేక్‌ను పూర్తిచేశారు. ఇక వారికి కూడా కేక్ దొరుకుతుంది అనే సంతోషంతో శివాజీ మురిసిపోయాడు. అయితే అమర్.. యాక్టివిటీ ఏరియాలోకి వెళ్లి కేక్‌ను తిన్న తర్వాత బయటికి వెళ్లి ఎవరికీ చెప్పొద్దు అన్నాడు బిగ్ బాస్. కానీ తర్వాత ఆయనే అమర్ కేక్ తింటున్న వీడియోను హౌజ్‌మేట్స్ ముందు లీక్ చేశాడు. అప్పుడు అర్జున్.. ఆ వీడియోను చూసి నవ్వుకోవడంతో ‘‘నాకు కిలో కేక్ పంపించారు. నీ కండలు చూసి రెండు కిలోల కేక్ పంపిస్తారు. ఇదే నా శాపం’’ అని అన్నాడు అమర్. నిజంగానే అమర్ అన్నట్టుగానే జరిగిందే అని ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.



Also Read: వరుణ్ తేజ్, లావణ్య కలిసుండే అవకాశాల్లేవ్ - వాళ్ళిద్దరి జాతకాలపై వేణు స్వామి సంచనల వ్యాఖ్యలు